ఖమ్మంలో విచిత్రం.. బహిరంగ మూత్రవిసర్జన చేశాయని ఎద్దులకు జరిమానా..

By SumaBala BukkaFirst Published Dec 6, 2022, 11:20 AM IST
Highlights

ఎద్దులు తమ కార్యాలయం ముందు మూత్రవిసర్జన చేశాయని సింగరేణి జనరల్ మేనేజర్ ఫిర్యాదు చేయడంతో.. వాటి యజమానికి వందరూపాయల జరిమానా పడిన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది.

ఖమ్మం : బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన, మల విసర్జన నేరం. దీనికి తగిన జరిమానా విధిస్తారు. అయితే, ఆచరణలో మాత్రం ఇది పెద్దగా అమలు అవ్వడం లేదు. కానీ, ఖమ్మం జిల్లా పోలీసులు చేసిన ఓ పని ఇప్పుడు చర్చనీయాంశంగామారింది. ఎద్దులు బహిరంగ మూత్ర విసర్జన చేశాయని.. వాటి యజమానికి వందరూపాయల ఫైన్ విధించారు అధికారులు. దీంతో నోరులేని మూగజీవాలపై అధికారుల తీరు విమర్శలకు దారి తీస్తోంది. 

విషయం ఏంటంటే.. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ఓ బండికి కట్టిన ఎద్దులు మూత్ర విసర్జన చేశాయి. ఆ బండిమీద వాటి యజమాని సుందర్‌లాల్ పూల కుండీలు, మట్టిని ఒక ప్రాంతం నుంచి మరో చోటికి తరలిస్తుంటాడు. ఈ క్రమంలో ఖమ్మంలోని కొత్తపూసపల్లి- పాతపూసపల్లి మధ్య రోడ్డు పక్కనున్న కార్యాలయం ఎదుట ఎద్దులు మూత్ర విసర్జన చేశాయి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉందని అధికారులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఫిర్యాదు చేసింది. 

కామారెడ్డిలో విషాదం.. అందరూ చూస్తుండగా సెల్ టవర్ కు ఉరేసుకుని రైతు ఆత్మహత్య..

దీంతో ఈ ఫిర్యాదుపై, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 290 (పబ్లిక్ న్యూసెన్స్) కింద సుందర్ లాల్ పై పోలీసు కేసు నమోదు చేశారు. అతన్ని యెల్లందులోని ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేరానికి గానూ అతను రూ.100 జరిమానా చెల్లించాలని నవంబర్ 29న నోటీసు అందింది. అయితే, తన దగ్గర డబ్బులు లేవు. "ఆ రోజు నా దగ్గర ఆ డబ్బు లేదు, అందుకే అక్కడే డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్ ను బతిమాలుకున్నాను. మళ్లీ ఇస్తాను ఇవ్వమంటే ఆ వందరూపాయలు అతను ఇచ్చాడు" అని సుందర్ లాల్ చెప్పాడు.

జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ఆగినప్పుడు నా ఎద్దులు మూత్రవిసర్జన చేస్తాయని నేను ఊహించలేదు అని సుందర్ లాల్  పేర్కొన్నాడు. ‘ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో వంశపారంపర్యంగా నాలుగు తరాలుగా సాగు చేసుకుంటున్న నా భూమికి తగిన పరిహారం అందలేదు. దీంతో ఈ ఎద్దుల బండి ఒక్కటే నాకు ఆధారం’ అని వాపోయాడు."దీనిమీద మేము కోర్టుకు వెళ్ళాము. ఎస్ సీసీఎల్ మాకు పరిహారం చెల్లిస్తానని హామీ ఇచ్చింది. అయితే మేం ఆశించినంత చెల్లించలేదు'' అని చెప్పుకొచ్చాడు.

సుందర్‌లాల్ లాంటి వ్యక్తులు వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని, పట్టణ పరిశుభ్రతను అధికారులు అంత సీరియస్ గా తీసుకుంటున్నారా? అది మంచిదేనా? మరి అన్ని తెలివితేటలు ఉన్న మనుషులు చేసే బహిరంగ మల, మూత్ర విసర్జన విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  ఈ ఘటనతో సుందర్ లాలో ఓ గుణపాఠాన్ని నేర్చుకున్నాడు. తన పశువులు ఎక్కడైనా పాడు చేస్తే శుభ్రం చేయడానికి నీటిని తీసుకువెళ్లాలని, లేదా కనీసం తన దగ్గర జరిమానాకు కట్టడానికి వీలైనా డబ్బు ఉండాలని. 

click me!