హాకీలో మళ్లీ నిరాశే... ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో చిత్తు! ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌...

By Chinthakindhi RamuFirst Published Aug 8, 2022, 6:40 PM IST
Highlights

కామన్వెల్త్ గేమ్స్ మెన్స్ హాకీ ఫైనల్‌లో 7-0 చిత్తుగా ఓడిన టీమిండియా... 61 పతకాలతో నాలుగో స్థానంలో ముగించిన భారత్...

ఒలింపిక్స్‌లో 8 స్వర్ణాలు గెలిచామని గర్వంగా చెప్పుకునే భారత పురుషుల హాకీ జట్టు, ఇప్పటిదాకా కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం పతకం మాత్రం గెలవలేకపోయింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం తర్వాత ఈసారి భారీ అంచనాలతో బర్మింగ్‌హమ్‌లో అడుగుపెట్టిన భారత హాకీ జట్టు... ఫైనల్ చేరి, పసిడి కలను మాత్రం నెరవేర్చుకోలేకపోయింది...

ఆస్ట్రేలియాతో జరిగిన పురుషుల హాకీ ఫైనల్ మ్యాచ్‌లో 7-0 తేడాతో చిత్తుగా ఓడింది భారత జట్టు. ఫైనల్ ఫోబియాని నరనరాల్లో నింపుకున్న భారత పురుషుల హాకీ జట్టు ప్లేయర్లలో ఎవ్వరూ ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. భారత మహిళా హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలిస్తే, ఫైనల్‌లో ఓడి రజతంతో సరిపెట్టుకుంది భారత పురుషుల హాకీ జట్టు...

ఫైనల్‌లో భారత జట్టుపై ఘన విజయం అందుకున్న ఆస్ట్రేలియా... వరుసగా ఏడో ఎడిషన్‌లోనూ స్వర్ణం గెలిచింది. హాకీ జట్టు గెలిచిన రజత పతకంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత ప్రస్థానం ముగిసింది. 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలతో మొత్తంగా 61 పతకాలతో నాలుగో స్థానంతో ముగించింది భారత్.. 

 

మెన్స్ డబుల్స్‌లో రజతం గెలిచిన శరత్ కమల్, ఆఖరి రోజున మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో చెలరేగి భారత్‌కి  స్వర్ణం అందించాడు...వరల్డ్ 20వ ర్యాంకర్ లియామ్ పిచ్‌పోర్డ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 4-1 తేడాతో విజయం అందుకున్న శరత్ కమల్, 2006  మెన్స్ సింగిల్స్‌లో స్వర్ణం నెగ్గిన తర్వాత 16 ఏళ్లకు మళ్లీ పసిడి కైవసం చేసుకున్నాడు. ఓవరాల్‌గా శరత్ కమల్‌కి ఇది కామన్వెల్త్‌లో 8వ స్వర్ణం కాగా, 14వ పతకం...

పురుషుల బ్యాడ్మింటన్ మెన్ డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి జోడి, వరల్డ్ నెం.16 ఇంగ్లాండ్ జోడీ బెన్ లెన్- సీన్ వెండీపై 21-15, 21-13 తేడాతో విజయం అందుకున్నాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్‌లో ఓడి రజతంతో సరిపెట్టుకున్న భారత మెన్స్ జోడీకి ఇది తొలి స్వర్ణం.. 

టేబుల్ టెన్నిస్‌లో సాథియన్ జ్ఞానశేఖరన్ కాంస్యాన్ని అందించాడు. బ్రిటీష్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్, వరల్డ్ 74వ ర్యాంకర్ పాల్ డ్రింక్‌హాల్‌తో జరిగిన మ్యాచ్‌ని 4-3 తేడాతో విజయం సాధించాడు సాథియన్...

పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో వరల్డ్ నెంబర్ 42వ ర్యాంకర్, మలేషియా షట్లర్‌ టీ యంగ్ ఎన్‌జీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 19-21, 21-9, 21-16 తేడాతో వరుస విజయం అందుకున్నాడు లక్ష్యసేన్...

లక్ష్యసేన్‌కి ఇదే మొట్టమొదటి కామన్వెల్త్ మెడల్. తొలి సెట్‌ని 19-21 తేడాతో పోరాడి ఓడిన లక్ష్యసేన్, ఆ తర్వాత అదిరిపోయే ఆటతీరుతో కమ్‌బ్యాక్ ఇచ్చి వరుస సెట్లలో మలేషియా షెట్లర్‌ని చిత్తు చేశాడు.

బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు, తన ప్రత్యర్థి కెనడాకి చెందిన మిచెల్ లీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-15, 21-13 తేడాతో వరుస సెట్లలో విజయం అందుకుని మ్యాచ్‌ని సునాయాసంగా ముగించి స్వర్ణం నెగ్గింది.  2014 గాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో వుమెన్స్ సింగిల్స్‌లో కాంస్యం, 2018 గోల్డ్ కోస్ట్‌లో రజతం గెలిచిన పీవీ సింధుకి సింగిల్స్‌లో ఇదే మొట్టమొదటి కామన్వెల్త్ స్వర్ణం. 

 

click me!