దయచేసి గుర్తుంచుకో, నీ పక్కన ఉన్నది ఓ పొలిటిషన్... ద్యుతీ చంద్‌తో ప్రధాని మోదీ...

First Published Aug 18, 2021, 12:38 PM IST

 ఆగస్టు 15న ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథులుగా భారత అథ్లెట్లు... ప్రతీ అథ్లెట్‌ను ఆత్మీయంగా పలకరించిన ప్రధాని మోదీ...

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. విశ్వ క్రీడల చరిత్రలోనే అత్యధికంగా ఏడు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు, చాలా విభాగాల్లో పతకాలు సాధించికపోయినా అదిరిపోయే పర్ఫామెన్స్‌తో భవిష్యత్తుపై ఆశలు రేపారు. 

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్లకు అరుదైన గౌరవం కల్పించింది భారత ప్రభుత్వం. ఆగస్టు 15న ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారత అథ్లెట్లు, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమయంలో అథ్లెట్లతో ప్రత్యేకంగా ముచ్చటించిన ప్రధాని మోదీ... కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు... 

ఫలితంతో సంబంధం లేకుండా ఒలింపిక్స్ కోసం ఐదేళ్లుగా కష్టపడుతున్న అథ్లెట్లు అందరినీ అభినందించారు ప్రధాని నరేంద్ర మోదీ. కేవలం పతకాలు సాధించిన వారిని మాత్రమే సత్కారించి, పలకరించి వదిలేయకుండా... విశ్వవేదికపై భారత్‌ తరుపున పోరాడిన అథ్లెట్ల కష్టాన్ని ఆయన పేరుపేరునా కొనియాడారు. 

పతకం సాధించకపోయినా వారి కష్టానికి, అంకిత భావానికి, అన్నింటికీ మించి పట్టువదలకుండా చూపించిన తెగువ హర్షనీయమని ఆయన అన్నారు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత తాత్కాలిక నిషేధానికి గురైన భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్‌తో ప్రధాని వ్యవహరించిన విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ రింగ్‌లో పోరాడే అథ్లెట్లకు, రింగ్ బయట సపోర్టుగా ఉండాల్సిన బాధ్యత మనదేనంటూ గుర్తు చేశారు. క్రీడాకారులకు వాడిపాడేసే ప్లాస్టిక్ గ్లాసుల్లా చూసే ఫెడరేషన్లకు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు.

అంతేకాకుండా అథ్లెట్లతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ ప్రతీ చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. భజరంగ్ పూనియా గాయం, లవ్‌లీనా తల్లి గురించి, హాకీ పురుషుల జట్టు గోల్ కీపర్ శ్రీజేశ్ గోల్ పోస్టుపై కూర్చున్నదీ... నీరజ్ చోప్రా రెండో త్రో వేసిన తర్వాత స్వర్ణం వచ్చేసిందని ఫిక్స్ అయిపోయి ఎలా సెలబ్రేట్ చేసుకున్నదీ అడిగి తెలుసుకున్నారు...

భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్, తన ముందున్న మైక్‌లో మాట్లాడబోయి, అది పనిచేస్తుందా? లేదా? అని ఆలోచిస్తూ అడిగిపోయింది. అప్పుడు ప్రధాని వెంటనే... ‘దయచేసి గుర్తుంచుకో, నీ పక్కన ఉన్నది ఓ రాజకీయ నాయకుడు. కాబట్టి ఎప్పుడూ ఈ మైక్ పనిచేయదేమో అని అనుమానించకు’ అంటూ చమత్కరించి, అందర్నీ నవ్వించారు. 

ప్రతీ అథ్లెట్ కూడా వచ్చే రెండేళ్లలో 75 స్కూళ్లలో పర్యటించాల్సిందిగా కోరిన ప్రధాని... అక్కడి పిల్లలకు పౌష్టికాహారం, సమతుల్య ఆహారం గురించి, దాని ప్రాధాన్యం గురించి తెలపాలని కోరారు. అలాగే వారిలో 10 నిమిషాలు ఏదైనా ఆట ఆడి, వారిలో క్రీడలపై ఆసక్తి, ఉత్సాహం నింపాలని తెలిపారు...

click me!