హిందూపురంలో అమానుషం... వైసిపి నేతను ప్రశ్నించిన యువకుడిని చితకబాదిన ఎస్సై

May 1, 2022, 12:43 PM IST

అనంతపురం: దివ్యాంగురాలైన తన తల్లికి పెన్షన్ రావడంలేదని అధికార పార్టీ నాయకున్ని ప్రశ్నించడమే అతడి తప్పయింది. తననే ప్రశ్నిస్తావా అంటూ యువకుడిపై దాడిచేయడమే కాదు ఫిర్యాదుచేయడానికి వెళితే పోలీసులు కూడా బండబూతులు తిడుతూ చితకబాదారు. హిందూపురం నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి
నారా లోకేష్ స్పందిస్తూ... జగన్ సర్కార్, పోలీసులపై సీరియస్ అయ్యారు.  

''ఫిర్యాదు చెయ్యడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన బాధితుడిని  బూతులు తిడుతూ భౌతిక దాడి చెయ్యడాన్ని రాజా రెడ్డి రాజ్యాంగంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారా జగన్ రెడ్డి గారు? హిందూపూర్ నియోజకవర్గం చిలమత్తుర్ మండలం సంజీవరాయనపల్లి గ్రామంలో  దివ్యాంగురాలు పద్మావతి కి పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని కొడుకు వేణు ప్రశ్నిస్తే స్థానిక వైసిపి నేత దామోదర్ రెడ్డి దాడి చేసాడు. జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చెయ్యడానికి పోలీస్ స్టేషన్ కి వెళితే అక్కడ ఎస్ఐ ఘోరంగా అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ దాడి చెయ్యడం దారుణం. వేణు పై దాడి చేసిన వైసిపి నేతలు, ఎస్ఐ పై తక్షణమే చర్యలు తీసుకొని దివ్యాంగురాలైన తల్లి పద్మావతి కి పెన్షన్ ఇవ్వాలి'' అని లోకేష్ డిమాండ్ చేసారు.