IPL 2025 - Hardik Pandya : ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది ముంబై ఇండియన్స్. అయితే, ఆశించిన స్థాయిలో జట్టు ప్రదర్శన ఇవ్వలేదు. ఇప్పుడు ఐపీఎల్ లో రిటెన్షన్ రూల్స్ మార్పులతో హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ టీమ్ రిటైన్ చేసుకుంటుందా? వదులుకుంటుందా?
IPL 2025 - Hardik Pandya : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17 ఎడిషన్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పుడు ఐపీఎల్ 18వ ఎడిషన్ (ఐపీఎల్ 2025) కోసం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. దీని కంటే ముందు ప్లేయర్ల కోసం ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 వేలం ఒక ప్రధాన ఈవెంట్‌గా ఉంటుందని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 10 జట్లు వేలం, ప్లేయర్ల కోసం తమ వ్యూహాలతో సన్నాహాలు షూరు చేశాయి.
ఇటీవలే బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంఛైజీలతో సమావేశం ఏర్పాటు చేసి ప్లేయర్ల రిటెన్షన్ నిర్ణయాలను ప్రకటించింది. ఐపీఎల్ కొత్త రిటెన్షన్ నిర్ణయాల ప్రకారం.. ప్రతి జట్టు తమ ప్రస్తుత టీమ్ లోని ఆరుగురు ఆటగాళ్లను వేలంలోకి రాకుండా తమవద్దనే ఉంచుకోవచ్చు. ఇది ప్లేయర్‌ని నిలుపుకోవడం లేదా రైట్ టు మ్యాచ్ (RTM) ఎంపికను ఉపయోగించడంతో చేయవచ్చు. రిటెన్షన్ /RTMలలో గరిష్ట పరిమితి ఐదు క్యాప్డ్ ప్లేయర్‌లు ఉండగా, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను జట్టుతో ఉంచుకోవచ్చు.
undefined
ఐపీఎల్ 2025కి ముందు ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. గత సీజన్ లో చేసిన తప్పిదాలను మళ్లీ రాకుండా చూసుకోవాలని భావిస్తోంది. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024లో చివరి స్థానంలో నిలిచింది. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు ముంబై కెప్టెన్సీ ఇవ్వడంపై కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. జట్టు ప్రదర్శన కూడా చాలా దారుణంగా కొనసాగింది.
రిటెన్షన్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ జట్టు జాబితాలో రోహిత్ శర్మ , హార్దిక్ పాండ్యా , సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ వంటి స్టార్లు ఉన్నారు. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఎవరిని జట్టుతో ఉంచుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ కొత్త రిటెన్షన్ రూల్స్ ప్రకారం.. మొత్తం ఆరుగురు ఆటగాళ్లను జట్టుతో వుంచుకోవచ్చు. అయితే, మొదటి ఇద్దరు ఆటగాళ్లకు ఒక్కొక్కరికి ₹18 కోట్లు చెల్లించాలి. ఆ తర్వాత ఇద్దరిని ఒక్కొక్కరికి ₹14 కోట్లు, ఒక ప్లేయర్‌ను ₹11 కోట్లతో ఉంచుకోవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ ముంబై తొలి ప్రాధాన్యత కావచ్చు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కనిపిస్తున్నాడు. అయితే, ముంబై ఇండియన్స్ హార్ధిక్ పాండ్యా కోసం రూ.18 కోట్లు ఖర్చు చేస్తుందా? అనేది క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయాన్ని టామ్ మూడీ లేవనెత్తాడు. మాజీ ఐపిఎల్ విన్నింగ్ కోచ్ టామ్ మూడీ అత్యధిక ధర రూ.18 కోట్లకు పాండ్యాను ఉంచుకోవడానికి అర్హుడా అనే సందేహాన్ని లేవనెత్తాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో తో మాట్లాడుతూ.. "రూ.18 కోట్ల ఆటగాడు కావాలంటే, అతను నిజమైన మ్యాచ్-విన్నర్ అయి ఉండాలి. అది క్రమం తప్పకుండా చేయాలి. కానీ, గత ఐపీఎల్ సీజన్‌లో పాండ్యా ఫిట్‌నెస్, ప్రదర్శన రెండింటిలోనూ సవాళ్లను ఎదుర్కొన్నాడని" పేర్కొన్నాడు.
