ట్రంప్ ఆంక్షలతో నో ప్రాబ్లం.. అమెరికాకే ఇబ్బంది.. మమ్నల్నేం చేయలేరు: హువావే

By telugu teamFirst Published 19, May 2019, 3:28 PM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ సంస్థపై విధించిన నిషేధం వల్ల తమ ఎదుగుదలను అడ్డుకోలేరని హువావే సీఈఓ రెన్ జెన్గ్ ఫై స్పష్టం చేశారు. అమెరికా ప్రభుత్వ నిర్ణయంపై ఇంటెల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ తదితర సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
 

అమెరికా ఆంక్షలు తమ కంపెనీ ఎదుగుదలను ఏమాత్రం ఆడ్డుకోలేవని చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావే చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) రెన్‌జెన్గ్‌ఫె స్పష్టం చేశారు. మహా అయితే కంపెనీ వృద్ధిరేటు కొంచెం తగ్గొచ్చేమోకానీ అంతకు మించి ఏమీ కాదని విశ్వాసం వ్యక్తం చేశారు. షెన్‌జెన్‌లో జపాన్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ నెల 15న హువావేపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించాక తొలిసారి రెన్‌జెన్గ్‌ఫె మీడియాతో మాట్లాడారు. తమ సంస్థ వృద్ధిరేటులో 20శాతం తగ్గుదల ఉండవచ్చేమోన్నారు. 

అమెరికా చట్టాలను అతిక్రమిస్తూ తాము ఏమీ చేయలేదని రెన్‌జెన్గ్‌ఫె పేర్కొన్నారు. అమెరికా చెప్పిన విధంగా మేనేజ్‌మెంట్‌లో మార్పులు చేసే అవకాశం కానీ, అక్కడి ప్రభుత్వ పర్యవేక్షణకు అనుమతించే అవకాశం కానీ లేదన్నారు. 

తాము అమెరికా నుంచి చిప్స్‌ను కొనుగోలు చేయకపోయినా నష్టం ఏమీలేదని హువావే సీఈఓ రెన్‌జెన్గ్‌ఫె పేర్కొన్నారు. ఇప్పటికే తాము ఈ పరిస్థితికి సిద్ధమైనట్లు వెల్లడించారు. 

మరో టెలికం దిగ్గజం జెడ్‌టీఈ  కూడా ఇదే వైఖరిని అనుసరిస్తోంది. జెడ్‌టీఈ, హువావే కంపెనీలు అమెరికాలో టెలికామ్‌ పరికరాలు విక్రయించకుండా  అమెరికా వాణిజ్య విభాగం ఆంక్షలు విధించింది. దీంతో అమెరికా కంపెనీలతో వ్యాపారం చేసే అవకాశాన్ని ఈ రెండు కంపెనీలు కోల్పోయాయి. హువావే, దాని అనుబంధ సంస్థలు తమ జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించాయని అమెరికా పేర్కొంది.


హువావేపై అమెరికా ఆంక్షలు విధించిన తర్వాత ఆ సంస్థ నుంచి వివిధ రకాల విడి భాగాలు ప్రత్యేకించి చిప్స్ దిగుమతి చేసుకునే సంస్థల షేర్లు దెబ్బ తిన్నాయి. హువావే ద్వారా అమెరికా చిప్ మేకర్ క్వాల్ కామ్ ఐదు శాతం రెవెన్యూ పొందుతున్నది. తాజా పరిణామం నేపథ్యంలో గురువారం న్యూయార్క్ స్టాక్ ఎక్చ్సేంజిలో క్వాల్ కామ్ షేర్ నాలుగు శాతం పడిపోయింది. మరో సంస్థ బ్రాడ్ కామ్ షేర్ 2.3 శాతం పతనమైంది. 

హువావే సప్లయర్స్‌గా ఉన్న క్వాల్ కామ్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్.. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజంపై అమెరికా వాణిజ్యశాఖ ఆంక్షల విషయమై ఆందోళన వ్యక్తం చేశాయి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పరిశ్రమతో సంప్రదించి నష్టాన్ని తగ్గించుకునేలా చూడాలపి ప్రభుత్వానికి సూచించాయి. 

అమెరికాతోపాటు జపాన్, ఆస్ట్రేలియా కూడా హువావేపై నిషేధం విధిస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. హువావే గూడచర్యానికి పాల్పడుతున్నదన్న అభియోగంపై బ్రిటన్, జర్మనీలకు సర్ది చెప్పేందుకు అమెరికా ప్రయత్నాలు సాగిస్తోంది. హువావేపై ఆంక్షలు అమలు చేయడం వల్ల ఇంటెల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ తదితర సంస్థల లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడుతుందని యురేసినా గ్రూప్ సాంకేతిక నిపుణుడు పాల్ ట్రైలో వ్యాఖ్యానించారు. 


 

Last Updated 19, May 2019, 3:28 PM IST