వచ్చే 8 వారాలు జాగ్రత్తగా ఉండాలి.. వ్యాక్సిన్ తీసుకున్నా సరే.. : రణదీప్ గులేరియా

By telugu teamFirst Published Sep 25, 2021, 3:38 PM IST
Highlights

పండుగ వేళ్లలో ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని, అలసత్వం వహిస్తే మళ్లీ దారుణ పరిస్థితులు ఎదురయ్యే ముప్పు ఉందని ఎయిమ్స్ డైరెక్టర్, డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. కరోనా టీకా తీసుకున్నప్పటికీ జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వచ్చే 6 నుంచి 8 వారాలు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
 

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఇంకా సమసిపోలేదని, అప్రమత్తత అవసరమేనని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తాజాగా మరోసారి హెచ్చరించారు. కరోనా సెకండ్ వేవ్ విలయం నుంచి దేశం ఇంకా తేరుకోలేదు. లక్షలాది కుటుంబంలో సంక్షోభంలో కూరుకుపోయాయి. తాజాగా, కరోనాపై ఎయిమ్స్ డైరెక్టర్, డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడారు. దేశంలో సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని అన్నారు. వచ్చే 6 నుంచి 8 వారాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కాలంలో భారత్‌లో పండుగ సీజన్ ఉండనుంది. సాధారణంగా మనదేశంలో పండుగలకు కుటుంబీకులు, బంధువులంతా ఒకచోట చేరి వేడుకలు చేసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో వచ్చే 8 వారాల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లేదంటే పరిస్థితులు మళ్లీ దిగజారుతాయని హెచ్చరించారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాగానీ, అప్రమత్తంగా ఉండాల్సిందేనని డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. టీకా తీసుకున్నా కరోనా సోకే అవకాశముందని వివరించారు. కానీ, టీకా ఆ వైరస్‌ తీవ్రతను తగ్గిస్తుందని, తద్వారా రోగం తీవ్రతను తగ్గిస్తుందని తెలిపారు. టీకా తీసుకున్నాక వైరస్ సోకినా తేలికపాటి దశకే అది పరిమితమవుతుందని వివరించారు. కాబట్టి అర్హులందరూ వీలైనంత త్వరగా టీకా వేసుకోవాలని అన్నారు. ఇప్పటికైతే దేశంలో కరోనా కేసులు మొత్తంగా తీసుకుంటే తక్కువే నమోదవుతున్నాయని వివరించారు. వైరస్ తిరోగమనదారి పట్టిందని తెలిపారు. అయినప్పటికీ అలసత్వం కూడదని చెప్పారు. పండుగ సీజన్‌లో కేసులను మళ్లీ భారీగా పెంచవద్దని కోరారు. అందరూ తప్పకుండా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, కొవిడ్ నిబంధనలన్నీ పాటించాలని సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదు. చాలా దేశాలు ఇప్పటికీ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి మనకు అందుబాటులో ఉన్న ఏకైక ఆయుధం టీకా అని నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలా దేశాలు టీకా పంపిణీపై ఫోకస్ పెట్టాయి. భారత్ కూడా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసింది. తొలుత టీకా కొరత సమస్య ఎదుర్కన్నప్పటికీ ఇప్పుడు దాన్ని అధిగమించింది. 

click me!