చైనా, ఇతర దేశాలతో వాణిజ్య లోటును వెంటనే సరిచేస్తానని ట్రంప్ అన్నారు. సుంకాల వల్ల అమెరికాకు లాభం ఉంటుందని చెప్పారు. ప్రతీకార సుంకాలపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నా, సొంత దేశానికి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు..
చైనా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో అమెరికాకు ఉన్న ఆర్థిక లోటును సరిచేయడానికి సుంకాలను అమలు చేయాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాదు, జో బైడెన్ హయాంలో ఈ దేశాలతో వాణిజ్య మిగులు పెరిగిందని, దానిని వెంటనే తిప్పికొడతానని, సుంకాల వల్ల అమెరికాకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు.
ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ఈ విషయమై ఓ పోస్ట్ చేశారు.'చైనా, యూరోపియన్ యూనియన్ తో పాటు ఇతర చాలా దేశాలతో మనకు భారీ ఆర్థిక లోటు ఉంది. సుంకాలను విధిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దీని ద్వారా అమెరికాకు వేల కోట్ల డాలర్లు వస్తాయి. ఇది ఇప్పటికే అమల్లోకి వచ్చింది. చూడటానికి చాలా బాగుంది" అని అన్నారు.
'జో బైడెన్ అసమర్థ అధ్యక్షతన ఈ దేశాలతో మిగులు పెరిగిపోయింది. మనం దాన్ని తిప్పికొడతాం. వీలైనంత త్వరగా చేస్తాం. అమెరికాకు సుంకాలు ఎంత ముఖ్యమో ఏదో ఒక రోజు ప్రజలు తెలుసుకుంటారు" అని ఆయన పేర్కొన్నారు.
యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం ప్రకారం.. 2024లో చైనాతో మొత్తం వాణిజ్యం 582.4 బిలియన్ డాలర్లుగా ఉంది. చైనాకు అమెరికా ఎగుమతులు 143.5 బిలియన్ డాలర్లు. ఇది 2023 కంటే 2.9 శాతం తక్కువ. చైనా నుంచి అమెరికా దిగుమతులు 438.9 బిలియన్ డాలర్లు. ఇది 2023 కంటే 2.8 శాతం ఎక్కువ. అమెరికా వాణిజ్య లోటు 295.4 బిలియన్ డాలర్లు. ఇది 2023 కంటే 5.8 శాతం ఎక్కువ అని తెలిపింది.
మరోవైపు, యూరోపియన్ యూనియన్‌తో అమెరికా మొత్తం వాణిజ్యం 975.9 బిలియన్ డాలర్లుగా ఉంది. యూరోపియన్ యూనియన్‌కు అమెరికా ఎగుమతులు 370.2 బిలియన్ డాలర్లు. ఇది 2023 కంటే 0.7 శాతం ఎక్కువ. యూరోపియన్ యూనియన్ నుంచి అమెరికా దిగుమతులు 605.8 బిలియన్ డాలర్లు. ఇది 2023 కంటే 5.1 శాతం ఎక్కువ. అమెరికా వాణిజ్య లోటు 235.6 బిలియన్ డాలర్లు. ఇది 2023 కంటే 12.9 శాతం ఎక్కువ.
ఏప్రిల్ 2న ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరిలో రెండోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే, ట్రంప్ కొత్త వాణిజ్య విధానాన్ని ప్రకటించారు. అమెరికా వస్తువులపై ఇతర దేశాలు ఎంత సుంకం విధిస్తాయో, అంతే సుంకం అమెరికా కూడా విధిస్తుందని తెలిపారు.
ప్రకటన ప్రకారం, ఇతర ప్రధాన దేశాలపై దిగుమతి సుంకాలు ఇలా ఉన్నాయి. చైనా (34 శాతం), యూరోపియన్ యూనియన్ (20 శాతం), వియత్నాం (46 శాతం), తైవాన్ (32 శాతం), జపాన్ (24 శాతం), ఇండియా (26 శాతం), యునైటెడ్ కింగ్‌డమ్ (10 శాతం), బంగ్లాదేశ్ (37 శాతం), పాకిస్తాన్ (29 శాతం), శ్రీలంక (44 శాతం), ఇజ్రాయెల్ (17 శాతం).
ఏప్రిల్ 9 నుంచి అమెరికాతో ఎక్కువ వాణిజ్య లోటు ఉన్న దేశాలపై ఎక్కువ సుంకాలు విధిస్తారు. దీని ప్రభావం భారత్‌పై కూడా ఉంటుంది. భారత్ నుంచి జరిగే అన్ని ఎగుమతులపై 26 శాతం సుంకం విధిస్తారు.