బీఆర్ఎస్‌కు మూడోసారి తెలంగాణ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా? ప్రభుత్వ వ్యతిరేకతపై కాంగ్రెస్ ఫోకస్

By Mahesh KFirst Published Jul 6, 2023, 1:42 PM IST
Highlights

తెలంగాణ ఉద్యమ పార్టీగా  పేరున్న బీఆర్ఎస్ మూడోసారి అధికారాన్ని చేపట్టాలని ప్రయత్నిస్తున్నది. ఇన్నాళ్లు ఈ లక్ష్యానికి ఎదురేలేదన్నట్టుగా కనిపించింది. కానీ, అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడం, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెట్టడం, ప్రభుత్వ వ్యతిరేకతపై ఫోకస్ పెట్టడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
 

హైదరాబాద్: తెలంగాణలో కొన్ని రోజుల వ్యవధిలోనే రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల తీరులో ఈ మార్పు అధికంగా కనిపించింది. ఈ మార్పు అధికార పార్టీని కలవరపెట్టే స్థాయిలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వ్యూహం, దూకుడు ఏ విధంగా ఉండనున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ రాష్ట్ర సాధనకు బీఆర్ఎస్ ఉద్యమించడం, ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భవించడం వంటి పరిణామాలు రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌కు జై కొట్టేలా చేశాయి. తెలంగాణ ఉద్యమ సెంటిమెంటే అప్పటి టీఆర్ఎస్‌కు అధికారాన్ని ఇచ్చింది. 2014 నుంచి 2018 మధ్య కాలంలో కేసీఆర్ ప్రభుత్వం జనాకర్షక, జనాధరణ పొందే పథకాలను అమలు చేశారు. ఆసరా పింఛన్, రైతు బంధు వంటి పథకాలు, ప్రకటనలు టీఆర్ఎస్‌వైపు మొగ్గేలా చేశాయి. రెండో సారి మొదటిసారికి మించిన సీట్లతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. మూడోసారి ఇప్పటి బీఆర్ఎస్‌కు 2014 నాటి ఉద్యమ సెంటిమెంట్ కలిసివస్తుందా? అనేది చర్చనీయాంశంగా ఉన్నది.

ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్‌తోపాటు ఆ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకుంటున్నది. ఇతర రాష్ట్రాలతో పోల్చుతూ మాట్లాడుతున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాలను ఉదహరిస్తూ ఎంత పురోగమించింది వివరిస్తున్నది. ఇది వరకే ప్రభుత్వం పలు వర్గాలు కేంద్రంగా పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. పింఛన్లు ఇప్పటికీ కేసీఆర్ ప్రభుత్వంపై సానుకూల వాతావరణాన్ని కొనసాగిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ తెలంగాణ మాడల్ కోరుతున్నారని బీఆర్ఎస్ ఇటు తెలంగాణ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ పార్టీని విస్తరించే వ్యూహాన్ని ఎంచుకుంది.

అలాగే.. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన క్రెడిట్ టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకోవడమే కాక, కాంగ్రెస్‌కు ఎంతమాత్రం అందులో చోటు ఇవ్వలేదు. దీంతో హస్తం పార్టీ దారుణంగా బలహీనపడింది. రెండో సారి కూడా బలమైన పోటీని అధికారపార్టీకి ఇవ్వలేకపోయింది. కానీ, గత కొన్ని నెలలకు ముందు వరకు హస్తం పార్టీ ఈ సారికూడా పేలవమైన ప్రదర్శనే ఇస్తుందని, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీకి బలమైన ప్రత్యర్థి బీజేపీ అవుతుందనే అనుకున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

