Telangana Rains: హైదరాబాద్ మళ్లీ వర్ష బీభత్సం మొదలైంది. ప్రస్తుతం వానలు దంచికొడుతున్నాయి. కొన్ని రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న వానతో నగర జీవనం అతలాకుతలమవుతోంది. వాతావరణ శాఖ ఇప్పటికే హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత ఉధృతం కానుందని హెచ్చరికలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం నగరంలోని బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామాంతపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్‌పురా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో రహదారులు చెరువులను తలపించాయి. ఉప్పల్‌లో ట్రాఫిక్ సమస్యలు, అమీర్‌పేట్, మైత్రివనం వద్ద వాటర్‌లాగింగ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి.