రాఫెల్ యుద్ధ విమానాలు నిన్న భారత దేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ 5 విమానాలు ఫ్రాన్స్ నుంచి బయల్దేరింది మొదలు మీడియా ఫోకస్ అంతా వాటివైపు మళ్లింది. ఆ విమానాలు భారత గగనతలంలోకి ఎంటర్ అయి ల్యాండ్ అయ్యేంతవరకు వాటి లైవ్ కవేరజ్. ఆ తరువాత వాటి ప్రత్యేకతలపై డిబేట్లు. అన్ని వెరసి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానంపై అసలు ఫోకస్ లేకుండా పోయింది.
కేంద్రం నిన్న నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చింది. 1986 తరువాత ఇదే నూతన విద్య విధానం. కస్తూరి రంగన్ కమిటీ సూచనలకు 34 ఏండ్ల తరువాత నిన్న ఆమోదముద్ర తెలిపారు.ఈ నూతన విద్యా విధానంలో ప్రభుత్వం దాదాపుగా 27 కీలకమైన అంశాలకు సంబంధించి మౌలికమైన మార్పులను చేసింది.
మార్కుల కోసం పాకులాట, పుస్తకాల మోత, బట్టి విధానం మొదలైన వాటన్నిటికీ మంగళం పాడేందుకే ఈ విధానంలో కొన్ని కీలకమైన మార్పులను చేసారు. 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనే లక్ష్యాన్నినిర్దేశించింది.
ఇప్పటిదాకా అమలులో ఉన్న ‘10+2’(పదవ తరగతి,ఆ తరువాత ఇంటర్మీడియట్) ఉండదు. 1 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలు ఇకపై 5+3+3+4 పద్దతిలో తమచదువులనుసాగిస్తారు. మార్కుల కోసం జరిగే పోరుకు స్వస్తి పలుకుతూ....‘బోర్డు ఎగ్జామ్స్’కు ఈ విధానంలోప్రాధాన్యం తగ్గిపోయింది. ఇకపైపరీక్షలుమార్కుల కోసం కాకుండా విద్యార్థి నైపుణ్యాన్ని, అవగాహనను, నేర్చుకున్న అంశాలను నిజ జీవితంలో ఉపయోగించే విధానాన్ని (నాలెడ్జ్ప్రాక్టికల్ అప్లికేషన్)లను పరీక్షించే విధంగాఉంటాయి.
విద్యార్ధి మూడవ సంవత్సరం నుంచే విద్యను అభ్యసించడం మొదలు పెడతాడు. ఈ నూతన 5+3+3+4 పద్దతిలో 5వ తరగతి వరకు విద్యాబోధన అంతా కూడా మాతృ భాష ప్రాంతీయ భాషలోనే జరగాలి. వీలయితే 8వ తరగతి వరకు మాతృభాషలోనే కొనసాగించాలి. ఇప్పుడు ఈ నూతన విద్య విధానం ఏపీముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై నీళ్లు చల్లనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 నుండి 6వతరగతి వరకు ఇంగ్లీష్ లోనే విద్యాభ్యాసం అని సంకల్పించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రభుత్వం 81, 85 నెంబర్ జీవోలనుసైతం తీసుకువచ్చింది. వాటిని హై కోర్టు కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తూ.... హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ గత నెల ఆరంభంలోసుప్రీమ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోప్రాథమిక స్థాయిలో(1-6 వరకు)ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్ప వేరే మాధ్యమం ఉండదు అని తీసుకువచ్చిన జివోలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య చట్టంలో కూడా సవరణలను చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్.
ఇప్పుడు నూతన విద్యావిధానంలోనే మార్పులు తీసుకురావడం, 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన ను తప్పనిసరి చేయడం వల్ల జగన్ ప్రభుత్వ ఆశలపైన నీళ్లు చల్లడమే అవుతుంది. ప్రతిష్టాత్మకంగా జగన్ సర్కార్ ఇంగ్లీష్ మీడియం లో మాత్రమే విద్యాబోధన అనే దానికి ఇది పూర్తిగా విరుద్ధం.
విద్య అనేది ఉమ్మడి జాబితాలోని అంశం. దానిపై రాష్ట్రం తన సొంత నిర్ణయాలను తీసుకొని కేంద్ర నిర్ణయాన్ని పక్కన పెట్టలేదు.విద్యార్ధి పూర్తిస్థాయి సమగ్ర ఆభివృధికి 5వ తరగతి వరకు మాతృ భాషలో విద్యాభ్యాసం తోడ్పడుతుందని కస్తూరి రంగన్కమిటీ అభిప్రాయపడింది.
ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధనను ప్రారంభించే ముందుదాన్ని బోధించడానికి ఏపీలో శిక్షణ పొందినఉపాధ్యాయులు ఉన్నారా అనేది ఒక ప్రశ్న. ఉపాధ్యాయులు దొరికినా వారంతా ప్రాథమిక విద్యాబోధనకు ట్రైనింగ్ పొందిన టీచర్లా లేక పై తరగతులకు చెప్పేవార అనేది కూడా ఆలోచించాల్సిన విషయం.
మన టీచర్లలో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు అని రెండు రకాల టీచర్లు ఉంటారు. ఎస్జీటీలు కింద తరగతులకు చదువు చెబితే... స్కూల్ అసిస్టెంట్లు పై తరగతులకు విద్యను బోధిస్తారు. ఇప్పుడు ఇలా ఇంగ్లీష్ మీడియంలో ప్రాథమిక విద్యను బోధించగలిగేంతమంది టీచర్లు ఉన్నారా అనేది ప్రధాన సమస్య. టీచర్లకు ఇంగ్లీష్ రాకపోయినా, ఒకవేళ ఇంగ్లీష్ లో చెప్పగలిగినా వారు గనుక ప్రాథమిక విద్యను బోధించడంలో శిక్షణ పొంది లేకపోతే దండగే అవుతుంది.
కేవలం ఇంగ్లీష్ మాధ్యమాన్ని మాత్రమే అందుబాటులో ఉంచడం ఇక్కడ వచ్చిన అసలు సమస్య. దీనివల్ల రెండు ప్రశ్నలు ముఖ్యంగా ఉద్భవిస్తున్నాయి. ఇంగ్లీష్ మాధ్యమం వద్దు అనుకునే వారికి వేరే ఆప్షన్ లేకుండా పోతుంది.
దానితో పాటుగా ఒక విద్యార్ధికి ప్రాథమికంగా ఉండే విద్య హక్కుకు భంగం వాటిల్లుతుంది. ఆ సదరు విద్యార్థి చదువుకుందామనుకున్న మాధ్యమంలో చదువు అందుబాటులో ఉండక చదువు మానేసే ఆస్కారం కూడా లేకపోలేదు. వీటిని పరిగణలోకి తీసుకునే హైకోర్టు ఏపీ ప్రభుత్వ జీవోను కొట్టేసేందుకు కారణమయి ఉంటాయి.
ఇప్పుడు ఏకంగా కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానంలోనే మాతృ భాషకు అత్యధిక ప్రాధాన్యాన్ని కల్పించడంవల్ల, మాతృభాషలోనే విద్యాభ్యాసం తప్పనిసరి చేయడం వల్ల జగన్ ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనకు బ్రేకులు పడ్డట్టే.