రేపిస్టు శిక్షను తగ్గించిన హైకోర్టు.. ‘ఆ బాలికను చంపేయకుండా వదిలిపెట్టే దయ ఉంది’

By Mahesh KFirst Published Oct 23, 2022, 12:59 PM IST
Highlights

మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నాలుగేళ్ల బాలికను రేప్ చేసిన దోషికి శిక్ష తగ్గించింది. నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి జరిపి.. ఆ బాలికను సజీవంగానే వదిలిపెట్టాడని పేర్కొంటూ ఈ తీర్పు వెలువరించడం గమనార్హం.
 

భోపాల్: మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నాలుగేళ్ల బాలికను రేప్ చేసిన ఓ రేపిస్టుకు శిక్షను తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ రేపిస్టు కనీసం బాలికను సజీవంగా వదిలిపెట్టాడని పేర్కొంది. అందుకోసమే ఆ రేపిస్టు జీవిత ఖైదును 20 ఏళ్ల కారాగార శిక్షగా తగ్గించింది.

నాలుగేళ్ల బాలికను రేప్ చేసిన కేసులో దోషి 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. తాజాగా, ఆ దోషి మధ్యప్రదేశ్ హైకోర్టులో ఓ పిటిషన్ వేశాడు. తన నేరానికి ఈ 15 ఏళ్ల శిక్షనే సరిపోతుందని పరిగణించి.. తనకు విముక్తి ప్రసాదించాలని కోరాడు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ఇండోర్ బెంచ్ విచారించింది. ఈ రేపిస్టు చేసిన అఘాయిత్యాన్ని పరిశీలిస్తే..మహిళలపై గౌరవం లేదని తెలుస్తున్నదని వివరించింది. వారి డిగ్నిటీని రెస్పెక్ట్ చేయడని తెలుస్తున్నదని పేర్కొంది. నాలుగేళ్ల చిన్నారిపైనా అయినా లైంగికదాడికి పాల్పడే సహజ నేర ప్రవృత్తి కలిగి ఉన్నట్టు అర్థం అవుతున్నదని వివరించింది.  ఈ కేసు పరిశీలిస్తే దోషికి శిక్ష తగ్గించే అవకాశమే లేదని తెలిపింది.

Also Read: హెల్త్ సెంటర్‌లోకి చొరబడి నర్సుపై సామూహిక అత్యాచారం.. చంపేస్తామని బెదిరింపు.. నిందితుల్లో మైనర్..

కానీ, ఆ నాలుగేళ్ల చిన్నారిని సజీవంగా వదిలిపెట్టే దయాగుణం కలిగి ఉన్నాడనే విషయం అర్థం అవుతుందని, కాబట్టి, ఈ దోషి శిక్షను 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షకు కుదించాలనే అభిప్రాయాన్ని కోర్టు కలిగి ఉందని తెలిపింది. ఈ తీర్పును న్యాయమూర్తులు సుబోధ్ అభ్యంకర్, సత్యేంద్ర కుమార్ సింగ్‌లు ఈ నెల 18న ఇచ్చారు.

బాధిత నాలుగేళ్ల చిన్నారి నివసించే గుడిసెకు సమీపంలోనే ఓ టెంటు కింద దోషి నివసించేవాడు. వారంతా లేబర్ పనులు చేసుకునేవారే. ఓ రోజు ఆ బాలికకు ఒక రూపాయి ఇస్తా అని చెప్పి తన గుడిసెలోకి తీసుకెళ్లాడు. ఆ బాలికను రేప్ చేస్తుండగా బాలిక నానమ్మ చూసింది. ఆమె వాంగ్మూలం, మెడికల్ ఆధారాల పరిశీలనలో.. బాలిక పై లైంగిక దాడి జరిగినట్టు తేలింది.

click me!