రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవు.. సింధు జలాల ఒప్పందం పునరాలోచనపై ఆనాడే మోదీ హింట్..

By Sumanth KanukulaFirst Published Jan 28, 2023, 11:19 AM IST
Highlights

సింధు నదీ జలాల ఒప్పందాన్నిసవరించుకుందామని ప్రతిపాదిస్తూ పాకిస్థాన్‌కు భారత్ నోటీసు జారీ చేసింది. తద్వారా ఆరు దశాబ్దాల నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని మార్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సిద్దమైనట్టుగా  చెప్పొచ్చు. 

సింధు నదీ జలాల ఒప్పందాన్నిసవరించుకుందామని ప్రతిపాదిస్తూ పాకిస్థాన్‌కు భారత్ నోటీసు జారీ చేసింది. తద్వారా ఆరు దశాబ్దాల నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని మార్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సిద్దమైనట్టుగా  చెప్పొచ్చు. ఒప్పందం అమలులో పాక్‌ ఉల్లంఘనలు, మొండి వైఖరి వల్లే భారత్ ఈ విధమైన నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే సింధు జలాల ఒప్పందాన్ని సవరించాలన్న నిర్ణయం ఇప్పటిది కాదని తెలుస్తోంది. ప్రధాని మోదీ చాలా కాలంగా ఈ ఆలోచనతో ఉన్నారని సమాచారం. ఇందుకు సంబంధించి 2016 సెప్టెంబర్‌లోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి మొదటిసారిగా సూచన వచ్చింది. ప్రస్తుతం సింధు జాలాల ఒప్పందానికి సంబంధించి పాక్‌కు భారత్‌ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో గతంలో ప్రధాని మోదీ మాటలు తెరపైకి వచ్చాయి. 

2016లో జమ్మూలోని ఉరీలోని భారత ఆర్మీ స్థావరంపై పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి  తెలిసిందే. ఈ దాడిలో 18 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ ఘటన  జరిగిన తర్వాత 11 రోజులకు సింధు నదీ జలాల ఒప్పందంపై జరిగిన సమీక్ష సమావేశంలో ప్రధాని మోదీ తమ  వైఖరిని స్పష్టం చేశారు. ఈ సమీక్షకు హాజరైన అధికారులతో.. ‘‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’’ అని ప్రధాని  మోదీ అన్నారు. తద్వారా.. రక్తపాతానికి పాల్పడుతున్న పాకిస్తాన్‌తో నీటిపై ఒప్పందం కొనసాగించలేమని మోదీ ఆనాడే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 

ఆ తర్వాత రెండేళ్లలోపే.. ప్రధానమంత్రి మోదీ 2018 మేలో బందిపూర్‌లో 330 మెగావాట్ల (మెగావాట్) కిషన్‌గంగా హైడల్ ప్రాజెక్టును ప్రారంభించారు. జమ్మూ- కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో 1,000 మెగావాట్ల పాకల్-దుల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. అలాగే.. 2016లో జరిగిన సమీక్ష సమావేశం అనంతరం మరో రెండు  భారీ హైడల్ ప్రాజెక్టుల (1,856 మెగావాట్ల సావల్‌కోట్,  800 మెగావాట్ల బర్సర్ ) పనులను కూడా వేగవంతం చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో కిష్త్వార్‌లోని చీనాబ్‌పై 850 మెగావాట్ల రాటిల్, 540 మెగావాట్ల క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

ఇక, సింధు నదీ జలాల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్‌, పాక్‌ 1960లో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే ఓవైపు భారత్‌పై ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తూ.. మరోవైపు సింధు జలాల విషయంలో ఉల్లంఘనలకు పాల్పుడుతున్న పాకిస్తాన్‌కు కౌంటర్ ఇచ్చేందుకు 2016 తర్వాత మోదీ ప్రభుత్వం పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం, ఇప్పటికే ఉన్నవాటిని వేగవంతం చేసింది. ఒప్పందానికి లోబడి గరిష్టంగా సింధూ జలాలని వినియోగించుకోవాలని భారత ప్రభుత్వం ఆలోచనలో ఉంది. 

click me!