
ఈరోజుల్లో చాలా మంది పిల్లలు జంక్ ఫుడ్ తినడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అవి ఆరోగ్యానికి మంచిది కాదు అని మనం ఎంత చెప్పినా ఈ కాలం పిల్లలు వినేలా లేరు. ఆరోగ్యకరమైన ఆహారం తినమని బతిమిలాడినా తినరు. కానీ.. బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్ లాంటివి తినమంటే మాత్రం ప్యాకెట్లు ప్యాకెట్లు తినేస్తారు. మీ పిల్లలు కూడా అంతేనా? మీ పిల్లలతో ఆ జంక్ ఫుడ్ మానేపించాలని ప్రయత్నించి విఫలమయ్యారా? అయితే.. కేవలం మీరు ఒకే ఒక్క పని చేయడం వల్ల పిల్లలు జంక్ ఫుడ్ కి దూరం అయ్యే అవకాశం ఉంది. మరి, అదేంటో తెలుసుకుందామా...
పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్స్, బిస్కెట్లు, చిప్స్ లాంటి జంక్ ఫుడ్స్ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిలో పిల్లలను ఆకర్షించే బొమ్మలు పెట్టడం వల్ల.. వారు వాటిని తినడానికి మరింత ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వాటి ప్యాకింగ్ కూడా చూడగానే తినేయాలి అనిపించేలా ఉంటాయి. దీంతో.. అవి కొనాల్సిందేనని పిల్లలు మారాం చేస్తుంటారు. పిల్లలు ఏడవడం చూడలేక పేరెంట్స్ కూడా కొనిస్తూ ఉంటారు. కానీ, అవి బయటకు ఆకర్షణీయంగా కనిపించినా.. లోపల మాత్రం ఆరోగ్యంగా ఉంటాయి అనే గ్యారెంటీ లేదు. వీటిని తినడం వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువ. అందుకే, పిల్లలకు అలాంటి ఫుడ్ ని దూరం చేయాలి. దాని కోసం వాళ్లను కొట్టడం, తిట్టడం లాంటివి చేయడం వల్ల ఉపయోగం ఉండదు. వారిని ఏమీ అనకుండానే.. వారితో ఈ జంక్ ఫుడ్స్ అలవాటును మాన్పించవచ్చు.
మనం బయట ప్యాకేజ్డ్ ఫుడ్ ఏది కొన్నా.. దాని మీద ఆ ఫుడ్ ని దేనితో తయారు చేస్తారు అని క్లియర్ గా రాసి ఉంటుంది. దీనినే ఫుడ్ లేబుల్ అంటారు. ముందుగా మనం వాటిని పిల్లలతో చదివించడం అలవాటు చేయాలి. ఒక ప్యాకెట్ ఆ ఫుడ్ తినడం వల్ల ఎన్ని పోషకాలు అందుతాయి. చక్కెర ఎంత ఉంది? ఎంత శాతం మైదా ఉంది లాంటివన్నీ క్లియర్ గా రాసి ఉంటాయి. ఏదైనా ఫుడ్ లో చక్కెర, మైదా, పామాయిల్ లాంటివి ఉన్నాయి అంటే.. అవి ఆరోగ్యానికి మంచిది కాదు అని అర్థం. ఈ విషయాన్ని నెమ్మదిగా పిల్లలకు అర్థం అయ్యేలా చేయవచ్చు.
ప్యాకెట్ ఫుడ్స్‌లో చాలామంది గుర్తించని హానికర పదార్థాలు చాలా ఉంటాయి. వీటిలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ కలర్స్ (Red 40, Yellow 5 వంటివి), మాల్టోడెక్స్ట్రిన్ (చక్కెరను బాగా పెంచే పదార్థం), మైదా (పోషకాలేని ఖాళీ పిండి), పామ్ ఆయిల్ (హార్ట్ సమస్యలకు కారణం), ప్రిజర్వేటివ్స్ (షెల్ఫ్ లైఫ్ పెంచుతాయ్ కానీ ఆరోగ్యానికి హానికరం) ఉన్నాయి. వీటిని ఎలా గుర్తించాలో పిల్లలకు వివరించాలి. ఉదాహరణకు, పదార్థం చివరగా "-ఇట్", "-ఏట్" అనే పదాలతో ఉంటే అది ఒక రకమైన రసాయనం అని గుర్తించాలి.
ఇది బోరుగా అనిపించకుండా, గేమ్‌లా మారుస్తే పిల్లలు ఆసక్తిగా నేర్చుకుంటారు. ఉదాహరణకు, "ఈ చాక్లెట్స్ లో ఎలాంటి కలర్స్ ఉన్నాయో చూద్దాం" అని అడగవచ్చు. రెండు స్నాక్స్ తీసుకొని, ఏది ఆరోగ్యంగా ఉందో పోల్చమని చెప్పవచ్చు. అంతేకాదు, కొన్ని దేశాల్లో ఫుడ్ ప్యాకెట్లపై 1 నుంచి 5 వరకు స్టార్ రేటింగ్‌లు ఉంటాయి. వాటి ద్వారా పిల్లలు ఏవి ఆరోగ్యానికి మంచిదో, ఏది కాదో తెలుస్తుంది.
ఆరోగ్యానికి నష్టం చేసే పదార్థాలపై దృష్టి పెట్టడమే కాదు, మంచివి ఎవరైనా తెలుసుకోవాలి. హోల్ ఫుడ్స్ (వేరుశెనగలు, డ్రై ఫ్రూట్స్, ఓట్స్ లాంటివి), అధిక ఫైబర్ ఉన్న ఆహారం, మంచి ప్రొటీన్ (గుడ్లు, పప్పులు, పన్నీర్), ఆరోగ్యకరమైన కొవ్వులు (నట్స్, ఆలివ్ ఆయిల్) ఉన్న ఫుడ్స్‌ను ఎంచుకోవడం ఎలా అనే విషయాన్ని పిల్లలకు తెలియజేయాలి.
చివరగా, లేబుల్ చదవడం ఓ అలవాటుగా మారాలంటే, ప్రాక్టీస్ చాలా అవసరం. కిరాణా షాపింగ్‌కు వెళ్లినప్పుడు, లేదా ఇంట్లో ఫ్రిజ్‌లో ఉన్న స్నాక్స్‌ను తీసుకొని వాటి లేబుల్స్‌ను కలిసి చదవడం అలవాటుచేయండి. పిల్లలు చూసి నేర్చుకుంటారు కనుక, మీరు ఫుడ్ ఎంపికలు తీసుకుంటున్నప్పుడు "ఇది ఎక్కువ చక్కెర ఉంది, ఇంకో yogurt చూద్దాం" లాంటి మాటలు వారితో పంచుకోవాలి. “ఇది మంచి ఎంపిక ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంది” అంటూ చెప్పడం ద్వారా వాళ్లలో నెగెటివ్ మైండ్‌సెట్ కాకుండా, ఆరోగ్యకరమైన ఆలోచన పెంపొందుతుంది.
ఇలా చిన్న వయసులోనే ఫుడ్ లేబుల్ చదవడం నేర్పితే, అది వారికి ఒక జీవితాంతం ఉపయోగపడే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యంగా తినడం అంటే కేవలం ఏది తినాలి, ఏది తినకూడదనే విషయమే కాదు... సరైన ఎంపికను గుర్తించగలిగే చిత్తశుద్ధిని పెంపొందించడమే. ఇది నేర్పించడం వల్ల పిల్లలు కచ్చితంగా జంక్ ఫుడ్ లను దూరం పెట్టే అవకాశం ఉంది.