తెలంగాణ ఆశయ సాధనలో ప్రధానంగా వినిపించిన డిమాండ్లను పూర్తిగా అమలు చేయడంలో ఈ తొమ్మిదేళ్ల కాలంలోనూ బీఆర్ఎస్ సఫలం కాలేదు. ముఖ్యంగా నియామకాల విషయంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది. నోటిఫికేషన్లు రావడం, కోర్టులకు వెళ్లడంగా ఉన్నది. నీళ్లు బీళ్ల వరకు తీసుకువచ్చినా.. రైతుల ఆత్మహత్యలను ఆపడం సాధ్యం కాలేదు. నిధుల విషయంలోనూ అనేక విమర్శలు, ఆరోపణలు అధికార పార్టీపై ఉన్నాయి. గెలుపోటములకు నిర్ణయాత్మకంగా ఉండే కొన్ని వర్గాలు బీఆర్ఎస్‌కు దూరమవుతున్నాయి. దళిత సీఎం అంటూ ప్రకటన చేసి రెండోసారి అధికారంలోకి వచ్చినా కేసీఆర్ పట్టించుకోకపోవడం కూడా దళిత  వర్గాల దృష్టిలో ఉన్నది. దళిత బంధు, ధరణి వంటి నిర్ణయాలూ మేలు కంటే చేటు ఎక్కువ చేసేలా కనిపిస్తున్నాయి. దళిత బంధు లబ్దిదారులు (విడతల వారీగా అందరికీ అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు!) మినహా అది పొందని వారిలో ప్రభుత్వంపై వ్యతిరేకతకు అవకాశం ఉన్నది. పార్టీ అనుచరులు, అనునాయులకూ ఈ పథకం అనే విమర్శల ఉండనే ఉన్నది. ధరణితో పేద  రైతులకు, ముఖ్యంగా చట్టాలపై అవగాహనలేని, భూమి కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులు నష్టపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఫలితంగా భూ ఘర్షణలూ తీవ్రమయ్యాయి. ఇలాంటి కొన్ని కీలకాంశాలు కేంద్రంగా బీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉన్నది. పలు వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నట్టు కొన్ని అంతర్గత సర్వేల్లో తెలియవచ్చింది. తొమ్మిదేళ్ల పాలన తర్వాత ప్రజలు మార్పు కోరుకోవడం, ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడటం సహజం. ఇప్పుడు కాంగ్రెస్ ఈ వ్యతిరేకతను ఒడిసిపట్టుకోవాలనే దూకుడు ప్రదర్శిస్తున్నది.

Also Read: అనుచరులతో ఏనుగు రవీందర్ రెడ్డి భేటీ: కాంగ్రెస్‌లో చేరుతారా?

నీటిపారుదల ఉన్నా.. రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదనే సమస్యను కాంగ్రెస్ ముందుకు తెస్తున్నది. ఉపాధినీ కేంద్రంగా తీసుకుని ప్రకటనలు చేస్తున్నది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్‌లను ప్రకటించింది. చేయూత పింఛన్ ద్వారా వృద్ధులు, ఇతర బలహీనులనూ కాంగ్రెస్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికీ కాంగ్రెస్ సభల్లో ఈ అంశాలను ప్రధానం చేసుకుంటున్నది. 

భట్టి విక్రమార్క విజయవంతంగా చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలోనూ ప్రభుత్వ వ్యతిరేకతను దగ్గరగా చూశారు. యువత, మహిళలు, కమ్యూనిటీల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటికి పరిష్కారాలు సూచిస్తూ హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే భట్టి విక్రమార్క హామీలను కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనడం గమనార్హం. ఫలితంగా బీఆర్ఎస్ పాలనలో లబ్ది పొందలేదని, నష్టపోయామనే భావన ఉన్నవారిని మొత్తంగా తన వైపు తిప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ ఉధృతంగా చేస్తున్నది. దీనికి తోడు కొన్ని బలమైన సామాజిక వర్గాలనూ పార్టీ పునరేకీకరణ చేసుకుంటున్నది. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ప్రధాన పోరు ఉంటుందని ఇప్పటి పరిస్థితులు సూచిస్తున్నాయి. ఇంతలో బీజేపీ పుంజుకుంటే ముక్కోణపు పోరు ఉండే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ ఎంతగా పుంజుకుంటుంది? అనేదానిపైనే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉన్నాయనేది తెలుస్తున్నది.

click me!