తల్లితో సహజీవనం, కూతురిపై కన్ను: ప్రియుడిని నవ్వుతూ చంపించింది

By Siva KodatiFirst Published Jun 4, 2019, 8:37 AM IST
Highlights

సహజీవనంలో మనస్పర్థల కారణంగా ప్రియుడిని ప్రియురాలు దారుణంగా హత్య చేయించింది. వివరాల్లోకి వెళితే.. మధురైకి చెందిన ఇళంగోవన్ ఫైనాన్స్‌తో పాటు పలు వ్యాపారాలు చేస్తున్నారు.

సహజీవనంలో మనస్పర్థల కారణంగా ప్రియుడిని ప్రియురాలు దారుణంగా హత్య చేయించింది. వివరాల్లోకి వెళితే.. మధురైకి చెందిన ఇళంగోవన్ ఫైనాన్స్‌తో పాటు పలు వ్యాపారాలు చేస్తున్నారు.

ఆయన భార్య ఐదేళ్ల క్రితం మరణించింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉంటున్న ఇళంగోవన్‌కు అభిరామి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ నటరాజన్‌ నగర్‌లో ఇంటిని కొనుగోలు చేసుకుని సహజీవనం చేస్తున్నారు.

అభిరామికి సైతం గతంలోనే వివాహమైంది.. ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. భర్త మరణించాడో, లేక వదిలేశాడో కానీ.. అభిరామి మాత్రం ఐదేళ్లుగా ఇళంగోవన్‌తోనే కలిసే ఉంటోంది. ఈ నేపథ్యంలో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న అభిరామి పెద్ద కుమార్తె అనుహ్య తరచుగా ఇంటికి వస్తు అమ్మతో మాట్లాడి వెళుతోంది.

ఈ నేపథ్యంలో ఇళంగోవన్ కన్ను అనుహ్య మీద పడింది. అంతేకాకుండా అభిరామి ఇంట్లో లేని సమయంలో అనుహ్యతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె తన తల్లితో చెప్పింది.

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అభిరామి.. తనకు ఏమి తెలియనట్లు వ్యవహరిస్తూ వచ్చింది. ఇళంగోవన్ ఆస్తి, ఫైనాన్స్ సంస్థలోని నగదు మీద దృష్టి పెట్టిన ఆమె.. ఆయనతో సన్నిహితంగా ఉంటూ, వెన్నుపోటు పొడిచేందుకు పథకం వేసింది.

అనుహ్య స్నేహితుడు బాలమురుగన్, అతని స్నేహితుడి ద్వారా ఇళంగోవన్‌ను చంపేందుకు కుట్ర పన్నింది. ఈ క్రమంలో శనివారం ఇళంగోవన్‌తో కలిసి ఇంటి వద్ద ఉన్న ఉయ్యాలలో ఉంది.

ముందుగా వేసిన పథకం ప్రకారం ఐదుగురు యువకులు ఇంట్లోకి ప్రవేశించి ఇళంగోవన్‌ను కత్తులతో దారుణంగా నరికి చంపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తొలుత ఆర్ధిక, వ్యాపార లావాదేవీల కారణంగా హత్య జరిగి ఉంటుందని భావించారు.

అయితే సీసీటీవీ పరిశీలించిన పోలీసులకు హత్య జరిగిన సమయంలో యువకులు మరీ కిరాతకంగా వ్యవహరిస్తుండటం, ఇళంగోవన్ వారితో పోరాడుతుండటం, అప్పటి వరకు అతనితోనే ఉన్న అభిరామి ఏమాత్రం అడ్డుకోకపోవడంతో అనుమానం కలిగించింది.

అన్నింటికి మించి హత్య సమయంలో ఆమె చిరు నవ్వులు చిందిస్తుండటంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. వెంటనే అభిరామిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెతో పాటు అనుహ్య, బాలమురుగన్, అతడి ఐదుగురు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

click me!