కెసిఆర్ కుటుంబమే డ్రగ్ బిజినెస్ చేస్తున్నది

First Published Jul 28, 2017, 1:53 PM IST
Highlights
  • కెసిఆర్ ఫ్యామిలీ డ్రగ్ వ్యాపారంలో ఉంది
  • కెటిఆర్ బలహీనతలను డ్రగ్ మాఫియా వాడుకుంటున్నది
  • కెటిఆర్ బామ్మార్ది రాజేంద్ర ప్రసాద్ పబ్ లలో డ్రగ్ వ్యాపారం
  • రాజేంద్ర  ్రపసాద్ భార్య సుమ పాకాల కూడా పబ్ డైరెక్టరే
  • హిమాన్షు చదివే స్కూల్లోనూ డ్రగ్ బిజినెస్ జరగడం బాధాకరం
  • డ్రగ్ మాఫియాకు సహకరించేవారిని ఎన్ కౌంటర్ చేయాలి

తెలంగాణ సిఎం కెసిఆర్ కుటుంబంపై మరోమారు టిడిపి నేత రేవంత్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. కెసిఆర్ కుటుంబమే నేడు డ్రగ్ వ్యాపారంలో ఉందని ఆరోపించారు. కెసిఆర్ తనయుడు కెటిఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా డ్రగ్ వ్యాపారానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. కెటిఆర్ బామ్మార్ది రాజేంద్ర ప్రసాద్ పాకాల, ఆయన సతీమణి సుమ పాకాల ఇద్దరూ ప్రత్యక్షంగా డ్రగ్ వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు.

ఎన్టీఆర్ భవన్ లో రేవంత్ మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. కెటిఆర్ బామ్మార్ది రాజేంద్ర ప్రసాద్ నిర్వహించే పబ్ లో డ్రగ్స్ తో పాటు మరిన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజేంద్ర ప్రసాద్ పాకాల నడిపే పబ్ గర్ల్స్ పికప్ సెంటర్ గా మారిపోయిందని ఆరోపించారు. మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని, వాటిని హైదరాబాద్ పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు.

కెటిఆర్ బలహీనతలను ఆసరాగా చేసుకుని హైదరాబాద్ లో డ్రగ్ వ్యాపారం జరుగుతుందని ఆరోపించారు రేవంత్. అసలు డ్రగ్స్ విషయంలో ముందుగా కెటిఆర్ బలహీనతలు ఏమిటో సిఎం కెసిఆర్ గుర్తించాలని సూచించారు. హైదరాబాద్ లో డ్రగ్ వ్యాపారానికి సహకరిస్తున్న పోలీసు అధికారులను నడి బజారులో బట్టలు విప్పి కొట్టాలని సూచించారు రేవంత్. అలాంటి అధికారులను ఎన్ కౌంటర్ చేసినా తప్పులేదన్నారు. అలా ఎన్ కౌంటర్ చేస్తే సిఎం కు సహకరిస్తామన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటి వరకు 60 ఏళ్లలో ఐదారు పబ్ లు మాత్రమే ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత మూడేళ్లలోనే 57 పబ్ లకు అనుమతించారని ఆరోపించారు. దీనికి మంత్రి కెటిఆర్ అండదండలతోనే పబ్ లన్నీ ఓపెన్ అవుతున్నాయని ఆరోపించారు.

సిఎం హోదాలో కెసిఆర్ బతుకమ్మ, బోనాల పండుగలు జరుపుతుంటే ఆయన కొడుకు కెటిఆర్ తో పాటు కెటిఆర్ బామ్మార్ది రాజేంద్ర ప్రసాద్, ఆయన భార్య సుమ...  పబ్, డ్రగ్ బిజినెస్ చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో నడిచే పబ్ లకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు కానీ కెటిఆర్ బామ్మార్ది పబ్ కు వెళ్లిన వినియోగదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు లేకుండా పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు.

కెసిఆర్ ఎంతో ప్రేమగా చూసుకునే మనవడు హిమాన్షు చదివే పాఠశాలలోనే డ్రగ్ బిజినెస్ జరుగుతుంటే మన సమాజం ఎటు పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు రేవంత్. తెలంగాణ ఉద్యమాకారుడిగా పేరుతెచ్చుకున్న కెసిఆర్ డ్రగ్ బిజినెస్ తన కుటుంబమే చేస్తుందని గుర్తించలేకపోయారా అని ప్రశ్నించారు. కెసిఆర్ తక్షణమే అధికారుల ద్వారా తన కుటుంబం ఏం చేస్తుందో వివరాలు తెప్పించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రాజకీయాలు వేరు, జీవితాలు వేరు అన్నది తాను నమ్ముతానని రేవంత్ ఉద్వేగంగా మాట్లాడారు. అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలు బుగ్గిపాలవుతుంటే నీ మనవడు, నా తమ్ముడి పిల్లలు చదివే స్కూళ్లలో మాదక ద్రవ్యాలు వినియోగిస్తుంటే మనం నివారించలేనప్పుడు ఈ కుర్చీల్లో కూర్చునే అర్హత లేదన్నారు.

click me!