పుస్తక సమీక్ష : సాహిత్యదాహం తీర్చిన అనువాద జలాలు

By Arun Kumar P  |  First Published Sep 26, 2023, 2:42 PM IST

గతంలో 'అదే ఆకాశం', 'అదే గాలి', 'అదే నేల', 'అదే కాంతి' అనువాద గ్రంథాలను వెలువరించి సుప్రసిద్ధులయ్యారు ముకుంద రామారావు.  పంచభూతాల్లా భావించిన ఆయన అనువాద కవిత్వ పుస్తకాలలో ఐదవది 'అదే నీరు'. ఈ సంకలనం పైన విశాఖపట్నం నుండి  డా॥ కె.జి. వేణు రాసిన సమీక్ష ఇక్కడ చదవండి :
 


ప్రఖ్యాత సాహితీవేత్త కే. సచ్చిదానందన్ గారన్నట్లు ముకుంద రామారావు  ఉత్తమ అనువాదకుడు. ఆ కోణంలో ఆయన చేసిన కృషి ఎంతో విస్తారమైనది, వైవిధ్యమైనది, విశిష్టమైనది. పంచభూతాల్లా భావించిన ఆయన అనువాద కవిత్వ పుస్తకాలలో ఐదవది 'అదే నీరు'.

గతంలో 'అదే ఆకాశం', 'అదే గాలి', 'అదే నేల', 'అదే కాంతి' అనువాద గ్రంథాలను ఆయన వెలువరించి సుప్రసిద్ధులయ్యారు ముకుంద రామారావు.   'అదే నీరు' అనువాద గ్రంథంలో జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధిచెందిన వంద కవుల పరిచయాలున్నాయి. ఆ మహామహుల కలాలనుండి వెలువడిన ఏడువందల మహాత్తరమైన కవితలకు అనువాద రూపాలున్నాయి. వెరసి 640 పేజీల పుస్తకం ఇది. ఇందులోని ప్రతి కవిత దేనికదే ప్రత్యేకంగా వుంది.

Latest Videos

undefined

నోబెల్ బహుమతి పొందిన నలుగురు పోలాండ్ మహిళలలో మూడవవారైన కవయిత్రి 'విస్లావా సింబోర్స్కా'... 'ఏదీ మారలేదు / ఎక్కువవుతున్న జనం తప్ప ...' అంటూ ప్రారంభించిన తన కవితలో నడుస్తున్న కాలం దశాబ్దాలనుంచి, శతాబ్దాలు దాటినా మనుషుల మనస్తత్వం మారలేదన్న సత్యాన్ని చాలా ఆలోచనాత్మకంగా వ్యక్తీకరించటం జరిగింది. చీలీలో పుట్టి స్పానిష్ కవిగా సుప్రసిద్ధుడైన 'నికనోర్ పారా'... 'అనుమతులు అన్నింటికీ ఉన్నాయి కవిత్వంలో / ఒకే ఒక్క షరతు / తెల్ల కాగితాన్ని బాగుపరిస్తే చాలు..' అంటూ కవులందరూ గమనించవలసిన గొప్ప మాటను సెలవిచ్చారు. 'ఇవ్వాళ నాకు నచ్చిన హైకూని / చదువుతూ సమయం గడుపుతాను / పదే పదే ఆ పదాల్ని వల్లిస్తూ / పరిపూర్ణమైన చిన్న ద్రాక్షని / మళ్లీ మళ్లీ తింటున్నట్లు పఠించిన అక్షరాల్ని / ప్రతి గదిలో జల్లుతూ ఇల్లంతా తిరుగుతాను...' అంటూ జపాన్ హైకూల మీద తనకున్న ఆసక్తిని గాఢంగా వ్యక్తం చేసిన అమెరికా దేశపు ప్రముఖకవి 'బిల్లీ కోలిన్స్'.

'రెక్కలే కానీ మైనంతో చేసినవి / పడే వర్షం, వర్షం కాదు / మన దుఃఖంతో వయనిస్తున్న నౌకలు...' అంటూ చిన్న, చిన్న పదాలకు బహళ విస్తీర్ణత కల్పిస్తాడు 'అడోనిస్' గా పిలువబడే అలీ అహ్మద్ సయీద్ అసబర్. ఈ వరుసలో మనతో కరచాలనం చేస్తూ ముందుకు వచ్చిన భారతీయ ఆంగ్లకవుల్లో కవయిత్రి, సంపాదకురాలు 'నందినీ సాహూ'...'మృత్యువే సత్యమని ఎవరన్నారంటూ ప్రశ్నించి... చూడు, నీ శరీరపు వాసన / సింహాసనం మీద కూర్చునే వుంది / నక్షత్రాల ఆకాశంలో నువ్వు ఇంకా మెరుస్తూనే వున్నావు...' అంటూ ఒక నూతన భాష్యానికి తలుపులు తెరిచి రెక్కలతో ఎగురవేస్తున్నారు.  'కొందరంటారు పదం వలికిన వెంటనే /మరణిస్తుందని / నేనంటాను ఆ రోజే దాని జీవితం మొదలవుతుందని...' అంటూ ఒక గంభీరమైన అభిప్రాయంతో ప్రముఖ అమెరికన్ కవయిత్రి 'ఎమిలీ డికిన్సన్' వలుకుతుంది. కొత్త కవిని గురించి చెబుతూ  మరో అమెరికన్ కవయిత్రి 'లిండా పాస్తాన్' ...'కొత్త కవి దొరకటమంటే / అడవిలో ఒక కొత్త పుష్పాన్ని కనుగొన్నట్లు...' అంటుంది. ఈ ప్రకటనతో నూతన కవుల ఆవిర్భావం ఓ వూరేకుల సున్నితత్వంతో మొదలవుతోంది.


ప్రజలకోసం కవిత్వంరాసే కవులపట్ల నిర్బంధాలు ఎంత భయంకరంగా వుంటాయో... మాతృభాష గుజరాత్ అయినా ఉర్దూ నేర్చుకుని, ఉర్దూలో అద్భుతమైన కవిత్వాన్ని అందించిన కవి 'జయంత్ పర్మార్'.  విభిన్నమైన శైలితో ఆకట్టుకునే వాక్య నిర్మాణంతో, భౌతికమైన ప్రతీకలతో కవితలను అలంకరిస్తూ, మాననీయ తత్వాలను కవితా వస్తువులుగా ఎన్నుకునే జర్మన్ అగ్రశ్రేణి భావకవి 'రెయ్నర్ మరియా రిల్కే'... తన కలం విన్యాసాన్ని ప్రదర్శిస్తూ 'నా కళ్లని ఆర్పేయ్, నేను నిన్ను చూస్తూనే ఉంటాను / నా చెవులు మూసేయ్. నిన్ను వింటూనే వుంటాను / కాళ్లు లేకుండా నీ వరకూ నా దారిని నేను చేసుకోగలను / నోరులేకుండా నీ పేరును నేను పలకగలను...' అంటూ వ్యక్తపరచిన ఆ భావసౌందర్యం పాఠకుల్ని తీవ్రమైన ఆలోచనల పంజరాలలో బంధిస్తోంది.

ప్రపంచ సంపదకు కారణమై నిలుస్తున్న కష్టజీవి రెక్కల కష్టాన్ని గుర్తించిన బంగ్లాదేశ్ జాతీయకవి, రవీంద్రుడి స్నేహితుడు 'ఖాజీ నజ్రూల్ ఇస్లాం'...ప్రగతిశీల మేధావిగా గుర్తించబడిన ఆ చేతి కలం అరుణకాంతులు ఉదయించే దిక్కుల్ని తన వాకిళ్లుగా మార్చుకున్న పరిణామాన్ని ఆయన కవితల్లో మనం దర్శించవచ్చు. పేదల్ని తన అక్కున చేర్చుకుని ఓదార్చిన మరో కవి ఈజిప్టు ప్రజాకవిగా సుప్రసిద్ధుడైన 'అహమ్మద్ నిగ్మ్. ప్రజల పక్షాన ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ ఆయన రాసిన కవితలు రక్తం మరిగి ఆవిరవుతున్న దృశ్యాలనుంచి మేఘాలు గర్జించినట్లుగా వుంటాయి. మృగాలు తిరిగే అరణ్యాలకంటే జనారణ్యాలే భయంకరమని, ప్రమాదకరమని 'బంధీ' కవితలో సూక్ష్మంగా వెల్లడించిన కవి, వియత్నాం జాతీయ ఉద్యమ నాయకుడు, సాహితీవేత్త 'హెూచి మీన్'.

నాన్నలది ఏ జన్మలోనూ తీర్చుకోలేని రుణం. నాన్నను తన సాహిత్య పూలరథం మీద ఊరేగిస్తూ... మలయాళ ప్రముఖకవి, నవలాకారుడు 'టి.పి. జైన్' తన కవితల వింజామరలు విసురుతాడు. పాలస్తీనా ప్రసిద్ధకవి 'మహ్మూద్ దర్వీష్... 'రాసుకో! నేను అరబ్బుని / నా గుర్తింపు సంఖ్య యాభయివేలు..' అంటూ రాళ్లగనిలో పనిచేసే ఒక కార్మికుడి మనోభావాలకు తన కవితలతో గొడుగుపట్టి కాలం తివాసీలమీద నడిపిస్తాడు. భారతీయ సంతతికి చెందిన మలేసియా ప్రముఖకవి 'సెసిల్ రాజేంద్ర' పర్యావరణవేత్త, చెట్ల వినాశనానికి వ్యతిరేకి... “నేను ఖడ్గమృగాలతో పోరాడుతాను...' అంటూ పర్యావరణ పరిరక్షణ కోసం అక్షరాల ఆయుధాలతో ఒక యుద్ధానికి తన సంసిద్ధతను ప్రకటిస్తున్నాడు.

అత్యంత ఖ్యాతిని సంపాదించుకున్న జపాన్ కవి 'షుంతారో తనికవ'. తన కవితలో ఒక కుక్కను కథానాయకుడ్ని చేసి, ఆ కుక్కలోని ఒక మహెూత్తరమైన గుణాన్ని, అగుణాన్ని మానవజాతి అలవరచుకోవలసిన అవసరాన్ని మర్మగర్భంగా తన కుక్క కవితలో మనోహరంగా చెప్పుతాడు. అత్యంత ప్రజాదరణ పొందిన జపాన్ జెన్ బౌద్ధ బిక్షువు, కవి అయిన 'రీ ఓ కన్ తైగూ' కిటికీలోంచి చంద్రుడ్ని చూస్తూ... 'దొంగ వదిలిపోయాడు / చంద్రుడిని / నా కిటికీ దగ్గర...' అంటూ అద్భుతమైన కవితను అందిస్తున్నాడు. అతి సూక్ష్మంగా అనంతమైన వ్యక్తీకరణ, కవిత్వంలో ఎలా సాధ్యమో నిరూపించిన కవి 'రీ ఓ కన్ తైగూ'. సిరియాలో జన్మించిన 'నిజర్ ఖబ్బాని' ప్రఖ్యాత సిరియా కవి. ఆయన రాసిన ప్రేమ కవితలు, ప్రేమ అనే వదానికి ఒక శాశ్వతమైన అందాన్ని ఇచ్చాయి. 'మా నాన్న కాందిశీకుడు, మా అమ్మ కూడా..." అంటూ వలస జీవితపు కష్టాలు అందించిన బెంగాలీ కవి 'సుబోధ్ సర్కార్' తన 'రెండు మంటల" కవితలో వ్యక్తవరచిన భావాలు పాఠకుడిలో ప్రకంపనాలను సృష్టిస్తున్నాయి. అరబ్బీ కవి 'ఖలీల్ జిబ్రాన్' కొన్ని భావాలను అద్భుతంగా వ్యక్తం చేస్తున్నారు. పునర్జన్మకు సరికొత్త నిర్వచనాన్ని తన 'ఇసుక-నురుగు' కావ్యంలో వ్యక్తపరుస్తున్నాడు. కవిత్వం గురించి ఖలీల్ గారు ఏమన్నారంటే 'కవిత్వమంటే అభిప్రాయ ప్రకటన కాదు / రక్తం స్రవించే గాయంనుంచి / వెలువడే ఒక పాట...' కవిత్వాన్ని గురించి ఇంత గొప్పగా చెప్పిన ప్రపంచ కవి మరొకరు లేరేమోననిపిస్తుంది.

