సంక్షోభం అంచున ఆఫ్ఘనిస్తాన్ బ్యాంకింగ్ సెక్టార్.. రిజర్వుల నిలిపివేతతో కుదేలు

By telugu teamFirst Published Sep 28, 2021, 5:02 PM IST
Highlights

తాలిబాన్లు అధికారంలోకి రాకమునుపే ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నామమాత్రంగా నెట్టుకొస్తున్నది. తాలిబాన్ల అధికారంలోకి రావడంతో పశ్చిమ దేశాల నుంచి సహాయం నిలిపేయడం, వరల్డ్ బ్యాంక్, ద్రవ్యనిధి నుంచీ సొమ్ము తీసుకునే అవకాశం మూతపడటం, అమెరికాలోని ఆఫ్ఘనిస్తాన్ రిజర్వుల నిలిపివేతల ఫలితంగా అక్కడి బ్యాంకింగ్ రంగం ఎప్పుడు కుప్పకూలుతుందో చెప్పలేని పరిస్థితికి చేరింది.
 

న్యూఢిల్లీ: గత రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్‌(Afghanistan)లో జరిగిన ఘర్షణలతో దేశం అతలాకుతలమైంది. తాలిబాన్లు(Taliban) అధికారాన్ని చేజిక్కించుకోవడంతో ఈ పరిస్థితులు పాతాళానికి దిగజారాయి. ఏ క్షణాన ఏ రంగం కుదేలవుతుందో చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం(Banking Sector) సంక్షోభం(Crisis) అంచున ఉన్నది. ఏ క్షణాన కుప్పకూలుతుందో అన్నట్టుగా పరిస్థితులున్నాయి. అమెరికాలోని అఫ్ఘనిస్తాన్ రిజర్వుల(Reserves) నిలిపివేత దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఇదే విషయాన్ని ఇస్లామిక్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ చీఫ్ సయ్యద్ మూసా అల్ ఖలీమ్ అల్ ఫలాహి తెలిపారు. దేశంలో ఫైనాన్షియల్ సెక్టార్ ఎప్పుడూ కుదేలవుతుందో చెప్పలేమని అన్నారు. ప్రజలు భారీ స్థాయిలో నగదు విత్ డ్రా చేసుకుంటుండంతో ఈ పరిస్థితులు తలెత్తాయని వివరించారు. ప్రస్తుతం దేశంలో చాలా బ్యాంకులు పనిచేయడం లేదని తెలిపారు.

ఆఫ్ఘనిస్తాన్ ప్రధానంగా దిగుమతి ఆధారిత దేశం. కొండప్రాంతం అత్యధికంగా ఉండే ఈ దేశంలో పంటసాగు విస్తీర్ణం తక్కువగా ఉంటుంది. తిండి గింజలు, కూరగాయాల్లోనూ చాలా భాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. అక్కడ డిజిటల్ ఎకానమీ పెద్దగా లేకపోవడంతో ప్రజలందరూ చాలా వరకు నగదుపైనే ఆధారపడుతారు. ఈ నేపథ్యంలోనే తాలిబాన్ ఆక్రమణకు ముందు నుంచే బ్యాంకింగ్ రంగం తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నది.

ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో 40శాతం మేరకు నిధులు విదేశాల నుంచి సాయం రూపకంగా వచ్చేవే. విదేశీ సాయం, ప్రపంచ బ్యాంకు నిధులపైనే ఆఫ్ఘనిస్తాన్ ఆధారపడుతుంది. కానీ, తాలిబాన్లు అధికారాన్ని ఏర్పాటు చేశాక పశ్చిమ దేశాలు నిధులను పూర్తిగా నిలిపేశాయి. వరల్డ్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి కూడా సొమ్ము తీసుకోకుండా చేశాయి. దీని ఫలితంగా దేశం సంక్షోభం అంచుల్లోకెళ్లింది. తాలిబాన్లు ఆర్థికం కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడటాన్ని మొదలెట్టారని అల్ ఫలాహి తెలిపారు.

ఇటు పశ్చిమ దేశాలు సహాయాన్ని నిలిపేయడంతో చైనా, రష్యాలవైపు తాలిబాన్లు చూస్తున్నారు. ఇప్పటికే చైనా సుమారు 31 మిలియన్ల యువాన్లను సహాయం చేసింది. కానీ, అవి దేశ అవసరాల్లో ఏ మూలకు సరిపోలేవు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా వెళ్తున్నదని నార్వేజియన్ రిఫ్యూజీ కౌన్సిల్ హెచ్చరించింది. దేశంలో నగదు లేకపోవడంతో ప్రజలు అవస్థపడుతున్నారని, ఇప్పటికి ఇండ్లలో మిగిలిన టీ, రొట్టె ముక్కలతోనే కడుపు నింపుకుండటాన్ని చూశానని ఎన్‌ఆర్‌సీ సెక్రెటరీ జనరల్ జన్ ఎగిలాండ్ పేర్కొన్నారు.

click me!