May 18, 2022, 9:35 PM IST
హైదరాబాద్: బీమ్లా నాయక్ సినిమాలో ఒక్క పాటతో ఓ వెలుగు వెలిగిపోయిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భారత ప్రభుత్వం ఇటీవల బహూకరించిన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. ఈ అవార్డును తామే ఇచ్చామంటూ బిజెపి వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని... అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మొగులయ్య తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇంకా చెప్పాలంటే సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఉగాది పురస్కారం అందుకున్న తర్వాతే తనకు గుర్తింపు వచ్చిందన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడాతనకు ఎంతో సహాయం చేసారని అన్నారు. కానీ బిజెపి వాళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని... టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ హైదబాద్ లో స్థలం, కోటి రూపాయల ఆర్థిక సాయం ఇంటినుండి ఇస్తున్నాడా అని అడుగున్నారని పేర్కొన్నాడు. కాబట్టి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం పక్షానే తాను నిలబడతానని... అందువల్లే రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్న పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తానని మొగులయ్య వెల్లడించాడు.