వాట్సప్ భారత్ సీఈఓగా అభిజిత్ బోస్

By rajesh yFirst Published Nov 22, 2018, 4:13 PM IST
Highlights

ఎట్టకేలకు కేంద్రం అభ్యర్థన మేరకు వాట్సప్ తన ఇండియా కార్యకలాపాలపై పూర్తిస్థాయి పర్వవేక్షణ కోసం సీఈఓగా అభిజిత్ బోస్ ను నియమించింది. గురుగ్రామ్ కేంద్రంగా దేశీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నది. అమెరికా తర్వాత భారతదేశంలోనే వాట్సప్ కార్యాలయం ఏర్పాటు కావడం గమనార్హం. 

న్యూఢిల్లీ: క్షణాల్లో సమాచారాన్ని చేరవేసే మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ ఇండియా సీఈఓగా అభిజిత్ బోస్ నియమితులయ్యారు. సంస్థకు ఇటీవలి కాలంలో 
ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. రోజురోజుకు వివాదాస్పదంగా మారుతున్న నకిలీ మెసేజ్‌లను అరికట్టేందుకు సమర్థవంతమైన టీమ్‌ను ఏర్పాటు చేసే పనుల్లో పడింది ఆ సంస్థ.

దీనిలో భాగంగా వాట్సాప్ ఇండియా సీఈవోగా ప్రముఖ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ సంస్థ ఇజెట్ యాప్ సహ- వ్యవస్థాపకుడు, సీఈవో అభిజిత్ బోస్‌ను నియమించింది. ఈ మేరకు వాట్సాప్ ప్రకటన విడుదల చేసింది. గురుగావ్ కేంద్రంగా భారత్‌లో ప్రధాన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. కాలిఫోర్నియాలో ఉన్న హెడ్ ఆఫీస్ తర్వాత విదేశాల్లో ఏర్పాటు అవుతున్న తొలి కార్యాలయం ఇదే కావడం విశేషం.

ఇదిలా ఉంటే హార్వార్డ్ బిజినెస్ స్కూల్‌లో చదువుకున్న అభిజిత్‌కు వాణిజ్య వ్యూహాల్లో దిట్టగా పేరుంది. సాధారణ వినియోగదారులు, వ్యాపార వర్గాలను మరింతగా ఆకట్టుకునే విధంగా వాట్సాప్‌ను రూపుదిద్దడంతో పాటు నకిలీ సందేశాలను అరికట్టేలా అభిజిత్ టీమ్ చర్యలు తీసుకోనున్నది.

వాట్సప్ ఇండియా సీఈఓగా అభిజిత్ బోస్ నియామకంతో ఈ వేదిక నుంచి ఫేస్ న్యూస్ వ్యాప్తి కాకుండా అడ్డుకోవాలని భారత ప్రభుత్వ డిమాండ్ దిశగా సంస్థ ఒక అడుగు ముందుకేసింది. ఇటీవలే కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, వాట్సప్ ఉపాధ్యక్షుడు చిరిస్ డానియల్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. దేశీయ కార్యకలాపాలను నియంత్రించేందుకు స్థానిక నాయకత్వం అవసరం అని చిరిస్ ద్రుష్టికి రవిశంకర్ ప్రసాద్ తెచ్చినట్లు సమాచారం. 


ఈ ఏడాది ప్రారంభం నుంచి అనుమానాలతో కూడిన ఫేక్ న్యూస్ వ్యాపింపజేయడంతో వరుస మూక దాడులతో పలువురు అమాయకులు మరణించిన నేపథ్యంలో వాట్సప్ లో వాటిని నియంత్రించడానికి అంతర్జాతీయంగానే ఒక వేదిక అవసరమని సంస్థ భావిస్తోంది. ఫేస్ న్యూస్ వస్తున్న కేంద్రాన్ని కనిపెట్టేందుకు కూడా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కోరారు. 


 

click me!