ఆదివారం షూటింగ్‌లో సిద్ధార్థ్ బాబు, దీపక్, ఆవనీ లేఖరా బరిలో దిగుతుంటే... పారా బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో సుహాస్ యతిరాజ్, తరుణ్ దిల్లాన్, కృష్ణ నగర్... బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ కాంస్య పతక మ్యాచ్‌లో పలక్ కోహ్లీ, ప్రమోద్ భగత్ బరిలో దిగనున్నారు.
బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్4 విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్ లో రజతం నెగ్గిన సుహాస్ యతిరాజ్ ఓ ఐఏఎస్ అధికారి. సుహాస్ పూర్తిపేరు సుహాస్ లలినకెరె యతిరాజ్... కర్ణాటకలో జన్మించిన సుహాస్, ఎన్‌ఐటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశాడు...
ఐఏఎస్‌గా ఆగ్రా, అరాంఘడ్, జాన్‌పూర్, సోన్‌బద్రా, ప్రయాగ్‌రాజ్ జిల్లాలకు మేజిస్టేట్‌గా వ్యవహరించిన సుహాస్ యతిరాజ్ ప్రస్తుతం నోయిడాలోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాకి మేజిస్టేట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు...
బ్యాడ్మింటన్ ఫైనల్స్ చేరిన సుహాస్, ఫ్రెంచ్ ప్లేయర్ లూకా మజ్యుర్ చేతిలో పోరాడి ఓడాడు. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో రజతం సాధించాడు. పారాలింపిక్స్‌లో పతకం సాధించిన మొట్టమొదటి భారత ఐఏఎస్ అధికారిగా సరికొత్త చరిత్ర లిఖించాడు సుహాస్...
పారాలింపిక్స్ 2020లో ఇప్పటిదాకా మూడు మ్యాచులు ఆడిన సుహాస్, మొదటి రెండు మ్యాచులను 20 నిమిషాల్లో ముగించాడు. ఇండోనేషియా ప్లేయర్‌తో జరిగిన సెమీ ఫైనల్ 31 నిమిషాల్లో ముగిసింది...
2007 బ్యాచ్‌కి చెందిన సుహాస్‌కి కాళ్లు రెండు సరిగా లేవు. ఫైనల్‌లో ఫ్రాన్స్‌కి చెందిన లూకా మజ్యుర్ తో హోరాహోరీగా తలపడి మూడు సెట్ల వరకు ఆటను తీసుకొచ్చి వరల్డ్ నెంబర్ 1 కి గట్టి పోటీ ఇచ్చాడు. ప్రత్యర్థి ప్రతి పాయింట్ కోసం శ్రమించాడు.
‘నా పని అంతా అయిపోయిన తర్వాత రాత్రి 10 గంటలకి నేను బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేయడం మొదలెడతారు. రోజూ రెండు గంటలు బ్యాడ్మింటన్ ఆడతా. నేను ఆరేళ్లుగా నా ఆటనూ, పనిని పక్కాగా మేనేజ్ చేయగలుగుతున్నా...
ఓ టోర్నీ ప్రారంభోత్సవానికి అతిథిగా వెళ్లిన నేను, అక్కడ పోటీపడాలని ఆశపడ్డాను. అప్పటి నుంచి నాకు ఇది హాబీగా మారిపోయింది. చిన్నతనం నుంచి బ్యాడ్మింటన్ ఆడుతున్నా.. ఆ టోర్నీలో జిల్లా స్థాయి ప్లేయర్లను ఓడించడంతో నా ఆత్మవిశ్వాసం బలపడింది...’ అంటూ చెప్పుకొచ్చాడు సుహాస్ యతిరాజ్...
పారా బ్యాడ్మింటన్ కోచ్ గౌరవ్ ఖన్నా ప్రోత్సాహంతో తొలిసారిగా 2016లో బీజింగ్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న సుహాస్ యతిరాజ్, నాన్ ర్యాంక్ ప్లేయర్‌గా బరిలో దిగి, స్వర్ణ పతకం సాధించిన మొట్టమొదటి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు...
ఫైనల్ లో సుహాస్ ఓటమి చెందినప్పటికీ... ఆటతీరుతో యావత్ భారతీయుల మనసులను గెలిచి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. కలెక్టర్ గా సేవలందిస్తూనే ఒలింపిక్స్ లో పోటీపడి మెడల్ గెలవడం మామూలు విషయమా చెప్పండి. సోషల్ మీడియా అంతా సుహాస్ కి శుభాకాంక్షలు అంటూ హోరెత్తిపోతుంది. వెల్ డన్ కలెక్టర్ సాబ్..!