Jul 21, 2021, 1:47 PM IST
తాడేపల్లి: సీఎం జగన్ భద్రతా చర్యల్లో భాగంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం సమీపంలోని అమరారెడ్డి నగర్ కాలనీలోని ఇళ్లను ప్రభుత్వ యంత్రాంగం కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. నిన్న(మంగళవారం) రాత్రి కూడా ఇళ్ల కూల్చివేత చేపట్టారు. అయితే తమకు సరయిన పరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కాలనీ వాసులు నిరసనలకు దిగుతున్నారు. దీంతో నిర్వాసితుల వివాదం ముదురుతోంది. తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటు నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసు స్టేషన్ వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో నిర్వాసితులు, స్థానిక రాజకీయ నాయకులతో తాడేపల్లి పోలీసు స్టేషన్ నిండిపోయింది. తమకు న్యాయం చేయాలని... దీనిపై హామీ వచ్చేవరకు కదిలేది లేదంటూ బాధితులు నినాదాలు చేశారు.