మొబైల్ ఫోన్లలో డాటా చౌర్యం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. వివిధ మార్గాల్లో మన మొబైల్స్ డాటా చోరీకి గురవుతుంటుంది.... ఇలాంటి ఓ మార్గమే తాజాగా కొన్ని ఫోన్లలో కనుగొనబడింది.
ఆధునిక టెక్నాలజీ నేటి సమాజానికి ఎంత అవసరమో అంత ప్రమాదకరం కూడా. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించే సెల్ ఫోన్లనే కేటుగాళ్ల టార్గెట్ గా మారాయి. టెక్నాలజీని ఉపయోగించిన మన ఫోన్ లో చొరబడుతున్న సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి బెదిరించడంతో పాటు బ్యాంక్ వివరాలతో డబ్బులు స్వాహా చేస్తున్నారు. ఇప్పటికే అనేక రకాలుగా మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు మరిన్ని కొత్తపద్దతులను కనుగొంటున్నారు.
అయితే కొన్ని ఫోన్లలోని పాపులర్ కీబోర్డ్ యాప్స్ ద్వారా కూడా డాటా చోరీ జరిగే ప్రమాదంవుందని తెలుస్తోంది. Xiaomi, Oppo, Vivo ఫోన్‌లలోని చైనీస్ కీబోర్డ్ యాప్‌లలో టైప్ చేసే ప్రతిదీ బయటకు వెళ్లే ప్రమాదం వుందట. ఇది బిలియన్ వినియోగదారుల భద్రతను ప్రమాదంలోకి నెడుతోందని ఇంటర్నెట్ వాచ్‌డాగ్ గ్రూప్ సిటిజెన్ ల్యాబ్ తేల్చింది. చైనీస్ కీబోర్డ్ యాప్ కలిగివుండే బైడు, శామ్‌సంగ్, టెన్సెంట్, షియోమి మరియు ఇతర ప్రధాన కంపెనీల ఫోన్లలో లోపాలున్నట్లు కనుగొన్నారు.
సిటిజన్ ల్యాబ్ బైడు, హానర్, హువాయ్, ఒప్పో, సామ్ సంగ్, టెసంట్, వివో, జియోమీ ఫోన్లపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఈ ఫోన్లలో ప్రీఇన్‌స్టాల్ చేయబడిన కీబోర్డ్ యాప్‌ల ద్వారా డాటా బయటకు వెళుతున్నట్లు గుర్తించారు. దీని ప్రభావం చైనాపై ఎక్కువగా వుంటుంది... ఎందుకంటే అక్కడే ఒప్పో, హానర్, షియోమీ వాడేవారి సంఖ్య అధికంగా వుంది.