వందలయేళ్ళ చరిత్ర అద్భుతమైన శిల్ప నైపుణ్యం అత్యంత ఎత్తైన గాలిగోపురం సుందరమైన ప్రకృతితో కృష్ణా తీరంలో వెలిసిన మదన గోపాలస్వామి ఆలయంలో రుక్మిణి సత్యభామ సహిత శ్రీకృష్ణుడి మూర్తులు దర్శనమిస్తాయి. గాలిగోపురం ప్రధాన ద్వారం తలుపులు ప్రధానాకర్షణ కాగా లోపల నిర్మించిన ప్రధాన ఆలయం ముందున్న మండపం శిల్పకళా నైపుణ్యానికి దర్పణంగా నిలుస్తాయి. రామాయణంలోని జటాయువు పోరాట నేపథ్యంతోనే ఈ గ్రామానికి జటాయుపురమని కాలక్రమంలో జటప్రోలు అని పేరొచ్చిందని చరిత్ర కారులు పేర్కొంటున్నారు. 16వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి సురభి వంశస్థులు ఆలయ ధర్మకర్తలుగా వుంటున్నారు. కొన్నేళ్ళక్రితం ఆలయాన్ని దేవాదాయశాఖ పరిధిలోనికి తెచ్చారు. మద్దిమడుగు ఈఓ నే ఇంచార్జ్ గా వుంటున్నారు.
పట్టించుకునే నాథులే కరువు:
ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన జటప్రోలు ఆలయం ప్రధాన గాలిగోపురాన్ని చూస్తేనే నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎత్తైన గాలిగోపురంపై చెట్లు పెరిగినా పట్టించుకునే నాథులే కరువైయ్యారు. ఆలయంలోపల, చుట్టూవున్న మండపాల స్థితి ఘోరంగా ఉంది. చెట్లపొదలతో ఆధ్యాత్మికతను దూరంచేసేలా పరిసరాలు మారాయి. సురభి వంశస్థులు పట్టించుకోకపోగా దేవాదాయశాఖ కూడా పట్టించుకోకపోవడం విచారకమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముంపు ఆలయాలను ముంచేశారు:
ఉమ్మడి రాష్ట్రంలో నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీశైలం ముంపు గ్రామాలైన మాంచాలకట్ట తదితర గ్రామాల నుండి ఇరవైకి పైగా ఆలయాలను ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి జటప్రోలు వద్ద పునర్నిర్మించారు. మద్రాస్ నుండి ప్రత్యేకంగా స్ధపతులను శిల్పులను రప్పించి ముంపు గ్రామాల ఆలయాలకు జీవం పోశారు. అంతవరకు బాగానేవున్నా తర్వాతికాలంలో ఆలయాల సంరక్షణ పూర్తిగా విస్మరించడంతో కళావిహీనంగా మారాయి. ముళ్ళ పొదలమధ్య దూపదీప నైవేద్యాలకు నోచుకోకుండా శిథిలావస్థకు చేరువవుతున్నాయి. సురభి వంశస్థులతో పాటు దేవాదాయశాఖ పర్యాటకశాఖ సమన్వయంతో చారిత్రక ఆలయాలకు పునర్వైభవం తేవాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు.
మాన్యాలు మాయం:
జటప్రోలు ఆలయ నిర్వహణ సజావుగా సాగేందు కోసం జటప్రోలు సంస్థానాధీశులు వందల ఎకరాలు కేటాయించగా అందులో ప్రస్తుతం కొంతభూమి మిగిలింది. కౌలు దారులు సాగు చేసుకుంటున్నప్పటికీ ఏటేటా వచ్చే ఆదాయం ఎటుపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సమన్వయంతో దృష్టిపెట్టి అభివృద్ధిచేస్తే ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెంది ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు
గుడి చరిత్ర ఘనం: ఆదిత్య, ఆలయ పూజారి, జటప్రోలు
జటప్రోలు ఆలయానికి దశాబ్దాల చరిత్ర ఉంది. అద్భుత శిల్ప సంపదతో అలరారుతోంది. ఆలయ స్థలపురాణం రామాయణ గాథతో ముడిపడివుంది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపునకు గురవుతున్న గ్రామాలనుంచి ఆలయాలను పురావస్తుశాఖ సహకారంతో సురక్షితంగా తరలించి జటప్రోలు గ్రామంలో పునఃప్రతిష్టించారు. ఉప ఆలయాలయాల సముదాయం కూడా ఈ గ్రామంలో ఉంది. ఇంచార్జ్ ఈఓ పర్యవేక్షణలో జటప్రోలు ఆలయాలున్నాయి.
పునర్నిర్మాణంలో కూలీని: జటప్రోలు స్థానికుడు
ఆలయ పునర్నిర్మాణ సమయంలో ఏడు రూపాయల కూలికి పనిచేశాను. మద్రాస్ నుండి శిల్పులను రప్పించి గుడి కట్టిండ్రు. వాళ్ళ భాష మాకు తెలిసేది కాదు మా భాష వాళ్లకు అర్థమైయ్యేది కాదు. సుమారు నాలుగేళ్లకుపైగా నిర్మాణం పనులు జరిగాయి. గప్పుడు బాగానే వుండే గుడి ఇప్పుడు పట్టించుకుంటలేరు.