లాక్ డౌన్ ఎఫెక్ట్: 17 వరకు టాక్ టైం పెంచిన జియో

By narsimha lodeFirst Published Apr 1, 2020, 10:37 AM IST
Highlights

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో రిలయన్స్ జియో తన వినియోగదారులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. 

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో రిలయన్స్ జియో తన వినియోగదారులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. తన వినియోగదారులకు ఏప్రిల్‌ 17 వరకు 100 నిమిషాల టాక్‌టైమ్‌, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను ఉచితంగా ఇస్తున్నట్టు రిలయన్స్‌ జియో ప్రకటించింది.

కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ వల్ల చాలాచోట్ల దుకాణాలు తెరవకపోవడంతో వినియోగదారులు రీఛార్జి చేసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో జియో వినియోగదారులందరికీ ఈ ఆఫర్‌ వర్తింప చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. రీఛార్జి చేయకున్నా లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ఇన్‌ కమింగ్‌ కాల్స్‌ వసతిని కల్పిస్తున్నామని రిలయన్స్ జియో వెల్లడించింది.

‘ఈ అత్యవసర సమయంలో జియో ఫోన్‌ వినియోగదారులందరికీ 10 రెట్ల ప్రయోజనాలు. 100 నిమిషాల కాల్స్‌, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉచితంగా అందజేస్తున్నాం’ అని జియో ట్వీట్‌ చేసింది. 

అంతే కాదు, ప్రీ పెయిడ్ కనెక్షన్ల రీ చార్జీ కోసం రిలయన్స్ జియో.. దేశీయ బ్యాంకులతో సహకార ఒప్పందం కుదుర్చుకున్నది. దీంతో తన కస్టమర్లు వారి బ్యాంకు ఏటీఎం కార్డులతో రీ చార్జీ చేసుకోవచ్చు. ఈ పద్దతిని ఇంటర్నెట్ పేమెంట్ వసతి లేని వారి కోసం రిలయన్స్ జియో అందుబాటులోకి తెచ్చింది. 

రిలయన్స్ జియో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకుల్లో.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకు, సిటీ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఏయూఎఫ్ బ్యాంక్, స్టాండర్డ్ బ్యాంక్ ఉన్నాయి.

టెలికాం సంస్థలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ చాలా చోట్ల దుకాణాలు తెరిచే అవకాశం లేదని ట్రాయ్‌ తెలిపింది. వినియోగ దారులంతా ఆన్‌లైన్‌లో రీఛార్జి చేసుకోలేరు కాబట్టి ప్రస్తుతం కొనసాగుతున్న పథకాల గడువును పెంచాలని టెలికాం ఆపరేటర్లను కోరింది.

ట్రాయ్‌ సూచన మేరకు సోమవారం ఎయిర్‌టెల్‌ తమ ఎనిమిది కోట్ల మంది వినియోగదారులకు కాలపరిమితిని ఏప్రిల్‌ 17 వరకూ పొడిగించింది. పది రూపాయాల టాక్‌టైమ్‌ను జత చేసింది. వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ సైతం ఇదే ఆఫర్‌ను ప్రకటించినా కేవలం పేద వర్గాలకు మాత్రమే ఇస్తామని తెలిపింది. 

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా తన ప్రీపెయిడ్ కస్టమర్ల కనెక్షన్లను ఏప్రిల్ 20 వరకు డిస్ కనెక్ట్ చేయబోమని పేర్కొంది. ఔట్ గోయింగ్ కాల్స్ కోసం రూ.10 ఇన్సెంటివ్ టాక్ టైం ఆటోమేటిక్‌గా జత చేసింది.

click me!