ఈ రోజు క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలివే.. అందరి దృష్టి తెలంగాణ రాజ‌కీయాల‌పైనే

Published : Aug 30, 2025, 06:41 AM ISTUpdated : Aug 30, 2025, 06:44 AM IST
Revanth reddy and KCR

సారాంశం

నిన్న మొన్న‌టి వ‌ర‌కు వ‌ర్షాల‌తో అతాల‌కుత‌ల‌మైన తెలంగాణ‌లో ఇప్పుడు రాజ‌కీయ వేడి రాజుకోనుంది. నేటి నుంచి అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఈ స‌మావేశాల‌కు కేసీఆర్ వ‌స్తారా.? ఎలాంటి ప‌రిణామాలు జ‌ర‌గ‌నున్నాయ‌న్న ఆస‌క్తి నెల‌కొంది. 

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి (శ‌నివారం) ప్రారంభంకానున్నాయి. ఈసారి సభలో ప్రధాన చర్చ కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ.ఘోష్ కమిషన్ నివేదిక గురించే ఉండనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలు, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై 16 నెలలపాటు దర్యాప్తు జరిపిన కమిషన్ జూలై 31న తన నివేదికను సమర్పించింది. దీంతో ఈ స‌మావేశాల‌కు కేసీఆర్ హాజ‌రుకానున్నారా.? అస‌లేం జ‌ర‌గ‌నుంద‌న్న చ‌ర్చ మొద‌లైంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ వ‌ర్షాలు

గ‌త కొన్ని రోజులుగా వ‌ర్షాలు దంచికొడుతోన్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా విశాఖ వాతావరణ కేంద్రం తాజా అంచనాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల తీవ్రత వచ్చే నెల 2వ తేదీ తర్వాత మరింత పెరగనుంది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దాని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథకుమార్ తెలిపారు.

రెండో రోజు మోదీ జపాన్ టూర్

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ జపాన్ వెళ్లారు. ఇందులో భాగంగానే శుక్రవారం టోక్యోలో జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు అనేక అంశాలపై చర్చించారు. కాగా రెండో రోజు కూడా మోదీ పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. వీటికి సంబంధించిన వివరాలు ఈ రోజు తెలుసుకుందాం.

చర్చనీయాంశంగా మారిన అమెరికా ఉపాధ్యక్షుడి వ్యాఖ్య‌లు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. దేశంలో ఎలాంటి అనూహ్య పరిస్థితి లేదా విషాదం చోటు చేసుకున్నా, అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో వాన్స్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్‌ ఆరోగ్యం బాగోలేదన్న వాదనలపై స్పందిస్తూ ఆయన స్పష్టత ఇచ్చారు. ‘‘అధ్యక్షుడు ట్రంప్‌ పూర్తి ఆరోగ్యంతో, ఉత్సాహంగా ఉన్నారు. మిగిలిన పదవీకాలాన్ని ఆయన విజయవంతంగా కొనసాగిస్తారని నాకు నమ్మకం ఉంది. కానీ ఒకవేళ అనుకోని పరిస్థితులు ఏర్పడితే, అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను’’ అని వాన్స్‌ తెలిపారు. దీనిపై ప్ర‌పంచం ఎలా స్పందిస్తుందో చూడాలి.

నేడు క‌బ‌డ్డీ మ్యాచ్ వివ‌రాలు

ప్రొ క‌బ‌డ్డీ 12వ సీజ‌న్ శ‌నివారం నుంచి మొద‌లైన విష‌యం తెలిసిందే. అయితే తొలి మ్యాచ్‌లోనే తెలుగు టైటాన్స్ ఓట‌మి చ‌వి చూసింది. శుక్రవారం విశాఖపట్నంలోని పోర్టు స్టేడియం విశ్వనాథ స్పోర్ట్స్‌ క్లబ్‌లో జరిగిన పీకేఎల్‌ 12వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 35-38 తేడాతో తమిళ్‌ తలైవాస్‌ చేతిలో ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే ఈరోజు ప్రో క‌బ‌డ్డీలో భాగంగా రెండు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలుగు టైటాన్స్‌ × యూపీ యోధాస్‌ (రాత్రి 8 నుంచి), యు ముంబా × గుజరాత్‌ జెయింట్స్‌ (రాత్రి 9 నుంచి) జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌ల‌ను జియో హాట్‌స్టార్ లేదా స్టార్ స్పోర్ట్స్‌లో వీక్షించ‌వ‌చ్చు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?
Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !