Hyderabad: హైదరాబాద్‌లో ఆహార భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లకు తక్కువ ధరల పేరుతో కల్తీ మాంసం, పాడైపోయిన చేపలు సరఫరా చేస్తున్న రెండు వేర్వేరు ముఠాలను అధికారులు పట్టుకున్నారు.
హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లిలో నిర్వహిస్తున్న ఓ మాంసం దుకాణంపై హెచ్-ఫాస్ట్ అధికారులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో వ్యాపారి మహమ్మద్ ఉస్మాన్ ఖురేషి మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలిపి తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అధికారులు సుమారు 50 కిలోల అనుమానాస్పద మాంసాన్ని స్వాధీనం చేసుకుని, ప్రయోగశాల పరీక్షల కోసం నమూనాలను నాచారంలోని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు. పరీక్షల రిపోర్టుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
24
కుళ్లిన చేపలు, రొయ్యలకు రసాయనాలు కలిపి సరఫరా
మరోవైపు మంగళ్‌హాట్ ప్రాంతంలోని "తార ఫిషరీస్" దుకాణంపై టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాడైపోయిన చేపలు, రొయ్యలను రసాయనాలతో శుభ్రం చేసి తాజావిగా చూపిస్తూ హోటళ్లు, కేటరింగ్ నిర్వాహకులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో శంకర్ సింగ్, మాన్ సింగ్, గులాబ్ సింగ్, రోహిత్ సింగ్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.90 వేల విలువైన 100 కిలోల కుళ్లిన రొయ్యలు, 162 కిలోల చేపలు, 10 కిలోల సోడియం బైకార్బోనేట్ పౌడర్, ఆరు బస్తాల ఉప్పును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి, ఈ సరఫరా నెట్‌వర్క్ వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
34
ఎద్దు మాంసాన్ని ఎలా గుర్తించాలి? నిపుణులు చెప్పే సూచనలు
మాంసం కొనుగోలు చేసే సమయంలో కొన్ని విషయాలు గమనిస్తే అనుమానాస్పద పరిస్థితులను గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే కేవలం చూసి మాత్రమే కచ్చితంగా నిర్ధారించడం సాధ్యం కాదు. ప్రయోగశాల పరీక్షల ద్వారానే తుది నిర్ధారణ జరుగుతుంది. మేక మాంసం సాధారణంగా లేత ఎరుపు రంగులో ఉంటుంది. ఎద్దు మాంసం మాత్రం మరింత ముదురు ఎరుపు లేదా గోధుమరంగు ఛాయతో కనిపించే అవకాశం ఉంటుంది.
ఎద్దు మాంసంలోని కండరాల తంతువులు సాధారణంగా కొద్దిగా మందంగా ఉంటాయి. మేక మాంసం తంతువులు సన్నగా ఉంటాయి. కొవ్వు రంగులో కూడా తేడా ఉండొచ్చు. మేక మాంసంలో కొవ్వు ఎక్కువగా తెల్లగా ఉండగా, ఎద్దు మాంసంలో కొన్నిసార్లు పసుపు ఛాయ కనిపించవచ్చు. అసాధారణంగా తక్కువ ధరకు మాంసం విక్రయిస్తే అప్రమత్తంగా ఉండాలి. లైసెన్స్ ఉన్న మాంసం దుకాణాల నుంచే కొనుగోలు చేయడం, బిల్లు తీసుకోవడం మంచిది.
Biriyani lovers should be careful…
Two Detained for Mixing #Beef with #Mutton & Supplying It to Hotels in #Hyderabad.
Two persons Mohad Osman & Mohd Jahangir were detained after officials uncovered a racket involving the mixing of beef with mutton for supply to hotels in… pic.twitter.com/V6LFv4MVLu
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ సంస్థలు నాణ్యత లేని మాంసం, చేపలను కొనుగోలు చేయకుండా సరఫరాదారుల వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ప్రజలు కూడా అనుమానాస్పదంగా కనిపించే మాంసం, చేపలు విక్రయిస్తున్న దుకాణాలు లేదా ఆహార పదార్థాల నాణ్యతపై సందేహాలు ఉంటే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి కల్తీ ఆహార పదార్థాల వల్ల ఫుడ్ పాయిజనింగ్‌తో పాటు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.