యాద‌గిరిగుట్ట‌, స్వర్ణగిరి ఒక్క రోజులో చుట్టేసి వచ్చే టూర్ ప్లాన్.. తక్కువ ఖర్చుతోనే ప్యాకేజీ

Published : Jul 03, 2026, 10:50 AM IST

Tour: వీకెండ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఒకరోజు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలనుకునే వారికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి యాదాద్రి, కొలనుపాక, స్వర్ణగిరి, పోచంపల్లిలను సందర్శించే అవకాశం కల్పించింది. 

PREV
15
ఒకే రోజులో ఐదు ప్రముఖ ప్రదేశాల సందర్శన

ప్రతి శనివారం నిర్వహించనున్న ఈ ప్రత్యేక ప్యాకేజీలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, శిల్పారామం, చారిత్రక కొలనుపాక జైన మందిరం, స్వర్ణగిరి ఆలయం, ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామం భూదాన్ పోచంపల్లి వంటి ఐదు ముఖ్య ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికత, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయ కళలు అన్నింటినీ ఒకే ప్రయాణంలో ఆస్వాదించేలా ఈ టూర్‌ను రూపొందించారు.

25
ఉదయం ప్రయాణం మొదలు

ప్రతి శనివారం ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌లోని యాత్రి నివాస్ నుంచి ఏసీ మినీ బస్సు బయలుదేరుతుంది. అనంతరం బేగంపేట పర్యాటక భవన్, బషీర్‌బాగ్ సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకుని యాదాద్రి వైపు ప్రయాణం కొనసాగుతుంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో యాదాద్రికి చేరుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం కల్పిస్తారు. దర్శనం అనంతరం హరిత హోటల్‌లో అల్పాహారం ఏర్పాటు చేశారు.

35
ఆధ్యాత్మిక యాత్రతో పాటు చారిత్రక, సాంస్కృతిక అనుభవం

అల్పాహారం తర్వాత గ్రామీణ కళలు, హస్తకళలకు ప్రసిద్ధి చెందిన శిల్పారామాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి దక్షిణ భారతదేశంలో అత్యంత పురాతన జైన దేవాలయాల్లో ఒకటైన కొలనుపాక జైన మందిరానికి తీసుకెళ్తారు. మధ్యాహ్నం భువనగిరిలోని హోటల్‌లో భోజనం అనంతరం స్వర్ణగిరి ఆలయ దర్శనం ఉంటుంది. తర్వాత అంతర్జాతీయ గుర్తింపు పొందిన చేనేత గ్రామం భూదాన్ పోచంపల్లిని సందర్శించే అవకాశం కల్పిస్తారు. అక్కడ హరిత హోటల్‌లో అల్పాహారం చేసి సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రి 7.30 గంటలకు సిటీకి తిరిగి చేరుకుంటారు.

45
టికెట్‌లోనే అన్ని సౌకర్యాలు

ఈ టూర్ ప్యాకేజీలో రెండు వైపులా ఏసీ మినీ బస్సు ప్రయాణం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పహారం, ఆలయ దర్శన ఏర్పాట్లు అన్నీ టికెట్ ధరలోనే ఉంటాయి. దీంతో ప్రత్యేకంగా భోజనం లేదా ప్రయాణ ఏర్పాట్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. కుటుంబంతో కలిసి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

55
టికెట్ ధర, బుకింగ్ వివరాలు

ఈ ప్రత్యేక వన్‌డే టూర్‌కు పెద్దలకు రూ.2,070, పిల్లలకు రూ.1,770గా టికెట్ ధర నిర్ణయించారు. ప్రతి శనివారం మాత్రమే ఈ టూర్ నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న వారు బషీర్‌బాగ్‌లోని సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అలాగే అధికారిక వెబ్‌సైట్ tgtdc.in ద్వారా కూడా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. వీకెండ్‌ను ఆధ్యాత్మికంగా, ఆహ్లాదకరంగా గడపాలనుకునే వారికి ఈ టూర్ ప్యాకేజీ మంచి ఎంపికగా చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories