IPL 2020: క్రికెట్ అభిమానులకు షాక్... అక్కడ ప్రసారాలపై నిషేధం...

By team teluguFirst Published Sep 14, 2020, 1:27 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా  120 దేశాల్లో ఐపీఎల్ ప్రత్యేక్ష ప్రసారం... పాకిస్తాన్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం... 

ప్రపంచవ్యాప్తంగా ఏ క్రికెట్ లీగ్‌కి లేనంత క్రేజ్ ఇండియన్ క్రికెట్ లీగ్‌కి ఉంటుంది. కేవలం ఐపీఎల్ బెట్టింగ్‌ల ద్వారానే కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారతాయంటే... ఈ క్రికెట్ లీగ్ పరిధి ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఒక్క సీజన్‌ కూడా మిస్ కాకూడదనే ఉద్దేశంతో కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలించకపోయినా... ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహిస్తోంది బీసీసీఐ. దుబాయ్‌లో జరగబోయే ఈ మెగా ఈవెంట్‌ను 120 దేశాల ప్రజల ప్రత్యేక్ష ప్రసారం ద్వారా వీక్షించబోతున్నారు.

అయితే పొరుగు దేశం దాయాది పాక్‌లోని క్రికెట్ ఫ్యాన్స్‌కి మాత్రం అధికారులు షాక్ ఇచ్చారు. పాకిస్తాన్‌లో ఈసారి కూడా ఐపీఎల్ ప్రత్యేక్ష ప్రసారాలు ఉండవని తేల్చి చెప్పేశారు. ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు అమెరికా, కెనడా, ఆఫ్రికా దేశాల్లోనూ ఐపీఎల్ లైవ్ టెలికాస్ట్ కాబోతోంది.

ఇంగ్లీష్, హిందీతో పాటు భారత్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తొమ్మిది ప్రాంతీయ భాషల్లో ప్రత్యేక్ష ప్రసారాలు చేయబోతున్నారు. మరో ఐదు రోజుల్లో ప్రారంభమయ్యే ఈ మెగా క్రికెట్ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారత్‌లో ఐపీఎల్ ప్రత్యేక్ష ప్రసారాలను సొంతం చేసుకున్న హాట్ స్టార్, డిస్నీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవాళ్లకి మాత్రమే లైవ్ చూసే అవకాశం కల్పిస్తోంది. ఈ కారణంగా కొన్ని కోట్ల మంది మొబైల్ ఫోన్లలో లైవ్ చూసే అవకాశం కోల్పోబోతున్నారు.

దాయాది పాక్‌లో కూడా ఐపీఎల్‌కు మంచి క్రేజ్ ఉంది. భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీలకి పాకిస్తాన్‌లో అభిమానులున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా ఐపీఎల్ చూసే అవకాశాన్ని కోల్పోతున్నారు అక్కడి క్రీడాభిమానులు.

click me!