ప్లేయర్ల రిటెన్షన్ వ్యూహాన్ని తిరిగి అంచనా వేయాలని ముంబై ఇండిన్స్ కు మూడీ సలహా ఇచ్చాడు. మరీ ముఖ్యంగా ఇషాన్ కిషన్, జోఫ్రా ఆర్చర్‌లను జట్టుతోనే ఉంచుకోవడమనేది అధిక ఖర్చుగా పేర్కొన్నాడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్లేయర్ రిటెన్షన్ స్ట్రాటజీని మళ్లీ ఒకసారి పరిశీలించుకోవాలని తెలిపాడు. అలాగే, ఆర్‌టీఎం కార్డును ఉపయోగించే ముందు తన భవిష్యత్ ప్రణాళికల గురించి ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో చర్చించాలని కూడా సూచించాడు. ప్లేయర్ల రిటెన్షన్ కు సంబంధించి హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి మంచి నలుగురు ప్లేయర్లు ఉన్నారని కూడా మూడీ చెప్పారు.
ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఐపీఎల్ కెరీర్ గణాంకాలు గమనిస్తే 2024 ఐపీఎల్ సీజన్‌లో పాండ్యా 14 మ్యాచ్‌లు ఆడాడు. 18 సగటుతో 216 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో పాండ్యా స్ట్రైక్ రేట్ 143.05. అత్యధిక వ్యక్తిగత స్కోరు 46 పరుగులు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 35.18 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ రేటు 10.75 గా ఉండగా, పాండ్యా అత్యుత్తమ గణాంకాలు 3/31 వికెట్లు. ఐపీఎల్ మొత్తం కెరీర్ ను గమనిస్తే హార్దిక్ పాండ్యా 137 మ్యాచ్‌ల్లో 28.69 సగటు, 145.62 స్ట్రైక్ రేటుతో 2,525 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా వ్యక్తిగత అత్యధిక స్కోరు 91 పరుగులు. బౌలింగ్ విషయానికి వస్తే 33.59 సగటుతో 64 వికెట్లు సాధించాడు.
ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆల్ రౌండర్ గా అద్భుత ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. పాండ్యా 2024లో ముంబై టీమ్ లోకి తిరిగి రావడానికి ముందు రెండు సీజన్లలో (2022,2023) గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహించాడు. తొలి సీజన్ లో ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఆ తర్వాత సీజన్ లో ఫైనల్ కు తీసుకువచ్చాడు. గుజరాత్ తరఫున పాండ్యా 31 మ్యాచ్‌లలో 37.86 సగటు, 133.49 స్ట్రైక్ రేటుతో 833 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ విషయానికి స్తే 40.90 సగటు, 8.10 ఎకానమీ రేటుతో 11 వికెట్లు సాధించాడు. ఇక ముంబై ఇండియన్స్ తరఫున హార్ధిక్ పాండ్యా 106 మ్యాచ్‌లలో 25.63 సగటు, 152.43 స్ట్రైక్ రేటుతో 1,692 పరుగులు చేశాడు. అలాగే, 9.40 ఎకానమీ రేటుతో 53 వికెట్లు తీసుకున్నాడు. అయితే, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఐపీఎల్ 2024 లో ముంబై ఘోర ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. పాండ్యా కూడా వ్యక్తిగతంగా మంచి ప్రదర్శనలు ఇవ్వలేకపోయాడు. దీంతో రాబోయే ఐపీఎల్ 2025 కి ముందు ముంబై ఇండియన్స్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.