బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే వైఎస్ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నవారు చిన్న లాజిక్ ను మిస్సవుతున్నట్లు కనిపిస్తున్నారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడయం కొనసాగిస్తే తెలుగు భాష బతికిపోతుందా అనేది ఆలోచించాలి.
తెలుగు భాష పరిరక్షణకు లేదా మాతృభాషా పరిరక్షణకు పాఠశాలల్లో మాధ్యమానికి ముడిపెడుతూ మాట్లాడుతున్న పెద్దలు, మేధావులు చిన్న లాజిక్ ను మిస్సవుతున్నట్లు కనిపిస్తున్నారు. కేవలం పేదలు, గ్రామీణులు చదువుకునే పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించినంత మాత్రాన తెలుగు భాషను కాపాడగలమా అనేది ఆలోచించాల్సిన విషయం.
నిజానికి కార్పోరేట్, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లగలిగే స్తోమత ఉంటే వాళ్లు కూడా ప్రభుత్వ పాఠశాలలకు దూరంగానే జరుగుతారు. విద్యావ్యవస్థ యావత్తూ ప్రైవేటీకరణ చెందుతున్న ప్రస్తుత తరుణంలో గ్రామీణ పేదలకు అందుబాటులో ఉన్నవి ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుల పిల్లలైనా వారు పాఠాలు బోధిస్తున్న పాఠశాలల్లో చేరుతున్నారా అంటే అదీ లేదు.
undefined
Also Read: ఇంగ్లీష్ మీడియం చదువులు మీ పిల్లలకే నా ? పేద పిల్లలకు వద్దా..!: సీఎం జగన్
గతంలో ప్రైవేట్ విద్యా సంస్థల ఆధిపత్యం లేని కాలంలో ఉపాధ్యాయుల పిల్లలు కూడా ఇతర పిల్లలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారు. ఇప్పుడు ఉపాధ్యాయులు తమ పిల్లలను కార్పోరేట్ బడులకు పంపుతున్నారు. తమ పిల్లలకు ఇబ్బంది కలగకూడదని పట్టణాల్లో, నగరాల్లో నివాసం ఉంటూ గ్రామాల్లోని పాఠశాలలకు రోజూవారీగా వస్తూ పోతున్నారు. దీనివల్ల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య ఉండాల్సిన అనుబంధం కూడా బలహీనపడుతూ వస్తోంది.
ఇక అసలు విషయానికి వస్తే, తెలుగు భాషను రక్షించుకోవాలంటే ఏం చేయాలనే ఆలోచన ఉండడం మంచిదే, తెలుగు భాషను రక్షించుకోవడానికి పనిచేయడం మంచిదే కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టకుండా ఆ పనిచేస్తామని చెబుతూ చిన్న లాజిక్ ను మిస్సవుతున్నారనిపిస్తోంది.
ప్రైవేట్ ఇంటర్మీడియట్ పాఠశాలల్లో ఏం చేస్తున్నారనే ప్రశ్న ఒకటి వేసుకోవాలి. ద్వితీయ భాషగా తెలుగుతో పాటు సంస్కృతం కూడా ఉంటుంది. సంస్కృతం ద్వితీయ భాషగా తీసుకుంటే లెక్కల్లో మాదిరిగా మార్కులు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే సంస్కృతం సిలబస్ లో ప్రాథమిక స్థాయి అంశాలే ఉంటాయి. కనీసం తమ పిల్లలు సంస్కృతం కాకుండా తెలుగును ద్వితీయ భాషగా ఎంచుకునే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారా అంటే అదీ లేదు.
పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని సమర్థించేవారిని తెలుగు భాషా ద్రోహులుగా జమ కడుతున్నారు. భాష అనే సెంటిమెంట్ తో ఆడుకోవాలని అనుకుంటున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ లాజిక్ ను మిస్సవుతున్నారు. నిజానికి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై డాక్టర్ అంబేడ్కర్ హెచ్చరిక చేశారు. భాష ఆధిపత్యంలోకి వస్తే దేశానికి ప్రమాదకరమని ఆయన హెచ్చరించినట్లు గుర్తు.
Also Read: తెలుగు భాషపై పవన్ కల్యాణ్ మాట: అసలు విషయం ఇదీ
ఆంధ్రప్రదేశ్ అవతరణ విషయంలోనే అంబేడ్కర్ ఆ హెచ్చరిక చేశారు. కేవలం భాషతో ప్రజలను కట్టిపడేసి ఐక్యత సాధించాలనే ఆదర్శం ఆచరణలో సాధ్యం కాదు. సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక అంశాలను పక్కన పెట్టి భాష గురించి మాట్లాడడం అంటే, కొన్ని వర్గాలకు నష్టం చేయడమే అవుతుంది.
తెలుగు భాషా పరిరక్షణ కోసం ఏం చేయాలో ఓ ప్రత్యేక ప్రణాళిక రూపొందించడానికి ప్రయత్నాలు చేసి, అందుకు అనుగణమైన చర్యలు చేపడితే మంచిదే. కానీ, కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దనే చిన్న విషయాన్ని పట్టుకుని వేలాడడం కొన్ని వర్గాలకు నష్టం చేయడమే అవుతుంది.