సుశాంత్ కేసులో మరో కీలక పరిణామం: ఎన్సీబీ దూకుడు.. డ్రగ్స్ వ్యాపారి అరెస్ట్

By Siva KodatiFirst Published Jun 2, 2021, 10:05 PM IST
Highlights

సుశాంత్ కేసును సీబీఐ, ఎన్‌సీబీ (నార్కోటిక్స్‌ సెంట్రల్‌ బ్యూరో), ఈడీ, (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ వ్యాపారి హరీశ్‌ ఖాన్‌ను ఎన్‌సీబీ ఇవాళ అరెస్టు చేసింది.  
 

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసులో బుధవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో డ్రగ్స్‌ వ్యవహారం వెలుగు చూడటంతో బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్ దాకా ప్రకంపనలు సృష్టించింది. దీంతో సుశాంత్ కేసును సీబీఐ, ఎన్‌సీబీ (నార్కోటిక్స్‌ సెంట్రల్‌ బ్యూరో), ఈడీ, (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ వ్యాపారి హరీశ్‌ ఖాన్‌ను ఎన్‌సీబీ ఇవాళ అరెస్టు చేసింది.  

ఈ కేసులో నిందితుడిగా ఉన్న సుశాంత్ సింగ్ స్నేహితుడు సిద్ధార్థ్‌ పితానిని ఇటీవల (మే 26న) హైదరాబాద్‌లో ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో సుశాంత్‌ ఇంట్లో పనిచేసే నీరజ్‌, కేశవ్‌లను కూడా అధికారులు విచారించారు. సిద్ధార్థ్‌ చేసిన వాట్సాప్‌ చాట్‌ ఆధారంగా హరీశ్‌తో సంబంధాలు ఉన్నట్లు ఎన్సీబీ నిర్ధారించింది. దీంతో డ్రగ్స్‌ వ్యాపారి హరీశ్‌ఖాన్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

Also Read:సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు: సిద్దార్ధ్ పితాని అరెస్ట్

మరోవైపు సుశాంత్‌ మృతి కేసులో నిందితురాలిగా ఉన్న అతని ప్రేయసి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడిని గతేడాది అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజులపాటు జైలులో ఉన్న తర్వాత రియా చక్రవర్తికి ముంబయి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తర్వాత కొంతకాలానికి ఆమె సోదరుడు కూడా బెయిల్‌పై విడుదలయ్యాడు.

ఇదిలా ఉండగా..  సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ జీవిత చరిత్రపై సినిమాలు తీయడంపై నిషేధం విధించాలంటూ ఆయన తండ్రి కృష్ణ కిషోర్‌ సింగ్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. సుశాంత్‌ జీవిత చరిత్ర ఆధారంగా ‘న్యాయ్‌’ అనే చిత్రాన్ని ఇప్పటికే తెరకెక్కించగా.. అది జూన్‌ 11న విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోర్ట్ తీర్పుపై ఈ సినిమా భవిష్యత్ ఆధారపడి వుంది. 

click me!