Amar Jawan Jyoti: నేషనల్ వార్ మెమొరియల్‌లో అమర జవాన్ జ్యోతి విలీనం పూర్తి

By Rajesh KFirst Published Jan 21, 2022, 4:15 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలోని అమర జవాన్ జ్యోతి (amar jawan jyoti) చరిత్రలో కలిసిపోయింది. ఐదు దశాబ్ధాలుగా నిరంతరాయంగా వెలుగుతున్న జ్యోతి ఆరిపోయింది. నేషనల్ వార్ మెమొరియల్‌లో అమర జవాన్ జ్యోతి (national war memorial) విలీనం పూర్తయ్యింది

దేశ రాజధాని ఢిల్లీలోని అమర జవాన్ జ్యోతి (amar jawan jyoti) చరిత్రలో కలిసిపోయింది. ఐదు దశాబ్ధాలుగా నిరంతరాయంగా వెలుగుతున్న జ్యోతి ఆరిపోయింది. నేషనల్ వార్ మెమొరియల్‌లో అమర జవాన్ జ్యోతి (national war memorial) విలీనం పూర్తయ్యింది. మరోవైపు అమర్ జవాన్ జ్యోతి, నేషనల్ వార్ మెమోరియల్‌లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. అమర్ జవాన్ జ్యోతి దీపాన్ని నేషనల్ వార్ మెమోరియల్‌‌లో కలిపేస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రకటనతో కాంగ్రెస్ (congress) సహా ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం అమర జవాన్లను అగౌరవపరుస్తున్నదని మండిపడ్డాయి. 

రాహుల్ గాంధీ ఏకంగా.. కొందరికి దేశంపై ప్రేమ, బలిదానాలు అర్థం కావు అని ట్వీట్ చేశారు. అమర జవాన్ జ్యోతిని ఆర్పేస్తారని పేర్కొన్నారు. అయితే, మన సైనికుల కోసం మరోసారి జ్యోతిని వెలిగిస్తామని తెలిపారు. అమర్ జవాన్ జ్యోతిపై కేంద్ర ప్రకటనతో ఆర్మీ బలిదానాలు, వారి త్యాగాలపై చర్చ మొదలైంది. కేంద్ర ప్రకటనతో కాంగ్రెస్ అగ్గిమీద గుగ్గిళం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌పై కొందరికి కొన్ని అనుమానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ.. ఈ అంశాన్ని రాజకీయం చేసి లబ్ది పొందాలని అనుకుంటున్నదా? లేక నిజంగానే కాంగ్రెస్‌కు అమర జవాన్లపై అంతటి ప్రేమ ఉన్నదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో ప్రస్తుత కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (rajeev chandra sekhar) లేఖలు ముందుకు వచ్చాయి.

మన దేశాన్ని రక్షిస్తూ ఏళ్ల తరబడి అనేక మంది జవాన్లు నేలకొరిగారు. వారిని స్మరించుకోవడానికి, వారికి నివాళిగా నేషనల్ వార్ మెమోరియల్ నిర్మించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉన్నది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడూ ఈ డిమాండ్ ఎక్కువగా వినిపించింది. నేషనల్ వార్ మెమోరియల్ నిర్మిస్తామని కాంగ్రెస్ బుకాయిస్తూ సకాలంలో సరైన నిర్ణయాలు, చర్యలు తీసుకోలేదు. చివరకు 2014లో బీజేపీ (bjp) కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాతే నేషనల్ వార్ మెమోరియల్‌ నిర్మాణానికి బలమైన పునాదులు పడ్డాయి. 

అయితే.. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న గగ్గోలును ప్రస్తుత కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ 2009లో కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు తేటతెల్లం చేస్తున్నాయి. నేషనల్ వార్ మెమోరియల్ నిర్మించాలని ఆయన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ నిర్మాణంలో ఏవైనా సమస్యలు ఉన్నా తాను అన్ని విధాల సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంతేకాదు, నేషనల్ వార్ మెమోరియల్ నిర్మాణానికి ఢిల్లీలో స్థలం వెతకడం సమస్యగా ఉన్నదని తనకు తెలుసు అని పేర్కొన్నారు. అయితే, నేషనల్ వార్ మెమోరియల్ నిర్మించడానికి అనువైన స్థలాన్నీ ఆయన సూచించడం గమనార్హం. అప్పటి కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి ఎంఎం పల్లం రాజులకు లేఖ రాశారు. 

భారత ఉపఖండంలో ఎన్నో ఘర్షణలు.. అంతర్గతంగా, విదేశాల వల్ల కూడా జరిగాయని, ఈ పోరాటాల్లో ఎంతో మంది శౌర్యవంతులైన జవాన్లు తమ ప్రాణాలు త్యాగం చేశారని రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాశారు. కానీ, వారి పోరాటాలను, వారి త్యాగాలకు పెద్దగా గుర్తింపు లేకుండానే పోతున్నదని ఆవేదన చెందారు. అమెరికా లాంటి కొన్ని దేశాల్లో వారి త్యాగాలను స్మరించుకోవడానికి వార్ మోమరియల్స్ ఉన్నాయని ప్రస్తావించారు. కాబట్టి, మన దేశంలోనూ అమర జవాన్లను స్మరించడానికి, వారికి నివాళిగా నేషనల్ వార్ మెమోరియల్ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు ఇప్పటి వరకు మన దేశంలో నేషనల్ వార్ మెమోరియల్ లేకపోవడం బాధాకరమని తెలిపారు. 

నేషనల్ వార్ మెమోరియల్ నిర్మించాలని 1960లో తొలిసారిగా భారత సైనిక దళాల నుంచి ప్రతిపాదన వచ్చింది. అప్పటి నుంచి అనేక సార్లు దీనిపై చర్చ జరిగినా.. కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వంలోనూ ఇది నానుతూ వచ్చింది. అనేక మార్లు దీనిపై ఒత్తిళ్లు వచ్చాయి. ఎట్టకేలకు 2014 ఎన్నికలకు ముందు అప్పటి కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ దీనిపై కీలక ప్రకటన చేశారు. నేషనల్ వార్ మోమోరియల్ నిర్మాణానికి కేంద్ర మంత్రుల బృందం అంగీకరించిందని, ఇండియా గేట్ దగ్గర దీన్ని నిర్మిస్తామని చెప్పారు. కానీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో నేషనల్ వార్ మెమోరియల్‌, మ్యూజియానికి మోడీ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు.. రూ. 500 కోట్లు కేటాయించడానికి ఆమోదముద్ర వేసింది. 2019 జనవరిలో నేషనల్ వార్ మెమోరియల్ నిర్మాణం పూర్తయింది.

click me!