
Summer Tour Plans : వేసవికాలం వచ్చేసింది... ఎండలు ముదిరిపోతున్నాయి. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాఫ్ డే మాత్రమే స్కూళ్ళు నడుస్తున్నాయి. ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి పిల్లలు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు... ఫైనల్ ఎగ్జామ్స్ ముగియగానే సమ్మర్ హాలిడేస్ ఇవ్వనున్నారు. ఇలా చదువు ఒత్తిడికి గురయిన మీ పిల్లలతో సరదాగా ఏదైనా టూర్ కి వెళ్లాలని భావిస్తున్నారా..? అయితే మీరు తప్పకుండా సమ్మర్ లో కూడా చల్లగా ఉండే పర్యాటక ప్రాంతాలకు వెళ్ళాల్సిందే.
ఈ వేసవిలో ఇంట్లోనే ఉండి ఏసీల కింద కాలక్షేపం చేయడం కంటే పిల్లల్ని ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్తే ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తిండిపోతాయి. మరి ఇండియాలో ఎండల సెగ తగలకుండా, పిల్లలతో సరదాగా గడపడానికి ఉత్తమమైన పర్యాటక ప్రాంతాలు ఏవో ఓ లుక్కేద్దామా?
దక్షిణ భారతీయుల హిమాలయాలుగా ఊటీని పేర్కొంటారు. ఇది ప్రకృతి ప్రేమికులకు స్వర్గం. దక్షిణాది ప్రజలకు వేసవి విడిది అనగానే మొదట గుర్తొచ్చే పేరు ఊటీ. ఎత్తైన నీలగిరి కొండల మధ్య ఉండే ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో నిండివుంటుంది... కాబట్టి పిల్లలకు బాగా నచ్చుతుంది.
ఇక్కడికి వెళితే పిల్లలు తప్పకుండా ఇష్టపడేది టాయ్ ట్రైన్.. కొండల మధ్య నుండి సాగే ఈ ప్రయాణం పిల్లలకు ఓ అద్భుత అనుభవాన్ని ఇస్తుంది. వేసవిలో కూడా చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఈ ప్రయాణం సాగుతుంది.. ఎత్తైన చెట్లు, చుట్టూ కొండలు, ఆ కొండల అంచుల్లో కాఫీ తోటలు... ఈ ప్రకృతి అందాలను చూసి మీరే కాదు పిల్లలు కూడా మైమరచిపోతారు.
ఊటీకి వెళ్లినవారు తప్పకుండా బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్, మ్యాప్రో చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించవచ్చు. లేక్ లో బోటింగ్, ఇతర సాహసక్రీడలు చేయవచ్చు. ఇక ఊటీలో దొరికే హోమ్ మేడ్ చాక్లెట్స్ రుచి చూడటం మర్చిపోకండి.
అందమైన సముద్ర తీరాలు, పచ్చని కొబ్బరితోటలు, నీటి ప్రవాహాల మధ్య నివాసాలు... ఇలా సహజంగానే కేరళ ప్రకృతి అందాలకు నిలయం. అలాంటి రాష్ట్రంలో పర్యాటక ప్రాంతం అంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కేరళలోని మున్నార్ వెళ్తే కళ్ళకు పచ్చని రంగు తప్ప ఇంకేమీ కనిపించదు. ఇక్కడి చల్లని గాలి, మంచు కురిసే కొండలు మనసును ఆహ్లాదపరుస్తాయి. పచ్చని తివాచీలా కొండ అంచుల్లో పరుచుకున్న తేయాకు తోటలు భూతల్లికి చీరకట్టినట్లు ఉంటాయి.
మున్నార్ లో పిల్లలకు ప్రకృతి అందాలను చూపించడమే కాదు విజ్ఞానాన్ని కూడా పంచవచ్చు. ఇక్కడి ఎరవికుళం నేషనల్ పార్క్ లో ఉండే నీలగిరి తార్ (అడవి మేకలు)ను చూపించవచ్చు. అలాగే 'ఎకో పాయింట్' దగ్గర గట్టిగా అరిస్తే వినిపించే ప్రతిధ్వని పిల్లలకు భలే సరదాగా ఉంటుంది. ఇక టీ మ్యూజియం, మట్టుపెట్టి డ్యామ్, ఏనుగుల సవారీ వంటివి ఎంతగానో ఆకట్టుకుంటారు.
