గాడ్ ఆఫ్ మాసెస్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్న బాలకృష్ణ సినిమాల విషయంలో రూట్ మార్చాడు. గత మూడు నాలుగేళ్లుగా ఆయన కొత్త పంథాని ఫాలో అవుతున్నాడు. `అఖండ`, `వీరసింహారెడ్డి`, `భగవంత్ కేసరి` చిత్రాలతో ఆ విభిన్నతని చాటి చెప్పాడు. ఇప్పుడు మరో కొత్త కథ, సరికొత్త కథాంశంతో వస్తున్నాడు బాలయ్య.
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో `డాకు మహారాజ్` సినిమాలో నటిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రమిది. సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాల జోరు పెంచారు.
తాజాగా `డాకు మహారాజ్` సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేశారు. `ది రేజ్ ఆఫ్ డాకు` పేరుతో ఈ మొదటి పాటని విడుదల చేశారు. తమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ అదిరిపోయేలా ఉంది. 'డాకు మహారాజ్' పాత్ర తీరుని తెలియజేసేలా గీత రచయిత అనంత శ్రీరామ్ అర్థవంతమైన, శక్తివంతమైన సాహిత్యాన్ని అందించారు.
"డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా" వంటి పంక్తులతో మరోసారి తన కలం బలం చూపించారు. ఇక గాయకులు భరత్ రాజ్, నకాష్ అజీజ్, రితేష్ జి. రావు, కె. ప్రణతి తమ అద్భుతమైన గాత్రంతో పాటకు మరింత అందం తీసుకొచ్చారు.
లిరికల్ వీడియోలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఆయన గుర్రంపై స్వారీ చేస్తున్నారు తీరు, యానిమేషన్ యాక్షన్ సీన్లు మతిపోయేలా ఉన్నాయి. విజువల్ గా అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ లో భారీతనం కనిపిస్తోంది. అలాగే ప్రగ్యా జైస్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, బలమైన భావోద్వేగాలతో సినిమా అద్భుతమైన అనుభూతిని పంచనుందని లిరికల్ వీడియో స్పష్టం చేస్తోంది.
ఇందులో బాలయ్య లుక్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చేయలేదు. పీరియడ్, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్లు మేళవించి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు బాబీ. సినిమా రేంజ్ ఎలా ఉంటుందో ఇటీవల ట్రైలర్‌లో చూపించారు.
ఇప్పుడు పాటలోనూ అది స్పష్టమవుతుంది. ఈ సంక్రాంతికి బాలయ్య `డాకు మహారాజ్`తో అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఈ విజువల్స్ రేంజ్‌లో సినిమా ఉంటే సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద పూనకాలే అని చెప్పొచ్చు.