Parenting Tips: చిన్న పిల్లల కళ్లకు కాటుక పెడితే ఏమవుతుందో తెలుసా?

Published : Aug 04, 2025, 04:13 PM IST

చిన్న పిల్లలకు కాటుక పెడితే దిష్టి తగలదని చాలామంది నమ్ముతారు. అందుకే వారి కళ్లకు, బుగ్గకు కాటుక చుక్క పెడుతుంటారు. అయితే పిల్లల కళ్లకు కాటుక పెట్టడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.  

PREV
14
చిన్న పిల్లల కళ్లకు కాటుక పెట్టవచ్చా?

చిన్న పిల్లల కళ్లకు కాటుక పెట్టడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. పిల్లలు పుట్టగానే వారి అమ్మమ్మ, నానమ్మలు లేదా పెద్దవారు ఇంట్లోనే కాటుక తయారు చేసి వారికి పెడుతుంటారు. మరికొందరు మార్కెట్లో దొరికే కాటుక డబ్బాలను కొని వాడుతుంటారు. కానీ పిల్లల కంటికి కాటుక పెట్టడం సురక్షితమేనా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం. 

24
కంటి ఆరోగ్యానికి..

మార్కెట్లో దొరికే చాలా కాటుకల్లో సీసం, పాదరసం వంటి విష పదార్థాలు ఉండే అవకాశం ఉంది. పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ రసాయనాలు కళ్లల్లో దురద, మంట, తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. కాటుకలో ఉండే రసాయనాలు దృష్టి నరాలను దెబ్బతీసి భవిష్యత్తులో అస్పష్టమైన దృష్టి లేదా శాశ్వత దృష్టి లోపానికి కూడా దారితీయవచ్చు. కొంతమంది పిల్లలకు కాటుకలోని రసాయనాల వల్ల అలెర్జీ వచ్చి కళ్లు ఎర్రబడటం, దురద, వాపు, నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి. కాటుకలో కలిసిన సీసం పిల్లల శరీరం ద్వారా శోషించబడి మెదడు అభివృద్ధి, నాడీ వ్యవస్థ, శరీర అవయవాల అభివృద్ధిని ప్రభావితం చేయవచ్చు.

34
అది అవాస్తవం!

రసాయనాలు కలిసిన కాటుక కన్నీటి నాళంలో అడ్డంకిని సృష్టించి కళ్ల నుంచి కన్నీరు బయటకు రాకుండా చేసి ఇన్ఫెక్షన్ కు దారితీయవచ్చు. కాటుక పెడితే కళ్లు పెద్దవి అవుతాయనేది పూర్తిగా అవాస్తవం. కళ్ల నిర్మాణం తల్లిదండ్రులు లేదా జన్యువులపై ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులకు పెద్ద కళ్లు ఉంటే పిల్లలకు కూడా పెద్ద కళ్లు ఉంటాయి. చిన్న పిల్లల కళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని మన వేళ్లతో తాకినప్పుడు కొన్ని సార్లు వారికి హాని కలిగే అవకాశం ఉంది. అందుకే చాలామంది వైద్యులు చిన్నపిల్లల కళ్లకు కాటుక పెట్టడాన్ని ప్రోత్సహించరు.

44
పిల్లల కళ్లకు కాటుక వాడితే..

అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వంటి వైద్య సంస్థలు పిల్లల కళ్లకు కాటుక వాడకూడదని సూచిస్తున్నాయి. కళ్లకు కాటుక పెడితే కళ్లు పెద్దవి అవుతాయని లేదా దృష్టి దోషం రాదని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పిల్లల కళ్లు చాలా సున్నితమైనవి. కాబట్టి ఎలాంటి రసాయనాలు కళ్లలో పడకుండా జాగ్రత్తపడటం ముఖ్యం. కాటుక పెట్టడం కంటే పిల్లలను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం. ఇది సంప్రదాయ ఆచారమైనా.. పిల్లల ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి కాటుక పెట్టకపోవడమే మంచిది. ఒకవేళ పెట్టాలి అనుకుంటే ఇంట్లో తయారుచేసిన లేదా రసాయనాలు లేని సురక్షితమైన కాటుకను వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.  

Read more Photos on
click me!

Recommended Stories