దేశ ప్రజలకు మోదీ మరోసారి కీలక సందేశం.. ఈ విష‌యాలు గుర్తుపెట్టుకోండి అంటూ

Published : Sep 01, 2026, 04:04 PM IST

PM Modi: 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ (GDP) వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైన నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్ర‌ధాని సూచించారు.

PREV
15
7.8 శాతం వృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు

ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు నమోదైన 7.8 శాతం ఆర్థిక వృద్ధి ప్రజల కృషి, సంకల్పానికి ప్రతిబింబమని ప్రధాని మోదీ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 7 శాతంతో పోలిస్తే తాజా వృద్ధి రేటు ఎక్కువగా ఉండటం విశేషమని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో భారత్‌ తన అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. దేశ ప్రజల భాగస్వామ్యం, కష్టపడే తత్వం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని మోదీ అభిప్రాయపడ్డారు.

25
యుద్ధాలు, సంక్షోభాల మధ్య భారత్‌ పురోగతి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాలు, ఇంధన సరఫరాకు సంబంధించిన సమస్యలు, అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతున్నాయని ప్రధాని గుర్తుచేశారు. వీటి ప్రభావంతో సరఫరా వ్యవస్థలు కూడా అనేక సందర్భాల్లో దెబ్బతిన్నాయని చెప్పారు. 2020లో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ దేశాలు వరుస సవాళ్లను ఎదుర్కొంటున్నాయని మోదీ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ముందుకు సాగడం దేశ సామర్థ్యాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. భారత్‌ ఆర్థిక పురోగతిపై కొందరు అనవసరమైన సందేహాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నప్పటికీ దేశ ప్రజలు వాటిని పట్టించుకోకుండా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారని మోదీ అన్నారు.

35
విదేశీ పర్యటనలకు బదులు దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యం

ఆర్థిక వృద్ధి మరింత బలపడాలంటే దేశీయంగా డబ్బు చలామణి పెరగాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించారు. ఇందులో భాగంగా అవసరం లేని విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని ప్రజలను కోరారు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లు నిర్వహించే బదులు భారత్‌లోనే వివాహ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివాహాలు, పర్యాటక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా స్థానిక వ్యాపారాలు, హోటళ్లు, రవాణా, సేవా రంగాలకు ఆదాయం పెరుగుతుందని ఆయన సందేశం ఇచ్చారు.

45
‘వోకల్ ఫర్ లోకల్’.. స్వదేశీ వస్తువుల వినియోగం పెంచాలి

భారత్‌ ఆత్మనిర్భర్‌గా ఎదగాలంటే ప్రజల కొనుగోలు విధానంలోనూ మార్పు రావాలని మోదీ అన్నారు. సాధ్యమైనంత వరకు దేశంలో తయారయ్యే ఉత్పత్తులు, స్థానికంగా అందుబాటులో ఉన్న సేవలను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ‘వోకల్ ఫర్ లోకల్’ భావనను ప్రజలు మరింత విస్తృతంగా స్వీకరించాలని సూచించారు. భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగితే దేశీయ తయారీ రంగం, చిన్న వ్యాపారాలు, సూక్ష్మ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు బలోపేతం అవుతాయని చెప్పారు. అలాగే అవసరం లేని సమయంలో బంగారం కొనుగోలు చేయకుండా ఉండటం కూడా దేశ ఆర్థిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని మోదీ పేర్కొన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రజలు ప్రత్యక్షంగా మద్ధతు ఇవ్వగలరని వివరించారు.

55
2047 నాటికి వికసిత్ భారత్‌ లక్ష్యం

భారత్‌ స్వాతంత్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తిచేసుకునే 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ప్రధాని మోదీ తెలిపారు. 140 కోట్ల మంది భారతీయులు ఐక్యంగా పనిచేస్తే దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం సాధ్యమవుతుందని అన్నారు. ముఖ్యంగా యువత ఆకాంక్షలకు అనుగుణంగా అవకాశాలను పెంచుతూ, ఆత్మనిర్భరతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక వృద్ధిని ఒక విజయంగా భావించడంతో పాటు, భవిష్యత్తులో మరింత వేగంగా అభివృద్ధి సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశీయ ఉత్పత్తుల వినియోగం నుంచి స్థానిక వ్యాపారాలకు మద్ధతు ఇవ్వడం వరకు ప్రతి చిన్న నిర్ణయం వికసిత్ భారత్‌ లక్ష్యానికి దోహదం చేస్తుందని మోదీ పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories