Feb 16, 2023, 5:26 PM IST
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అన్నిశాఖల కార్యదర్శులకు చీఫ్ సెక్రటరీ కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందికే రేషనలైజేషన్, పదోన్నతులు కల్పించడం లేదా ఇంచార్జీలుగా బాధ్యతలు అప్పగించడం ద్వారా త్వరితగతిన ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి తక్షణమే చర్యలు చేపట్టాలని కార్యదర్శులకు సీఎస్ ఆదేశించారు. గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం ఐదవ బ్లాక్ కలెక్టర్ల సమావేశ మందిరంలో సిఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచడం, డెలిగేషన్ ఆఫ్ పవర్స్, ఎపిపిఎస్సి ద్వారా గ్రూప్ 1,2 పోస్టుల ఖాళీల భర్తీ, ఇ-ఆఫీసు ద్వారా ఇ-రిసీప్ట్స్, ఇ-డిస్పాచ్ ఆపరేషనలైజేషన్, ఎసిబి, విజిలెన్స్ కేసుల పరిష్కారం, కలెక్టర్లతో వీడియో సమావేశాల్లో వచ్చిన అంశాలపై పాలోఅప్ చర్యలు, అసెంబ్లీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న వివిధ ఎల్ఏక్యు, ఎల్సిక్యులపై సత్వరం సమాచారం అందించడం, ఎపి ఆన్లైన్ లీగల్ కేసుల మానిటరింగ్ విధానం తదితర అజెండా అంశాలపై సిఎస్ డా.జవహర్ రెడ్డి కార్యదర్శులతో సమీక్షించారు.