12 సిక్స్‌లు, 30 ఫోర్లు.. అజింక్య రహానే బ్యాట్‌తో ర‌ఫ్ఫాడిస్తున్నాడు

First Published | Dec 15, 2024, 9:01 AM IST

Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అజింక్య రహానే  బ్యాట్ తో ర‌ఫ్ఫాడిస్తున్నాడు. అత‌ను టోర్నీలో 170 స్ట్రైక్ రేట్‌తో 432 పరుగులు చేసి.. భార‌త జ‌ట్టులో ఉండాల్సిన ప్లేయ‌ర్ నంటూ హెచ్చ‌రిక‌లు పంపాడు.
 

Syed Mushtaq Ali Trophy: టీమిండియా జ‌ట్టు నుంచి ఔట్ అయిన అజింక్య రహానే దేశవాళీ క్రికెట్‌లో బౌలర్లపై సునామీల విరుచుకుప‌డుతున్నాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఒకదాని తర్వాత ఒకటి తుఫాను ఇన్నింగ్స్‌లు ఆడుతూ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు.

విదర్భ, ఆంధ్ర జ‌ట్ల పై అద్భుత ఇన్నింగ్స్ ల‌ను ఆడిన రహానే బరోడాపై కూడా తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.  దురదృష్టవశాత్తు అతను కేవలం 2 పరుగుల తేడాతో సెంచరీని మిస్ అయ్యాడు. రహానే వరుసగా 3 అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లు ఆడాడు. మూడు సార్లు సెంచరీల‌ను కొన్ని ప‌రుగుల‌తో కోల్పోయాడు. 

బరోడాపై ర‌హానే బ్యాటింగ్ విధ్వంసం 

అజింక్య రహానే ప్ర‌స్తుత ఫామ్ చూస్తే బౌల‌ర్లకు అత‌న్ని అడ్డుకోవ‌డం అంత తేలిక‌ కాదు. అతను గత 6 ఇన్నింగ్స్‌ల్లో 5 అర్ధ సెంచరీలు సాధించాడు. అతను టీ20లో బరోడాపై 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌తో ముంబై 6 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. ముంబై బౌలర్లు బరోడాను ఏడు వికెట్లకు 158 పరుగులకే పరిమితం చేశారు. 

Tap to resize

Ajinkya Rahane

3 ఇన్నింగ్స్‌ల్లో 3 అర్ధశతకాలు కొట్టిన ర‌హానే

అజింక్య రహానే చివరి 3 ఇన్నింగ్స్‌లను గ‌మ‌నిస్తే.. అతను వరుసగా మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. రహానే తన ఇన్నింగ్స్‌లో 95, 84, 98 పరుగులు చేశాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం 12 సిక్సర్లు, 30 ఫోర్లు కొట్టాడు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో రహానే కేవలం 56 బంతుల్లో 98 పరుగులు చేయడంతో ఆ జట్టు కేవలం 17.2 ఓవర్లలోనే విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

మూడు సార్లు సెంచ‌రీని కోల్పోయిన ర‌హానే 

అజింక్య రహానే సెంచరీకి కేవలం 2 పరుగుల దూరంలో ఉన్నాడు. జట్టు విజయానికి 2 పరుగులు మాత్రమే అవసరం. కానీ బౌలర్ అభిమన్యు రాజ్‌పుత్ బహుశా కావాల‌నే వైడ్ బాల్‌ను వేసి వుండ‌వ‌చ్చు. దాని కారణంగా స్కోరు సమానంగా మారింది. ఈ బంతికి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఆగ్రహంతో ఊగిపోయారు కానీ తర్వాతి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి రహానే అవుటయ్యాడు. రహానే గత 3 ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు నైంటీస్ లో ఔట్ అయ్యాడు.

భార‌త జ‌ట్టులోకి రావ‌డం గురించి ర‌హానే ఏం చెప్పాడంటే? 

టీమిండియాలోకి తిరిగి రావడం గురించి అజింక్య‌ రహానే మాట్లాడుతూ “టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేయడానికి ముందు, నేను దేశవాళీ క్రికెట్‌లో రెడ్ బాల్ క్రికెట్‌లో ఆరు సీజన్లు ఆడాను. ఆ తర్వాత టెస్టుల్లో అరంగేట్రం చేశాను. నేను ఇప్పటికీ క్రీడలను ప్రేమిస్తున్నాను. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే శ‌క్తి ఇప్పటికీ నాలో సజీవంగా ఉంది. జట్టు కోసం ఎప్పుడూ మంచి ప్రదర్శన చేస్తూనే ఉంటాను' అని అన్నారు. అతను ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లలో 72 సగటు, 170 స్ట్రైక్ రేట్‌తో 432 పరుగులు చేశాడు.

Latest Videos

click me!