పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత, కాశ్మీర్ వెళ్లాలని ప్రణాళిక వేసుకున్న హైదరాబాద్‌కు చెందిన పర్యాటకులు తమ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల వద్ద భద్రతపై ఆందోళనలు పెరిగాయి. కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ పర్యాటకరంగంపై ఆధారపడినందున, ఈ ఘటన గిరిజనుల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడితో యావత్ దేశం ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు, స్థానికులకు చేతి నిండా పని లభిస్తోంది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి దిగారు. కశ్మీర్‌లో అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఎంతో మంది అమాయక ప్రజలు మరణించారు. కాగా.. ఈ ఘటన తర్వాత కశ్మీర్ ట్రిప్ కి వెళ్లాలి అనుకునేవారు భయపడిపోతున్నారు.
ప్రస్తుతం సమ్మర్ సెలవలు కావడంతో చాలా మంది కశ్మీర్ వెళ్లి ఎంజాయ్ చేయాలని చాలా మంది ప్లాన్ చేసుకున్నారు. అలా ప్లాన్ చేసుకున్న వారిలో హైదరాబాదీలు కూడా ఉన్నారు.కానీ నిన్నటి ఎటాక్ తో ఆ విషయంలో వారు వెనక్కి తగ్గుతున్నారు.
ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుండి చాలా మంది కాశ్మీర్‌ను సందర్శిస్తారు. ఇటీవల పూర్తయిన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ కాశ్మీర్ లోయను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించింది, ఈ ప్రాంతానికి రైలు ప్రయాణాలు చాలా సౌకర్యవంతంగా మారాయి.కానీ, ఉగ్రదాడి తర్వాత చాలా మంది కశ్మీర్ వెళ్లడానికే భయపడిపోతున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో పేర్కొనడం గమనార్హం.
‘‘మా కుటుంబం హైదరాబాద్‌లో నా మేనకోడలి వివాహానికి హాజరైన తర్వాత జూన్ మొదటి వారంలో కాశ్మీర్ సందర్శించాలని ప్లాన్ చేసుకుంది. కానీ ఇప్పుడు, ఈ ప్రాంతం సురక్షితంగా లేకపోవడంతో మేము వెళ్తామో లేదో మాకు ఖచ్చితంగా తెలియదు.’’ అని ఒకరు కామెంట్ చేశారు. స్నేహితులతో కాశ్మీర్ వెళ్లాలని ఇలా ప్లాన్ చేసుకున్న చాలా మంది ఆ ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకోవడం గమనార్హం.
కాశ్మీర్‌లోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటైన పహల్గామ్ సమీపంలో ఈ దాడి జరిగింది, ఇది కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థపై ,ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుండటం గమనార్హం. ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న గిరిజనులు చాలా అవస్థలు పడుతున్నారు. పర్యాటకులు రాకుంటే తమ జీవనం చాలా కష్టమౌతుందని వారు వాపోతున్నారు.
“మేము ఈ ప్రాంతానికి చెందిన గిరిజనులం. మా జీవితాలు పర్యాటకుల చుట్టూ తిరుగుతాయి. ఈ ప్రాంతంలో 10,000 మందికి పైగా గుర్రపు నిర్వాహకులు ఉన్నారు. మా కుటుంబాలు పూర్తిగా పర్యాటక రంగంపై ఆధారపడి ఉన్నాయి, ”అని సోనామార్గ్‌కు చెందిన గుర్రపు నిర్వాహకుడు సలీమ్ చెప్పారు.