హిందీ, వంజాబీ భాషల్లో కవితలు అందించిన 'గుల్జార్' ...ఒక నిజమైన దేశభక్తుడి ఛాయాచిత్రాన్ని ఒక కవితలో గొప్పగా చిత్రీకరిస్తాడు. ఈ కవితలో ఒక గొప్ప దృశ్యం మనతో మాట్లాడుతుంది. సిద్ధలింగయ్యగా పిలవబడే కన్నడ మొదటి దళితకవి...'రెక్కాడితే గాని, డొక్కాడని కూలీల కష్టాల్ని, నష్టాల్ని, బాధల్ని, ఏడ్పుల్ని... పాఠకుల్ని కదిలించే రీతిలో చాలా సమర్ధవంతమైన ఎన్నో కవితల్ని లోకానికి అందించాడు. ఒకవైపు తుపాకులు, మరొకవైపు వక్షుల కూతలు... ఈ రెండింటిని నమన్వయం చేస్తూ అస్సామీ కవయిత్రి 'నిర్మలప్రభ' రాసిన కవితలో అద్భుత భావాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు. 'నా కన్నీళ్లు రాళ్లయి / బూడిదలో పడుతున్నాయి / నిజమే అవి / బూడిదను తడవవు / కాని అస్త్రాలు చేసేందుకు / అవి పనికొస్తాయి..." అంటూ వాడిగా, ధాటిగా తన కవితను కొనసాగించారు. 'కొన్ని ప్రశ్నలతో / నా చేతి గోళ్లు తలెత్తినప్పుడు / వాటి తలల్ని నేను కత్తరించాను...' అంటూ సాగిన డోగ్రీ కవయిత్రి 'పద్మా సచ్దేవ్' కవిత మళ్లీ, మళ్లీ మనచేత చదివిస్తుంది.

నక్సలైట్ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన పంజాబీ కవి 'అమర్జీత్ చందన్' ...'నన్ను తొడుక్కో..' అన్న కవితలో తన భావాలను చాలా శక్తివంతంగా అందిస్తున్నాడు... భారతదేశపు ఈశాన్యప్రాంతం అరుణాచలప్రదేశ్ కు చెందిన ప్రకృతి కవయిత్రి 'మమంగ్ దాయి' తన జన్మస్థలం గురించి, వేదనతో కూడిన భావాల్ని...'మబ్బు తల్లికి వర్షం పిల్లలం మేము / రాయికి, గబ్బిలానికి సహోదరులం...' అంటూ తన నేల గర్వపడే రీతిలో కవిత్వాన్ని చిత్రీకరిస్తున్నారు. పాకిస్తాన్ లో వుట్టి, అమెరికా పౌరసత్వం తీసుకుని, ఆస్ట్రేలియాలో స్థిరవడ్డ పాకిస్తాన్ కవయిత్రి 'నోషీ గిలానీ' ఒక మహిళ మానసిక వేదనను చాలా ధైర్యంతో " ఈ ఖైదీ బ్రతికే వుంటుంది..' అన్న కవితను రాస్తారు. ఈ కవిత, ఈ ప్రపంచంలో ఆడవాళ్ల కన్నీళ్లు అదృశ్యమైపోయే దాకా... తన గొంతును వినిపిస్తూనే వుంటుంది. పోలాండ్ ప్రముఖ కవయిత్రి, 'మారియా కూబెరెస్కా' కవిత్వాన్ని ఎలా రాయాలో అన్న అంశంమీద ఆమె చాలా కవితలు రాశారు. 'కవిత కోసం సూచనపత్రం అందులో ఒక భాగమే. 2011లో సాహిత్యానికి నోబెల్ బహుమతి అర్హుల జాబితాలో చేర్చిన పేరు కే. సచ్చిదానందన్. అద్వితీయమైన సాహితీమూర్తిగా కీర్తించబడుతున్న ఈ సాహితీవేత్త, దూరంగా వెళుతున్న ఒక రైలును తన కవిత్వం పట్టాల మీద నడిపించిన తీరు అద్భుతంగా వుంటుంది.

