మాదకద్రవ్యాల రవాణా, దేశ భద్రతపై కేంద్ర‌మంత్రి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు

By Mahesh RajamoniFirst Published Oct 27, 2022, 11:58 AM IST
Highlights

New Delhi: డ్రగ్స్ అక్రమ రవాణాకు క్రిప్టోకరెన్సీలు, డార్క్‌నెట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నార‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ రాష్ట్రాల్లో డ్రగ్స్ అక్రమ రవాణాలో కొత్త పోకడలు పుట్టుకొచ్చాయనీ, వాటిని పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
 

Union Home Minister Amit Shah: మాదకద్రవ్యాల రవాణా, దేశ భద్రతపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు క్రిప్టోకరెన్సీలు, డార్క్‌నెట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నార‌ని చెప్పారు. పశ్చిమ రాష్ట్రాల్లో డ్రగ్స్ అక్రమ రవాణాలో కొత్త పోకడలు పుట్టుకొచ్చాయనీ, వాటిని పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. బుధవారం గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో మాదకద్రవ్యాల రవాణా, దేశ భద్రతపై జరిగిన ఉన్నత స్థాయి ప్రాంతీయ సమావేశంలో హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. డార్క్‌నెట్‌, క్రిప్టోకరెన్సీల ద్వారా డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ పెరిగిపోయిందని, ఇది ఉగ్రవాదానికి కూడా కారణమవుతున్న‌ద‌ని షా అన్నారు. ఒకవైపు మాదక ద్రవ్యాలు యువతను చెదపురుగుల్లా తినేస్తున్నాయనీ, మరోవైపు మాదక ద్రవ్యాల వ్యాపారం ద్వారా వస్తున్న అక్రమ సొమ్ము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని చెప్పారు. 

యువతను సురక్షితంగా ఉంచేందుకు, ఉగ్రవాదానికి ఆర్థికసాయం అందకుండా పోరాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఉమ్మడి పోరుగా పోరాడి విజయం సాధించాలని అమిత్ షా అన్నారు. పశ్చిమ తీరం నుండి హెరాయిన్ సముద్ర అక్రమ రవాణా, నల్లమందు, గంజాయి, గసగసాల వంటి మాదకద్రవ్యాల అక్రమ సాగు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్లో కొరియర్లు, పార్శిల్స్ వాడకం, డార్క్‌నెట్‌, క్రిప్టోకరెన్సీల ద్వారా మాదకద్రవ్యాల స్మగ్లింగ్ పెరగడం వంటివి పశ్చిమ రాష్ట్రాల్లో ప్రధాన మాదకద్రవ్యాల స్మగ్లింగ్ సమస్యలు అని షా చెప్పారు. ఇటీవలి కేసుల దర్యాప్తులో, పశ్చిమ రాష్ట్రాల్లో డ్రగ్స్ అక్రమ రవాణాలో కొత్త పోకడలు వెలువడ్డాయనీ, ఈ కొత్త పోకడలను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని షా అన్నారు. దేశంలోని పశ్చిమ ప్రాంతంలోని రాష్ట్రాలలో, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ విస్తారమైన తీరప్రాంతాన్ని కలిగి ఉన్నాయనీ, అదనంగా రాజస్థాన్, గుజరాత్ లు పాకిస్తాన్‌తో సరిహద్దులను పంచుకుంటున్నాయని హోం మంత్రి చెప్పారు.

సముద్ర మార్గం ద్వారా దక్షిణ మధ్య ఆసియా హెరాయిన్‌ అక్రమ రవాణా పెరిగిందనీ, అలాగే ఇండో-పాక్‌ సరిహద్దుల గుండా హెరాయిన్‌ అక్రమ రవాణా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని షా అన్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసుల వివరాలను పంచుకున్న హోంమంత్రి.. 2006 నుంచి 2013 వరకు మొత్తం 1,257 కేసులు నమోదు కాగా, 2014 నుంచి 2022 వరకు 3,172 కేసులు నమోదయ్యాయనీ, ఇది మొత్తం 152 శాతం పెరుగుద‌ల‌ను సూచిస్తున్న‌ద‌ని అన్నారు. అదేవిధంగా 2006 నుంచి 2013 వరకు మొత్తం 1.52 లక్షల కిలోల డ్రగ్స్‌ పట్టుబడగా, 2014 నుంచి 2022 వరకు 3.33 లక్షల కిలోలకు పెరిగిందనీ, అంతకుముందు దీని విలువ రూ.768 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.20 వేల కోట్లకు పెరిగిందన్నారు. డ్రగ్ అడిక్ట్ నేరస్థుడు కాదనీ, బాధితుడని షా అన్నారు. పై నుండి క్రిందికి, దిగువ నుండి పైకి విధానాలను అవలంబించడం ద్వారా డ్రగ్స్ మూలం- గమ్యం రెండింటిపై దాడి చేయడం ద్వారా మొత్తం డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నాశనం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

click me!