ప్రేమ అంటే చాలామందికి తీయని మాటలు, పెద్ద పెద్ద వాగ్దానాలే గుర్తొస్తాయి. కానీ సైకాలజీ ప్రకారం నిజమైన ప్రేమలో హడావిడి ఉండదు. అది సైలెంట్ గా ఉంటుంది. కొన్ని పనుల ద్వారా బయటపడుతుంది. మరి నిజంగా ప్రేమించే వాళ్లు చేసే పనులేంటి? సైకాలజీ ఏం చెప్తోంది?
నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా? అనే మాట వినడానికి ఎంత మధురంగా ఉన్నా, సైకాలజీ నిపుణుల ప్రకారం నిజమైన ప్రేమ మాటల్లో కన్నా చేతల్లోనే ఎక్కువగా బయటపడుతుంది. ఎందుకంటే మాటలు పరిస్థితుల్ని బట్టి మారిపోవచ్చు, కానీ ప్రవర్తన మాత్రం మన లోపలి భావాలను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. మనల్ని నిజంగా ప్రేమించే వ్యక్తులు పెద్ద పెద్ద డైలాగులు చెప్పకపోయినా, చిన్న చిన్న పనుల ద్వారా తమ ప్రేమను తెలియజేస్తుంటారు. సైకాలజీ ప్రకారం, ఈ చర్యలే వారి ప్రేమ ఎంత లోతైనదో చెప్పే సంకేతాలు.
28
మన భావాలను అర్థం చేసుకోవడం
సైకాలజీ ప్రకారం మనల్ని నిజంగా ప్రేమించే వారు మన మాటలను శ్రద్ధగా వింటారు. వినడం అంటే విని వదిలేయడం కాదు. మన భావాలను అర్థం చేసుకోవడం. మనం ఏదైనా చెప్పేటప్పుడు మధ్యలో అడ్డుకోవడం, ఫోన్‌లో మునిగిపోవడం కాకుండా, మన కళ్లలోకి చూసి, స్పందిస్తూ వినడం ప్రేమకు ముఖ్యమైన సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. మన బాధను తేలికగా తీసుకోకుండా, నీకు అలా ఎందుకు అనిపించింది? అని అడగడం వంటివి వారికి మనపై ఉన్న ప్రేమను చూపిస్తాయి.
38
కష్టకాలంలో తోడుగా ఉండటం
సైకాలజీ ప్రకారం నిజమైన ప్రేమ సంతోషంలో కాదు సమస్యలు వచ్చినప్పుడు బయటపడుతుంది. మనల్ని నిజంగా ప్రేమించే వారు మనం బలహీనంగా ఉన్నప్పుడు, మనసు విరిగినప్పుడు, ఓటమిలో ఉన్నప్పుడు మనల్ని వదిలిపెట్టరు. నేను నీతోనే ఉన్నాను అనే భావనను కల్పిస్తారు. ఇది మాట కాదు, ఒక అనుభూతి. ఈ విధమైన మద్ధతు మనకు భద్రతా భావాన్ని కలిగిస్తుంది.
ప్రేమ పేరుతో నియంత్రించడం, అనుమానించడం, మన స్వేచ్ఛను హరించడం నిజమైన ప్రేమ కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిజంగా ప్రేమించే వారు మన అభిప్రాయాలకు, నిర్ణయాలకు గౌరవం ఇస్తారు. మనకు కొంత వ్యక్తిగత సమయం కావాలనుకుంటే అర్థం చేసుకుంటారు. మన లక్ష్యాలు, కలలను చిన్నచూపు చూడకుండా ప్రోత్సహిస్తారు. ఈ గౌరవమే ఆరోగ్యకరమైన సంబంధానికి పునాదని సైకాలజీ చెబుతోంది.
58
చిన్న విషయాలు కూడా గుర్తుంచుకోవడం
సైకాలజీ ప్రకారం మనకు ఇష్టమైన ఆహారం, భయపడే విషయాలు, బాధపడే కారణాల వంటి వాటిని గుర్తుంచుకోవడం, వారికి మన మీద ఉన్న శ్రద్ధకు నిదర్శనం. మనం వారికి ప్రత్యేకమని, మన జీవితంలో వాళ్లు నిజంగా భాగమయ్యారని ఈ చిన్న పనులే చెబుతాయి.
68
ప్రవర్తనలో స్థిరత్వం
నిజంగా ప్రేమించే వారు ఒక రోజు మంచిగా, మరొక రోజు నిర్లక్ష్యంగా ఉండరు. వారి ప్రవర్తనలో స్థిరత్వం ఉంటుంది. కోపం వచ్చినా గౌరవాన్ని కోల్పోరు. తప్పు చేసినప్పుడు ఒప్పుకొని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. సైకాలజీ ప్రకారం ఇది భావోద్వేగ పరిపక్వతకు సూచిక. ప్రేమ అంటే పరిపూర్ణత కాదు, బాధ్యతతో కూడిన ప్రయత్నమని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.
78
మన ఎదుగుదలపై నిజమైన ఆసక్తి
మనల్ని నిజంగా ప్రేమించే వారు మన విజయాన్ని అసూయతో కాకుండా ఆనందంతో చూస్తారు. మనం మెరుగవ్వాలని కోరుకుంటారు. అవసరమైనప్పుడు నిజం చెప్పడానికి వెనకాడరు, కానీ అది బాధ పెట్టడానికి కాదు, మన మంచికే. ఇది తాత్కాలిక ఆకర్షణకు, లోతైన ప్రేమకు మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూపిస్తుంది.
88
స్వార్థం లేకుండా ప్రేమించడం
మనల్ని నిజంగా ప్రేమించేవారు ప్రేమలో స్వార్థం చూపించరు. నేను చేశాను కాబట్టి, నువ్వు కూడా చేయాలి అనే లెక్కలు లేకుండా , సహజంగా చేసే పనులే నిజమైన ప్రేమకు గుర్తు. సైకాలజీ నిపుణుల ప్రకారం ఇలాంటి ప్రేమ మన మానసిక ఆరోగ్యాన్ని బలపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, జీవితంపై నమ్మకాన్ని పెంచుతుంది.