విశిష్టమైన పోలిష్ కవయిత్రి, నాటకకర్త 'ఆనా స్వీర్' ...'నేను కిటికీ తెరుస్తాను' అనే కవితలో ఒంటరితనపు మానసిక సంఘర్షణను సాహిత్య శిఖరాల అంచుల్లో అందిస్తున్నారు. 'మనుష్య పుథిరిన్' గా పేరుపొందిన తమిళకవి మానవజీవిత సత్యాలను, వాటి మూలాలను సాహిత్యవరంగా వెలికితీయటంలో అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ కవితలు రాశారు. మాతృభాష ఆవశ్యకత గురించి వేలాది గొంతులు మనకు వినిపిస్తూనే వున్నాయి. అలా మాతృభాష గురించి ఈ పుస్తకంలో గట్టిగా వినిపిస్తున్న గొంతు ఆదివాసీ కవయిత్రి 'జసింత కెర్ కెట్టా'. భూమి మీద తనకున్న ప్రేమను అద్వితీయంగా వ్యక్తం చేసిన ఆఫ్ఘనిస్తాన్ కవి 'పార్తా నదేరి'. మహాత్మాగాంధీ మరణ దృశ్యాన్ని కవిత్వవు కటకాలతో నిక్షిప్తం చేసిన కవి 'సీతాకాంత ''మహాపాత్ర'. శిలాక్షరాలుగా నిలిపోయే మణిపూర్ ప్రముఖకవి 'రాజకుమార్ భుబోన్' అందించిన కవితలను ఈ పుస్తకంలో మనం చూడవచ్చు. అందులో 'వేటగాడు-కోతి' కవిత చాలా ప్రామాణికత కలిగిన కవిత...'నేను నీగ్రోని రాత్రంత నల్లనివాడిని / నా ఆఫ్రికా లోతులంత నల్లవాడిని ... " ఈ మాటలు అమెరికాలో ఆఫ్రికన్-అమెరికన్ల దుస్థితిని ప్రధాన పస్తువుగా తీసుకుని 'లాంగ్ స్టన్ హ్యూజ్' రాసిన కవితలోనివి.

ఇలా వందలాది కవితలు అత్యన్నత ప్రమాణాలతో ఒక జీవనది ప్రవాహంలా ఈ పుస్తకంలో ప్రవహిస్తూనే వున్నాయి. ప్రపంచంలోని ఇన్ని భాషల కవిత్వాన్ని తన మాతృభాష తెలుగులోకి అత్యంత సమర్ధనీయంగా, మాతృక కవిత అస్తిత్వానికి, ఆ హృదయ సౌందర్యానికి, ఆ భాషా సొగసులకు, ఏమాత్రం భంగం కలగని మహత్తరమైన రీతిలో ఈ అనువాద ప్రక్రియను నిర్వహించి, అత్యంత విలువైన ప్రపంచ సాహిత్యాన్ని ఆస్వాదించే అవకాశాన్ని కల్పించిన సాహితీమూర్తి ముకుంద రామారావు గారికి సమస్త తెలుగు సాహితీలోకం తరువున హృదయపూర్వక అభినందనలు అందిస్తున్నాను.

click me!