'అష్ట'దిగ్గజ నవ నాయకుడు ఉద్ధవ్

By telugu teamFirst Published Nov 29, 2019, 3:41 PM IST
Highlights

అసెంబ్లీలో లేదా శాసన మండలిలో ఎమ్మెల్యేగా గానీ, లేదా ఎమ్మెల్సీగా గానీ సభ్యత్వ పదవులు చేపట్టకుండా నేరుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిలో శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ఎనిమిదో వ్యక్తి. 

అసెంబ్లీలో లేదా శాసన మండలిలో ఎమ్మెల్యేగా గానీ, లేదా ఎమ్మెల్సీగా గానీ సభ్యత్వ పదవులు చేపట్టకుండా నేరుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిలో శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ఎనిమిదో వ్యక్తి. 

ఇదివరకు నేరుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన వారిలో  ఏ.ఆర్‌.అంతులే, వసంత్‌దాదా పాటిల్, శివాజీరావ్‌ పాటిల్‌, శంకర్‌రావ్‌ చవాన్, శరద్‌ పవార్, సుశీల్‌కుమార్‌ షిండే, పృథ్వీరాజ్‌ చవాన్ లు మాత్రమే చేపట్టారు.  

తాజాగా ఉద్ధవ్‌ ఠాక్రే కూడా ఎటువంటి సభలోను సభ్యత్వం లేకుండానే ఇలా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. నియమాల ప్రకారం అసెంబ్లీలో లేదా మండలిలో ఎలాంటి సభ్యత్వ పదవులు లేని వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల సమయంలోపు విధానసభ లేదా విధాన పరిషత్‌లో సభ్యుడు కావల్సి ఉంటుంది. 

Also read: ఠాక్రే కుటుంబ తొలి ముఖ్యమంత్రి పర్సనల్ లైఫ్ చాలా ఆసక్తికరం...

1980లో ముఖ్యమంత్రి పదవి కోసం అప్పటి ఎంపీ  వసంత్‌దాదా పాటిల్, ఎమ్మెల్యే ప్రతిభా పాటిల్‌ పేరు చర్చకు వచ్చాయి.  ఎంపీ పదవికి రాజీనామా చేసి వసంత్‌దాదా పాటిల్‌ రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని భావించారు. కానీ, కాంగ్రెస్‌ నేతలు ఆ ముఖ్యమంత్రి పదవిని ఎ.ఆర్‌.అంతులేకు కట్టబెట్టారు.

ఉభయ సభల్లోనూ ఎలాంటి సభ్యత్వం లేకపోయినా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి ముఖ్యమంత్రిగా అంతులేకు ఘనత దక్కింది. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసి అసెంబ్లీ సభ్యుడయ్యారు. 

ఆ తరువాత 1983 ఫిబ్రవరి రెండో తేదీన ఎంపీ వసంత్‌ దాదా పాటిల్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి, శాసన మండలి ద్వారా ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు.  

1985 జూన్‌ మూడో తేదీన శివాజీరావ్‌ పాటిల్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత ఆయన విధాన పరిషత్‌కు ఎన్నికయ్యారు. అనంతరం నిలంగా అసెంబ్లీ నియోజక వర్గంలో జరిగిన ఉప ఎన్నికలో విజయఢంకా మోగించారు. 

కేంద్ర మంత్రిగా ఉన్న శంకర్‌రావ్‌ చవాన్‌ 1986 మార్చి 12వ తేదీన అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు. తరువాత విధాన పరిషత్‌  సభ్యుడయ్యారు. 

Also read: సీఎం పదవి పోయింది కానీ రికార్డు మిగిలింది: మహాపాలిటిక్స్ పై నెటిజన్లు

1993లో శరద్‌ పవార్‌ కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్నారు. ముంబైలో అల్లర్లు జరిగిన తరువాత సుధాకర్‌ రావ్‌ నాయక్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. 1993 మార్చి 6వ తేదీన శరద్‌ పవార్‌ ముఖ్యమంత్రి అయ్యారు. తరువాత మండలికి ఎన్నికయ్యారు.  శరద్ పవార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 6రోజులకు ముంబై పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

 2003 జనవరి 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుశీల్‌కుమార్‌ షిండే ప్రమాణస్వీకారం చేసారు. అదికూడా ఢిల్లీ వదిలి వచ్చిన తరువాత షోలాపూర్‌లో జరిగిన ఉప ఎన్నికలో గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.  

అలాగే ఆదర్శ్‌ హౌజింగ్ సొసైటీలో జరిగిన కుంభకోణం కారణంగా అశోక్‌ చవాన్‌ రాజీనామా చేయడంతో పృథ్వీరాజ్‌ చవాన్‌ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత ఆయన విధాన్‌ పరిషత్‌కు ఎన్నికయ్యారు. తాజాగా 2019 నవంబర్‌ 28వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్‌ ఠాక్రేకు కూడా  ఉభయ సభల్లో ఎలాంటి సభ్యత్వం లేదు. చూడాలి ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య లాగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాడా లేకుంటే శాసన మండలి దారిగుండా సభ్యత్వం పొందుతారో వేచి చూడాలి. 

click me!