Jan 11, 2023, 1:57 PM IST
జగిత్యాల : ప్రభుత్వాలు ఎంత చేసినా ప్రభుత్వాసుపత్రులు, వాటిలో పనిచేసే సిబ్బంది తీరు మాత్రం మారడంలేదు. ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లే ఆర్థికస్థోమత లేక ప్రభుత్వ దవాఖానాలు ఆశ్రయించే నిరుపేదలకు వైద్యం అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. ఇలా తాజాగా తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాకేంద్రంలోని మాతా శిశు హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.
జగిత్యాలలోని మాతా శిశు హాస్పిటల్లో ఇటీవల కాన్పు చేయించుకున్న మహిళలకు డాక్టర్లు వేసిన కుట్లు ఊడిపోయాయి. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 10 మంది బాలింతలు ఇలా కుట్లు ఊడిపోయి తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని బాలింత మహిళల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బాధిత మహిళలకు మెరుగైన వైద్యం అందించాలని... నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్పిటల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీలు, జగిత్యాల ప్రజలు కోరుతున్నారు.