ఈ వేడివేడి సమ్మర్ చల్లచల్లగా గడపాలంటే చలో హిమాచల్ ప్రదేశ్ అనాల్సిందే. ఉత్తర భారత దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన హిల్ స్టేషన్లు ఇవి. మండు వేసవిలో కూడా ఇక్కడ మంచును ఆస్వాదించవచ్చు. అందుకే చాలామంది సమ్మర్ లోనే సిమ్లా, మనాలీని సందర్శిస్తుంటారు.
ఇక్కడ పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంజాయ్ చేసేందుకు అనేక సదుపాయాలు ఉన్నాయి. మనాలీలోని సోలాంగ్ వ్యాలీలో స్నో గేమ్స్, జోర్బింగ్ (Zorbing) వంటి సాహస క్రీడలు పిల్లలను అలరిస్తాయి. ఇక సహజంగా కురిసే మంచులో ఆడుకోవడం సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
సిమ్లాను "క్వీన్ ఆఫ్ హిల్స్" అని పిలుస్తారు. సముద్ర మట్టానికి సుమారు 2,200 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ నగరం ఉంటుంది. ఇక్కడ ఆపిల్ తోటలు కూడా పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక సిమ్లాలో బ్రిటీష్ కాలంనాటి పురాతన నిర్మాణాలు కూడా సందర్శించవచ్చు. చల్లని వాతావరణంలో సిమ్లాలో షాపింగ్ ను పెద్దవాళ్లే కాదు పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇక్కడ రోహ్‌తాంగ్ పాస్, మాల్ రోడ్, కుఫ్రీలోని అమ్యూజ్‌మెంట్ పార్క్ ను సందర్శించవచ్చు.
హిమాలయాల చెంతన ఉండే డార్జిలింగ్ సమ్మర్ టూర్ కు పర్పెక్ట్ ప్లేస్. అంతెత్తున ఠీవీగా నిలిచే కాంచనగంగా పర్వతశ్రేణులు డార్జీలింగ్ అందాలను రెట్టింపు చేస్తాయి... ఈ ప్రాంతంలోని టీ తోటలు ప్రపంచ ప్రసిద్ధగాంచాయి. చరిత్రాత్మక టాయ్ ట్రైన్ ప్రయాణం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ కొండలను చీల్చుకుని వస్తున్నట్లుగా జరిగే సూర్యోదయం, కొండల్లొకి జారుకునే సూర్యస్తమయం చూడటానికి కనువిందుగా ఉంటుంది.
డార్జిలింగ్ లో పద్మజ నాయుడు జూలాజికల్ పార్క్ లో కొన్ని జంతువులను తప్పకుండా చూడాల్సిందే... అందులో రెడ్ పాండాలు, మంచు చిరుతలు ముఖ్యమైనవి. టైగర్ హిల్, బటాసియా లూప్, పీస్ పగోడా చూడదగ్గ ప్రదేశాలు. మార్చి, ఏప్రిల్, మే ఈ మూడునెలలు డార్జిలింగ్ ను సందర్శించడానికి మంచి సమయం.
దీన్ని ఇండియా స్కాట్లాండ్ గా పేర్కొంటారు. కాఫీ తోటల వాసన, జలపాతాల సవ్వడి మధ్య గడపాలనుకుంటే కూర్గ్ సరైన ఛాయిస్. పిల్లలు ఇక్కడి దుబారే ఎలిఫెంట్ క్యాంప్ ను తప్పకుండా ఇష్టపడతారు. ఇక్కడ ఏనుగులకు స్నానం చేయించడం, వాటికి ఆహారం ఇవ్వడం వంటివి పిల్లలకు చాలా సరదాగా అనిపిస్తాయి. అలాగే అబ్బే ఫాల్స్, రాజా సీట్, గోల్డెన్ టెంపుల్ (టిబెటన్ మొనాస్టరీ) వంటి ప్రదేశాలు కూడా ఆకట్టుకుంటాయి.
ముందస్తు బుకింగ్ : వేసవిలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హోటల్స్, టికెట్స్ ముందే బుక్ చేసుకోండి.
దుస్తులు : హిల్ స్టేషన్లు కాబట్టి రాత్రి వేళల్లో చలి ఉంటుంది. వెంట స్వెటర్లు, జాకెట్లు తప్పనిసరిగా ఉంచుకోండి.
హైడ్రేషన్ : ఎండలో తిరిగేటప్పుడు పిల్లలకు తగినంత నీరు, పండ్ల రసాలు ఇస్తుండండి.