మైసూర్ రేప్ కేస్: నా తలపై బండతో బాదారు.. ఆమెను చెట్ల పొదల.. బాధితురాలి మిత్రుడి వాంగ్మూలం

By telugu teamFirst Published Aug 27, 2021, 3:37 PM IST
Highlights

‘ఆ ఏరియాకు నేను రోజూ జాగింగ్‌కు వెళ్లేవాడిని. ఆ రోజు సాయంత్రం 7.30 గంటలకు క్లాసులన్నీ అయిపోయాక ఇద్దరం కలిసి బండిపై వెళ్లాం. బండి ఆపి దిగి కాస్త నడక ప్రారంభించగానే ఆరుగురు దుండగులు మమ్మల్ని చుట్టుముట్టారు’ మైసూరు రేప్ కేసు బాధితురాలి ఫ్రెండ్ స్టేట్‌మెంట్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం రికార్డు చేసింది.

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో సంచలనం రేపిన మైసూరు రేప్ కేసులో ఒక అడుగు ముందుకు పడింది. బాధితురాలి మిత్రుడి స్టేట్‌మెంట్‌‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం రికార్డ్ చేసింది. ఈ వాంగ్మూలంలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఆ ప్రాంతం తనకు చాలా కాలం నుంచి తెలుసు అని, ప్రతి రోజు అక్కడికి జాగింగ్‌కు వెళ్లేవాడని తెలిపారు. మైసూరు శివారులోని చాముండి హిల్స్ దగ్గర ఎంబీయే విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. బాధితురాలు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. దీంతో బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు ఇంకా తీసుకోవాల్సి ఉన్నది.

‘క్లాస్‌లు అయిపోగానే రాత్రి 7.30 గంటలకు మేం బైక్‌పై వెళ్లాం. జేఎస్ఎస్ ఆయుర్వేదిక్ కాలేజీ రోడ్డు మీదుగా వెళ్లాం. ఆ స్పాట్‌ నాకు చాలా కాలంగా తెలుసు. అక్కడే బండి ఆపి సరదాగా నడక ప్రారంభించాం. అప్పుడు ఉన్నట్టుండి ఆరుగురు దుండగులు మమ్మల్ని రౌండప్ చేశారు’ అని బాధితురాలి మిత్రుడు పోలీసులకు వివరించారు.

వారందరూ తనను కర్రలతో కొట్టినట్టు బాధితురాలి ఫ్రెండ్ తెలిపారు. గ్యాంగులో నుంచి ఒక సన్నని కుర్రాడు ఓ చిన్న బండరాయి తెచ్చి తన ముఖంపై కొట్టాడన్నారు. తాను స్పృహ కోల్పోయేవరకూ బాదారని వివరించారు. ‘నేను స్పృహలోకి రాగానే నా చుట్టూ నలుగురు గుమిగూడి ఉన్నారు. నా గర్ల్‌ఫ్రెండ్ ఏదని వారిని అడిగాను. అందులో ఇద్దరు పొదల్లో నుంచి నా గర్ల్‌ఫ్రెండ్‌ను లాక్కొచ్చి నా పక్కన పడేశారు. ఆమె దేహం మొత్తం గాయాలతో నిండింది. ఆమె బహుశా అపస్మారక స్థితిలో ఉన్నది’ అని వివరించారు.

ఆ రేపిస్టులు తన మొబైల్ ఫోన్ లాక్కున్నట్టు బాధితురాలి మిత్రుడు వివరించారు. ఆ ఫోన్ ద్వారా తన తండ్రికి ఫోన్ చేసి రూ. 3 లక్షలు తక్షణమే అరేంజ్ చేయాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. వారిద్దరినీ వదిలిపెట్టడానికి ముందు రేపిస్టులకు ఆ డబ్బు ముట్టిందా? లేదా? అనేది ఇంకా తెలియరాలేదు. నిందితులందరూ 25ఏళ్ల నుంచి 30ఏళ్లలోపు వారేనని తెలిసింది.

ఈ కేసుపై మాట్లాడుతూ రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.  మైసూరులో ఘటన జరిగితే కాంగ్రెస్ తనను రేప్ చేయాలనుకుంటున్నదని చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. వీటితోపాటు బాధితురాలు చీకటి వేళ అక్కడికి వెళ్లాల్సింది కాదని బాధితురాలినే తప్పుపట్టే వ్యాఖ్యలు చేయడంపైనా అభ్యంతరాలు వచ్చాయి. తాజాగా, తన వ్యాఖ్యలన్నిటినీ వెనక్కి తీసుకుంటున్నట్టు మంత్రి జ్ఞానేంద్ర తెలిపారు. కేసుపై దర్యాప్తునకు ఆదేశించారని, దర్యాప్తు వేగంగా సాగుతున్నదని చెప్పారు.

click me!