పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వడం అవసరం. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం పిల్లల ఎదుగుదలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి పిల్లలకు మధ్యాహ్నం ఎలాంటి ఫుడ్ పెట్టాలో.. ఏది పెట్టకూడదో ఇక్కడ చూద్దాం.
పిల్లల ఆరోగ్య వికాసానికి రోజువారీ లంచ్ బాక్స్ ఎంతో కీలకమైనది. పిల్లల శరీరానికి అవసరమైన శక్తి, మేథస్సు, రోగనిరోధక శక్తి వంటివి మధ్యాహ్నం తీసుకునే ఆహారంతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. ప్రత్యేకించి స్కూల్‌కు వెళ్లే సమయంలో పిల్లలు ఎక్కువ సమయం బయట గడుపుతారు కాబట్టి, సరైన పోషణతో కూడిన లంచ్ బాక్స్ వారి శరీరానికి నిరంతర శక్తినిచ్చి, చదువుపై దృష్టి నిలకడగా ఉండేలా చేస్తుంది.
26
ఈ సమస్యలు దూరం..
సాధారణంగా పిల్లలు ప్రాసెస్డ్ స్నాక్స్‌కి ఎక్కువగా ఆకర్షితులవుతారు. కానీ ఇంట్లో తయారు చేసిన హెల్తీ లంచ్ బాక్స్.. వారి శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అంతేకాదు అలసట, జీర్ణ సమస్యలు, ఏకాగ్రత లోపం, తరచూ ఆకలి వేయడం వంటి సమస్యలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
36
పోషకాలతో కూడిన ఆహారం
హెల్తీ లంచ్ బాక్స్ అంటే ఒకటి, రెండు మంచి ఐటమ్స్ పెట్టడం కాదు. పిల్లల శరీరానికి అవసరమైన పోషకాలను సమతుల్యంగా ఇవ్వడం. పోషకాహార నిపుణుల ప్రకారం.. ఒక లంచ్ బాక్స్‌లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అన్నీ ఉండటం ముఖ్యం. కార్బోహైడ్రేట్లు పిల్లలకు తక్షణ శక్తినిస్తాయి. ప్రోటీన్లు ఆసక్తిని పెంచడానికి, శరీర వికాసానికి సహాయపడతాయి. ఫైబర్ పుష్కలంగా ఉన్న ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మంచి ఫ్యాట్స్ మెదడు అభివృద్ధికి తోడ్పడుతాయి.
పిల్లల లంచ్ బాక్స్ లో చపాతీ, అన్నం, ఉప్మా, బ్రౌన్ రైస్, పప్పు, పెరుగు, పచ్చి కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి పెట్టాలి. ఇవి పిల్లల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇష్టపడే వేయించిన పదార్థాలు, అధిక ఉప్పు, చక్కెర ఉన్న ప్యాకేజ్డ్ స్నాక్స్‌ను వీలైనంతవరకు తగ్గించడం మంచిదని సూచిస్తున్నారు. ఇవి తాత్కాలిక రుచినిచ్చినా.. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించలేవని చెబుతున్నారు.
56
ఫుడ్ కాంబినేషన్స్
పిల్లల కోసం హెల్తీ లంచ్ బాక్స్ సిద్ధం చేయడం అంత కష్టమేమి కాదు.. సరైన కాంబినేషన్లు తెలుసుకుంటే చాలు. సింపుల్ కార్బ్స్ + ప్రోటీన్ అంటే గోధుమ రొట్టెతో పన్నీర్ కర్రీ, లేదా బ్రౌన్ రైస్‌తో పప్పు వంటివి తేలికగా జీర్ణమవుతాయి. దీర్ఘకాలిక శక్తిని ఇస్తాయి. అలాగే ఫైబర్ రిచ్ సైడ్స్ ఇవ్వడం చాలా ముఖ్యం. చిన్న బాక్సులో కీర, క్యారెట్ స్టిక్స్, ఉడకబెట్టిన గింజలు, లేదా సీజనల్ ఫ్రూట్ పెట్టడం వల్ల పిల్లలు సహజమైన విటమిన్లు, మినరల్స్ పొందుతారు. వాటితో పాటు తక్కువ మొత్తంలో నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ పెట్టొచ్చు. ఇవి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
66
ఇంట్లో చేసే స్నాక్స్
లంచ్ బాక్స్ రెడీ చేసేటప్పుడు.. పిల్లలు ఇష్టపడే రుచిని కూడా దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం. కాబట్టి ఇంట్లోనే తక్కువ నూనెతో తయారు చేసిన హెల్తీ స్నాక్స్ వారానికి ఒకటి రెండు సార్లు ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న కాంబినేషన్ల ద్వారా పిల్లలకు శక్తి, రుచి, పోషకాలు అన్నింటినీ సమతుల్యంగా అందించడమే లంచ్ బాక్స్ లక్ష్యం కావాలని సూచిస్తున్నారు.