మోడీతో తగ్గేది లేదంటున్న దీదీ: నీతి ఆయోగ్ సమావేశానికి నో

By Siva KodatiFirst Published Jun 7, 2019, 1:53 PM IST
Highlights

ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీపై లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పోరాటం చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పట్లో బీజేపీని వదిలిపెట్టేలా కనిపించడం లేదు.

ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీపై లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పోరాటం చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పట్లో బీజేపీని వదిలిపెట్టేలా కనిపించడం లేదు. దీనిలో భాగంగా మోడీ అధ్యక్షతన ఈ నెల 15న జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి తాను హాజరుకావడం లేదని దీదీ ప్రకటించారు.

ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాసిన మమత... ‘‘ నీతి ఆయోగ్‌కు ఎలాంటి ఆర్ధిక అధికారాలు గానీ.. రాష్ట్రాల ప్రణాళికలకు మద్ధతిచ్చే అధికారం గానీ లేదు.. అలాంటప్పుడు నీతీ ఆయోగ్ సమావేశానికి హాజరుకావడం అనేది వ్యర్ధమైన పని లేఖలో పేర్కొన్నారు.

గత నాలుగున్నరేళ్లుగా నీతి ఆయోగ్ పనితీరును చూసిన తర్వాత తాను చెప్పాలనుకున్నది ఒక్కటేనని.. కొన్ని మార్పులు చేర్పులతో ఇంటర్ స్టేట్ కౌన్సిల్‌పై దృష్టి పెట్టడమే మంచిదని ఇది ఫెడరల్ విధానాలను మరింత బలోపేతం చేస్తుందని మమత అభిప్రాయపడ్డారు.

నీతి ఆయోగ్‌ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన దీదీ ఆ సంస్ధ సమావేశాలకు గైర్హాజరయ్యారు. ఎప్పటి నుంచో ఉన్న ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేయడంపై మమతా బెనర్జీ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

కాగా.. జూన్ 15వ తేదీన ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. 

click me!