సోమనాథ్ ఛటర్జీ: నిబద్ధతకు శిక్ష, బహిష్కరణకు గురై ఒంటరి జీవితం

By pratap reddyFirst Published Aug 13, 2018, 10:58 AM IST
Highlights

పార్లమెంటు చరిత్రలో అత్యంత క్లిష్టమైన సందర్భంలో సోమనాథ్ ఛటర్జీ నిష్పాక్షికంగా వ్యవహరించారు. దాదాపు 40 ఏళ్ల పాటు లోకసభకు ప్రాతినిధ్యం వహించిన సోమనాథ్ ఛటర్జీపై పార్టీ ఏ మాత్రం కనికరం చూపించలేదు. 

కోల్ కతా: స్పీకర్ గా నిబద్ధతతో వ్యవహరించినందుకు సోమనాథ్ ఛటర్జీ పెద్ద శిక్షనే అనుభవించారు. లోకసభ స్పీకర్ గా తటస్థ వైఖరి తీసుకున్నందుకు పార్టీ ఆయనకు పెద్ద శిక్షనే వేసింది. ఆయనను సిపిఎం నాయకత్వం పార్టీ నుంచి బహిష్కరించింది. దాంతో ఆయన తన చివరి రోజులను ఒంటరిగా గడపాల్సి వచ్చింది. 

పార్లమెంటు చరిత్రలో అత్యంత క్లిష్టమైన సందర్భంలో సోమనాథ్ ఛటర్జీ నిష్పాక్షికంగా వ్యవహరించారు. దాదాపు 40 ఏళ్ల పాటు లోకసభకు ప్రాతినిధ్యం వహించిన సోమనాథ్ ఛటర్జీపై పార్టీ ఏ మాత్రం కనికరం చూపించలేదు. 

పార్టీని ధిక్కరించిన తొలి కీలకమైన నేత సోమనాథ్ ఛటర్జీ కావడం విశేషం. ఆయన సహచరుడు, ఐదుసార్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతిబసు పార్టీ పంథాకు కట్టుబడి ప్రధాని పదవిని వదులుకున్నారు. 

పది సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన ఆయన గత రెండు నెలలుగా ఆస్పత్రికి వెళ్తూ, బయటకు వస్తూ గడిపి చివరకు సోమవారం ఉదయం మరణించారు. ఈ నెల 8వ తేదీన ఆయన బెల్లే వ్యూ ఆస్పత్రిలో చేరారు. 

పార్టీలో శిఖర ప్రాయుడైన సోమనాథ్ ఛటర్జీ పార్టీ నుంచి లోకసభ స్పీకర్ గా ఎన్నికైన ఏకైక నాయకుడు. భారత, అమెరికా అణు ఒప్పందం విషయంలో సిపిఎంకు, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదంలో పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు. 

సిపిఎం అమెరికాతో అణు ఒప్పందాన్ని వ్యతిరేకించింది. దాంతో 2008 జులైలో యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసహరించుకుంది. జులై 21 తేదీన ప్రారంభమైన రెండు రోజుల లోకసభ సమావేశాల ఏర్పాటుకు ముందే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని, విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని సిపిఎం నాయకత్వం ఛటర్జీని ఆదేశించింది. 

యుకెలో బారిష్టర్ విద్యను అభ్యసించిన సోమనాథ్ ఛటర్జీ రాజీనామా చేయకుండా విశ్వాస తీర్మానం సందర్భంగా లోకసభ అధ్యక్ష స్థానంలో కూర్చోవాలనే నిర్ణయించుకున్నారు. పార్టీ నుంచి ఎంతగా ఒత్తిడి వచ్చినప్పటికీ స్పీకర్ పక్షపాతానికి, పార్టీ రాజకీయాలకు అతీతుడని ఆయన భావించారు.

ఓ నెల రోజుల తర్వాత ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. అవి తనకు అత్యంత విషాదకరమైన రోజులని ఆయన వ్యాఖ్యానించారు. పాలక పార్టీ మద్దతుతో ఆయన పదవీ కాలం ముగిసే వరకు స్పీకర్ గా కొనసాగారు. 

ఛటర్జీ 1996లో అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికయ్యారు. సోమనాథ్ ఛటర్జీ  మంచి స్పీకర్ అని, ఫెయిర్ అంపైర్ అని ఆయనను విమర్శించేవాళ్లు కూడా అంగీకరించారు.

పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సోమనాథ్ ఛటర్జీ మళ్లీ లోకసభకు పోటీ చేయలేకపోయారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన బోల్పూర్ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయింది. 

సిపిఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నికైన తర్వాత సోమనాథ్ ఛటర్జీని మళ్లీ పార్టీలోకి తీసుకుని వస్తారనే ప్రచారం జరిగింది. తాను బహిష్కరణ చేయతగినవాడిని కాదని తాను అప్పుడే అనుకున్నందున తిరిగి పార్టీలోకి వెళ్లడం తనకు ఇష్టం లేకపోయిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

click me!