పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో విచారణ.. సమయం కోరిన కేంద్రం 

By Rajesh KarampooriFirst Published Nov 9, 2022, 3:08 PM IST
Highlights

డీమోనిటైజేషన్ కేసు: 2016 లో కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తప్పు అని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ప్రస్తుతానికి వాయిదా పడింది. తదుపరి విచారణ నవంబర్ 24న జరగనుంది.

డీమోనిటైజేషన్ కేసు: నోట్ల రద్దు కేసుపై విచారణను సుప్రీంకోర్టు బుధవారం వాయిదా వేసింది. 2016లో కేంద్రప్రభుత్వం  పెద్ద నోట్ల రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నవంబర్ 24న విచారణ చేపట్టనుంది. ఈ విచారణ సందర్బంగా ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్‌ వెంకటరమణి సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం కావాలని అభ్యర్థించారు. సమగ్ర అఫిడవిట్‌ తయారు చేసేందుకు వారం రోజుల గడువు కావాలని ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ కోరారు. 

ప్రభుత్వ అభ్యర్థనను స్వీకరించిన కోర్టు కేసు తదుపరి విచారణను నవంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది. వాస్తవానికి.. ఈ కేసును విచారిస్తున్న ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 500,1000 నోట్లను ఉపసంహరించాలనే నిర్ణయానికి ముందు ఏ ప్రక్రియను అవలంభించారనే దానిపై స్ఫష్టత ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు కోరింది. ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ దీనిపై స్పందించేందుకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు.

500, 1000 రూపాయల నోట్ల రద్దు 

కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8, 2016లో నోట్ల రద్దును ప్రకటించింది. ఈ సంచలన నిర్ణయంతో దేశంలో 500, 1000 రూపాయల కరెన్సీ నోట్ల చెల్లుబాటు ఆగిపోయింది. ఈ నిర్ణయం ప్రభావం దేశవ్యాప్తంగా పడింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ముందుగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వివేక్ నారాయణ్ శర్మ కోర్టులో పిటిషన్ వేశారు. 2016 నుంచి ఇప్పటి వరకు పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా 57 పిటిషన్లు దాఖలయ్యాయి.

నోట్ల రద్దుకు సంబంధించి గత విచారణ సందర్భంగా..నోట్ల రద్దు యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నోట్ల రద్దు నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను స్పందించాల్సిందిగా కోరింది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయంపై నవంబర్ 9న విచారణకు ముందు సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని, ఆర్బీఐని సుప్రీం కోర్టు కోరింది.

ఇది కాకుండా, నవంబర్ 7, 2016న ఆర్‌బీఐకి రాసిన లేఖను, మరుసటి రోజు నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన ఫైళ్లను సిద్ధంగా ఉంచాలని ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. నోట్ల రద్దు కేసును జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తోంది. ధర్మాసనంలో జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ బివి నాగరత్న ఉన్నారు.

click me!