ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఆషాడమాస ఉత్సవాలు... అమ్మవారికి సారె సమర్ఫించిన అర్చకులు

Jun 30, 2022, 2:14 PM IST

విజయవాడ : ఆషాడమాస ఉత్సవాలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమయ్యాయి. కనకదుర్గమ్మ సారెను మేళతాళాలతో ,మంగళవాయిద్యాలతో ,కోలాటాలతో అంగరంగ వైభవంగా ఆలయ అర్చకులు ఊరెగించారు. కనకదుర్గ నగర్ లోని గోశాల వద్దనుండి సారె ను ఊరేగింపుగా తీసుకువచ్చి అర్చకులు అమ్మవారికి సమర్పించారు. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో వచ్చే వారాహీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి భక్తులు సారె సమర్పిస్తుంటారు. అమ్మవారికి సారెను సమర్పిస్తే వర్షాలు బాగా పడతాయని... పంటలు సమృద్దిగా పండి దేశం సస్యశ్యామలంగా ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇందుకోసం ఆషాడమాసంలో పసుపు, కుంకుమ, చీర జాకెట్, చలివిడిని అమ్మవారికి సారెగా పెడతారు. ఆషాడ మాసం ప్రారంభం నేపథ్యంలో ఈసారి కూడా సారెను సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. సారెను  సమర్పించే భక్తులు మూడు రోజులు ముందుగానే నమోదు చేసుకోవాలని.... జులై 28వ తేదీ వరకు ఇందుకు అవకాశముందని అధికారులు తెలిపారు.