మైసూరు యువ దసరా 2019... ముఖ్య అతిథిగా పివి సింధు

By Arun Kumar PFirst Published Sep 11, 2019, 6:17 PM IST
Highlights

తెలుగు తేజం, బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పివి సింధు మైసూర్ దసరా  ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ప్రభుత్వం తరపున నిర్వహించే ఈ ఉత్సవాల్లో అతిథిగా పాల్గొనాల్సిందిగా సింధును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానించారు.  

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. కర్ణాటకలోని మైసూరులో జరిగే దసరా ఉత్సవాల్లో సింధు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సింధుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప నుండి  ప్రత్యేక ఆహ్వానం అందింది. 

ఒలింపిక్స్ విజేత పివి సింధు ఇటీవల వరల్డ్ ఛాంపియన్‌షిప్ లో బంగారు పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇలా సింధు వ్యక్తిగతంగానే కాకుండా భారత్ కు కూడా మొదటి  గోల్డ్ అందించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. దీంతో ఈ తెలుగు తేజం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ సందర్భంగా ఆమెను అభినందిస్తూ ఓ లేఖ రాసిన కన్నడ సీఎం దసరా ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సింధును కోరారు. 

ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మైసూరులో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి  విజయదశమి పండగ వరకు ఈ వేడుకలు  జరుగుతాయి. ఈ సందర్భంగా నిర్వహించే మైసూరు యువ దసరా-2019 ప్రారంభ కార్యక్రమానికి అతిథిగా హాజరుకావాల్సిందిగా సింధుకు ఆహ్వానం అందింది. 

''అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన మీకు అభినందనలు. ఈ విజయం ద్వారా ఎంతో మంది యువతను మీరు క్రీడల వైపు మల్లించారు. యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తూ స్పూర్తినిస్తున్న మిమ్మల్ని గౌరవించాలని అనుకుంటున్నాం. అందుకోసం ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సాదరంగా  ఆహ్వానిస్తున్నాం. అని యడియూరప్ప తన లేఖలో పేర్కొన్నాడు.  

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో తెలుగు తేజం పీవీ సింధు ఇటీవల చరిత్ర సృష్టించారు.  ఫైనల్లో జపాన్ క్రీడాకారిణీ నొజోమీ ఒకుహురాను ఓడించిన ఆమె విజేతగా నిలిచారు. సింధు 21-7, 21-7 పాయింట్ల  తేడాతో ఒకుహురాపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వరుస సెట్లను గెలుచుకుని విజయాన్ని అందుకుంది. కేవలం 36 నిమిషాల్లోనే సింధు విజయయాత్ర ముగిసింది.   
 

click me!